ఖిచడీచప్పుడు లేకుండా గుటుక్కు!

21 Sep, 2019 02:11 IST|Sakshi

ఆకేసి పప్పేసి నెయ్యేసీ బువ్వపెట్టి... అంటూ రకరకాలు కలిపి ఆకుమీద వేశాకే అది మృష్టాన్నం అవుతుంది. కానీ ఖిచిడీ అలా కాదు...  పప్పు నెయ్యి బియ్యం... ఇంకా ఎన్నెన్నో సంభారాలన్నీ కలిపి గిన్నెలో వేసేసి వండేస్తే చాలు... అన్నీ కలగలిసి అదే ఖిచిడీ అవుతుంది. ఆ ఆహారం సంపూర్ణమవుతుంది.  అప్పుడే అన్నప్రాశన చేసిన పిల్లాడి నుంచి మొదలుకొని అర్జెంటుగా ఆఫీసుకెళ్లాల్సిన పెద్దాళ్ల వరకు... పచ్చడీ కూరా చెట్నీ ఉన్నా బెంగలేదు... లేకున్నా పర్వాలేదు.

విడివిడిగానైనా, కలివిడిగానైనా కలుపుకోకుండానూ, కలుపుకొనైనా  రుచిరుచిగా వడివడిగా తినగలిగేది ఖిచిడీ! అన్నట్టు... మామూలు ఖిచిడీలే ఎందుకు...?  చూడగానే మింగాలి అనిపించే పాలక్, బెంగాలీ...  తినేసి బ్రేవున త్రేన్చాలనిపించే సాబుదానా, చెనాదాల్‌!! వీటన్నింటినీ వండేద్దాం...!   (ఖి)చడీచప్పుడూ లేకుండా గుటుక్కుమనిపిద్దాం!! రండి... ముందుగా వంట దినుసులు అందుకోండి.

సాబుదానా ఖిచిడీ
కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత.

తయారీ:
►సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి
►మరుసటి రోజు నీటిని వడ కట్టి సగ్గుబియ్యాన్ని పక్కనుంచాలి
►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసేసి, చేతితో మెత్తగా మెదపాలి
►వేయించిన పల్లీలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి
►ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఉడికించిన మెదిపిన బంగాళ దుంప, పంచదార, ఉప్పు వేసి కలపాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి
►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి
►తయారుచేసి ఉంచుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని జత చేసి ఐదారు నిమిషాల పాటు వేయించాలి
►బాగా ఉడికిన తరువాత దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి ప్లేట్లలో వేడివేడిగా అందించాలి.

బెంగాలీ ఖిచిడీ
కావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 2; లవంగాలు – 3; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; క్యాలీఫ్లవర్‌ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; క్యారట్‌ తరుగు – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 5 కప్పులు.

తయారీ:
►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి
►స్టౌ మీద పాన్‌లో పొట్టు పెసర పప్పును వేసి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించి, దింపి చల్లారాక, తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి నీరు వడ కట్టేయాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి
►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి
►అల్లం తురుము, పసుపు, మిరప కారం, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి
►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి
►బంగాళ దుంప తరుగు, క్యాలీఫ్లవర్‌ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి బాగా మెత్తబడేవరకు కలుపుతుండాలి
►వేయించిన పొట్టు పెసర పప్పు జత చేసి మరోమారు వేయించాలి
►వడ కట్టిన బియ్యం జత చేయాలి ’ ఐదు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలియబెట్టి, మూత పెట్టాలి ’ ఉడికిన తరవాత దింపేయాలి ’ పెరుగు, అప్పడాలతో వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

పాలక్‌ ఖిచిడీ
కావలసినవి: పాలకూర తరుగు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పెసర పప్పు – అర కప్పు; బాస్మతి బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; బంగాళ దుంప తరుగు – పావు కప్పు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – ఒకటి; లవంగాలు – 2; ఏలకులు – 2; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 4 కప్పులు.

తయారీ:
►ఒక పాత్రలో బియ్యం, పెసర పప్పు వేసి శుభ్రంగా కడగాలి
►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు అర గంట సేపు నానబెట్టాలి
►పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి
►జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి
►బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి
►టొమాటో తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడేవరకు వేయించాలి
►పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాక, పాలకూర పేస్ట్‌ వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి
►నానబెట్టిన బియ్యం, పెసర పప్పు వేసి, బాగా కలిపి, నాలుగు కప్పుల నీళ్లు జత చేయాలి
►ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టి, కుకర్‌ మూత ఉంచాలి
►నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙ఆనియన్‌ రైతా, సింపుల్‌ వెజిటబుల్‌ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.

ఓట్స్‌ ఖిచిడీ
కావలసినవి: నెయ్యి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; బిర్యానీ ఆకు – 1; టొమాటో తరుగు – పావు కప్పు; క్యారట్‌ తరుగు – పావు కప్పు; బంగాళదుంప తరుగు – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పొట్టు పెసర పప్పు – అర కప్పు (శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి); ఓట్స్‌ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – రెండున్నర కప్పులు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి
►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు జత చేసి కొద్దిసేపు వేయించాలి
►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
►తరిగిన కూరగాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మెత్తబడే వరకు వేయించాలి
►పెసర పప్పు జత చేసి, మరోమారు వేయించాలి
►ఓట్స్‌ జత చేయాలి ∙పసుపు, మిరప కారం వేసి, బాగా కలిపి, రెండున్నర కప్పుల నీళ్లు జత చేయాలి
►ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి
►నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►మూత తీసి కొత్తిమీరతో అలంకరించి, రైతా లేదా ఏదైనా ఊరగాయతో వేడివేడిగా అందించాలి. (ఈ విధంగా జొన్నలు, సజ్జలు, రాగులతో కూడా తయారుచేసుకోవచ్చు)

తామర గింజలు – గోధుమరవ్వ ఖిచిడీ
కావలసినవి: తామర గింజలు – పావు కప్పు; గోధుమ రవ్వ – అర కప్పు.; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 8; కొత్తిమీర – చిన్న కట్ట; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; జీలకర్ర – ఒక టేబుల్‌ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను

తయారీ :
►ముందుగా రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి
►రవ్వ వేసి బాగా కలియబెట్టి ఉడికించాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి
►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి
►ఉప్పు, నిమ్మ రసం జత చేయాలి
►ఒక పాత్రలో ఉడికించిన రవ్వ, వేయించిన మసాలా మిశ్రమం వేసి బాగా కలపాలి
►చివరగా తామర గింజలు జత చేసి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

స్వీట్‌ కార్న్‌ ఖిచిడీ
కావలసినవి: స్వీట్‌ కార్న్‌ గింజలు – మూడు కప్పులు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి) ; నెయ్యి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి ; పాలు – ఒక కప్పు; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి
►ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి
►స్వీట్‌కార్న్‌ ముద్ద వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి
►పాలు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి, సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు కార్న్‌ మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి
►నిమ్మ రసం జత చేసి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

సెనగ పప్పు ఖిచిడీ
కావలసినవి: బాస్మతి బియ్యం – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – అర కప్పు; ఇంగువ – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; నూనె  లేదా నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.

తయారీ:
►పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి లేదంటే వేడి నీళ్లలో అర గంట సేపు నానబెట్టాలి
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర గంట సేపు నానబెట్టాలి
►కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక, మిరప కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి
►సెనగ పప్పు జత చేసి బాగా కలిపి, ఒక కప్పుడు నీళ్లు పోసి, మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి (పప్పు పొడిపొడిలాడేలా ఉడికించాలి)
►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిగా పొడిపొడిలా ఉండేలా ఉడికించాలి
►ఉడికించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసి కలపాలి
►ఆనియన్‌ రైతాతో లేదా సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటుంది.

నాన్‌–వెజ్‌
అవధి గోష్‌ కుర్మా
కావల్సినవి: మటన్‌ ముక్కలు – 250 గ్రా.లు; దాల్చిన చెక్క – చిన్నముక్క; లవంగాలు – 6; యాలకులు – 6; చిరోంజి పప్పు – 3 టేబుల్‌ స్పూన్లు; బాదంపప్పు (నానబెట్టి, పొట్టు తీయాలి) – పావు కప్పు; నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లుక; అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – ఒకటిన్నర టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌; పసుపు – అర టీ స్పూన్‌; గరం మసాలా – టీ స్పూన్‌; పచ్చిమిర్చి – 3 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ తరుగు – ముప్పావు కప్పు; రోజ్‌ వాటర్‌ – టీ స్పూన్, ఉప్పు – తగినంత

తయారీ:
►మటన్‌ ముక్కలను శుభ్రం చేసి పక్కన ఉంచాలి
►తగినన్ని నీళ్లు పోసి చిరోంజిçపప్పు, బాదంపప్పు వేసి, పది నిమిషాలు ఉడికించి, మెత్తగా నూరి పక్కన ఉంచాలి
►మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలపాలి
►మటన్‌ ముక్కలు వేసి 5–6 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో కప్పు టొమాటో గుజ్జు కలిపి ఉడికించి, బాదాంపప్పు మిశ్రమం, కారం, ఉప్పు, కప్పు నీళ్లు పోసి, సన్నని మంట మీద ఉడికించాలి
►చివరగా రోజ్‌ వాటర్, గరం మసాలా వేసి మరికొన్ని నిమిషాలు ఉంచి, మటన్‌ ముక్క ఉడికిందా లేదా సరిచూసుకోవాలి
►వేడి వేడిగా పులావ్‌ లేదా పరాటాలోకి వడ్డించాలి.

రొయ్యల కూర
కావల్సినవి: రొయ్యలు – పావుకేజీ; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి – అర టీ స్పూన్‌; అల్లం – టీ స్పూన్‌; ఉల్లిపాయ – 1 (తరగాలి); పసుపు – పావు టీ స్పూన్‌; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత; పేస్ట్‌ కోసం.. జీలకర్ర – టీ స్పూన్‌; కొబ్బరి తరుగు పాలు – అర కప్పు; మిరియాలు – 15; కారం – టీ స్పూన్‌; వెనిగర్‌ – అర టీ స్పూన్‌; అల్లం – అర టీ స్పూన్‌; వెల్లుల్లి – అర టీ స్పూన్‌

తయారీ:
►ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్‌ చేసి పేస్ట్‌ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్‌ కలపాలి
►రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి
►దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి
►దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.

సీమకోడి వేపుడు
కావల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌ – 200 గ్రాములు; అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్‌; మొక్కజొన్న పిండి – టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌; మైదా – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెమ్మ; నూనె – తగినంత; పసుపు – అర టీ స్పూన్‌

తయారీ:
►చికెన్‌ను కడిగి, వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం పిండి కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి.
►తర్వాత చికెన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా.. వేసి కలపాలి.
►కడాయిలో తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చికెన్‌ ముక్కలను బాగా వేయించాలి.

మరిన్ని వార్తలు