15 రోజులకోసారి జీవామృతం

26 May, 2020 06:09 IST|Sakshi
ఘనజీవామృతం ఎరువును చూపుతున్న హరిబాబు

ఏడాదికోసారి ఘనజీవామృతం

అధిక సాంద్రత గల జీవవైవిధ్య ఉద్యాన ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రూపుకల్పన చేశారు విలక్షణ రైతు సుఖవాసి హరిబాబు(62). హైదరాబాద్‌ సమీపంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామపరిధిలోని ఆయన క్షేత్రం ఉంది. పదెకరాల్లో ఎన్నో అరుదైన పండ్ల, ఔషధ, కలప జాతి చెట్లను నాటారు. దేశీ జాతుల ఆవులు, గొర్రెలు, కోళ్లు, బాతులను కలగలిపి సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని హరిబాబు నెలకొల్పారు. డ్రిప్‌ ద్వారా ప్రతి 15 రోజులకోసారి ద్రవజీవామృతం, ఏడాదికోసారి ఘనజీవామృతం, వర్షాకాలంలో ఒకసారి చెట్ల మధ్యలో వేసి.. రోటవేటర్‌ వేస్తూ మంచి ఫలసాయం పొందుతున్నారు. తనదైన శైలిలో అనేక ఇతర పదార్థాలను కలిపి జీవామృతం, ఘనజీవామృతంలను ఆయన తయారు చేసుకుంటున్నారు.   

జీవామృతం + వేపగింజల పొడి..
6 వేల లీటర్ల సంప్‌లు రెండు నిర్మించుకొని జీవామృతం తయారు చేసుకుంటూ ప్రతి 15 రోజులకోసారి చెట్లకు అందిస్తున్నారు. ప్రతి సంప్‌లో 500–550 కిలోల ఆవు పేడ, 300–400 లీటర్ల ఆవు మూత్రం, 20 కిలోల నల్లబెల్లం, 10–15 కిలోల శనగపిండి వేసి జీవామృతం కలుపుతారు. 5 రోజుల తర్వాత.. ఒక్కో సంప్‌లో.. 400 లీటర్ల ఎర్రమట్టి నీళ్లు, 40 కిలోల స్టోన్‌ క్రషర్‌ డస్ట్‌ నీళ్లు 400 లీటర్లు, కిలో వేపగింజల పొడి, ఒక్కో లీటరు చొప్పున 12 రకాల నూనెలు, 1.25 లీటర్ల ఎమల్సిఫయర్‌ లేదా 2 లీ. కుంకుడు రసం కలిపి డ్రిప్‌ ద్వారా చెట్లకు అందిస్తున్నారు.

పేడ + కట్టెల బొగ్గు+జీవామృతం..
హరిబాబు ఏడాదికోసారి ఘనజీవామృతం తయారు చేసుకుంటారు. జూలై నెలలో తన తోటలోని చెట్లకు వేస్తున్నారు. రెండు లాట్లుగా ఘనజీవామృతం తయారు చేస్తారు. ఒక్కో లాటుకు 60 టన్నుల పేడ(5 టిప్పర్లు), 7–8 టన్నుల కట్టెల బొగ్గు పొడితోపాటు తోటలో ప్రూనింగ్‌ చేసిన ఆకులు, అలములు, కొమ్మలు, రెమ్మలు 10 టన్నులను జెసిబితో ముక్కలు చేసి ముప్పావు గంటలో కలిపి పోగు చేస్తారు. దీన్ని కలిపేటప్పుడే 6 వేల లీటర్ల జీవామృతం పోస్తారు. ఈ జీవామృతంలో ముందురోజు 7–8 రకాల జీవన ఎరువులు 150 కిలోలను కలుపుతారు. ఇలా కలిపిన ఎరువుల మిశ్రమం పోగుపైన ఎండ పడకుండా చెరకు పిప్పి, అరటి, కొబ్బరి ఆకులను కప్పుతారు. 3 రోజులకోసారి పైన నీరు పోస్తూ తడుపుతుంటారు. మధ్యలో తిరగేసే పని లేదు. 4–5 నెలల్లో ఘనజీవామృతం సిద్ధమవుతుంది. జీవవైవిధ్యం ఉట్టిపడే ఉద్యాన వనాన్ని నిర్మించిన హరిబాబు (94412 80042) తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో నిర్వహిస్తుండడం విశేషం.

జీవామృతాన్ని కలుపుతున్న హరిబాబు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు