తడి ఆరని వర్ణాలు

21 Feb, 2019 00:06 IST|Sakshi

వెట్‌ గ్యాలరీ

ఎనభై ఏళ్ల క్రితం బెంగాల్‌లోని విక్టోరియన్‌ కాలపు నిర్జీవ చిత్ర సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసి, చిత్రకళకు కొత్తపుంతలు అద్దిన ఓ చిత్రకారుడి వర్ణ ఖండాలను సింగపూర్‌లోనిఓ ఆర్ట్‌ గ్యాలరీ ప్రదర్శించడం అంటే.. ఆయనకే కాదు,  భారతీయ కళా నైపుణ్యానికే అదొక పురస్కారం.

హేమేంద్రనాథ్‌ మజుందార్‌ (1898–1948) బెంగాలీ చిత్రకారుడు. తాను మంచి మంచి బొమ్మలు వేయాలనుకుంటే తండ్రి మాత్రం అందుకు వ్యతిరేకించాడు. ఆయనను ఎదిరించి కలకత్తా ఆర్ట్‌ స్కూల్‌లో చేరిపోయారు. అక్కడ నుంచి జూబిలీ అకాడమీకి వెళ్లి మరింత నేర్చుకున్నారు. ఇంగ్లండు నుంచి చిత్రకళకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు తెప్పించుకున్నారు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో వెలితి అనిపించేది. మనుషుల బొమ్మలను సహజంగా ఉండేలా చిత్రీకరించాలనే కోరిక బలంగా నాటుకుంది ఆయనలో. 1920లో అతుల్‌ బోస్‌ అనే సాటి కళాకారుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ కలకత్తా గవర్నమెంట్‌ ఆర్ట్‌ స్కూల్‌లో కలిశారు. చూసిన ప్రతి బొమ్మను, దృశ్యాన్ని... అన్నిటినీ కుంచెలో ముంచి చూపారు. బెంగాల్‌లో ప్రసిద్ధంగా ఉన్న విక్టోరియన్‌ ‘నిర్జీవ లేఖనాన్ని’ కూడా చిత్రీకరించారు. ఆ విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో ఒక సొంత స్కూల్‌ని పెట్టారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్‌ అనే ఒక పత్రికనూ స్థాపించారు. దీని ద్వారా చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావించారు. విస్తృతమైన అంశాలను ఇందులో పాఠ్యాంశాలుగా పెట్టారు. కళలకు సంబంధించిన వార్తలు, గాసిప్స్, ట్రావెలాగ్, చిన్న కథలు, హాస్యం అన్నీ పరిచయం చేశారు. మజుందార్‌ వేసిన మొట్టమొదటి మేజర్‌ పెయింటింగ్‌.. పల్లి ప్రాణ్‌ (పల్లె ప్రాణం). ఆ వరుసలోనే వెట్‌ శారీ ఎఫెక్ట్‌.. అంటూ కొన్నిటిని చిత్రీకరించి, పబ్లిష్‌ చేశారు.

ఆర్థిక కారణాల వల్ల వారి స్కూల్‌ కొన్నిరోజులకే మూత పడింది, ఆ తరువాత సొసైటీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అని రెండో వెంచర్‌ ప్రారంభించారు. ఇంగ్లండ్‌లో కొంతకాలం ఉండి వచ్చారు. మజుందార్‌ మహిళల మీద వరుసగా రకరకాల అంశాలను చిత్రీకరించారు. మహిళల టాయిలెట్స్, పగటి కల కనడం.. ఇలాంటివి కూడా ఉండేవి. మరో చిత్రంలో అమ్మాయి వెనుకకు తిరిగి ఉన్న రూపాన్ని చూపారు. ఇందులో ఆమె యువతిగా ఉన్నప్పుడు ఆమె శరీరం ఎలా ఉన్నది, ఆమె కండరాలు, ఆమె ఎముకల నిర్మాణం కూడా చూపారు. ద వూండెడ్‌ వానిటీ, బ్లూ సారీ, హార్మొనీ, ఇమేజ్‌ అని ఆయన వేసిన పెయింటింగ్స్‌లో చాలావరకు అమ్మాయిలను దిగంబరంగానే చూపారు. వాటర్‌ కలర్స్‌ ఉపయోగించారు వాటికి. బోంబే ఆర్ట్‌ సొసైటీలో మజుందార్‌కి మూడు సంవత్సరాలు వరుసగా మూడు బహుమతులు వచ్చాయి. స్మృతి అనే పెయింటింగ్‌కి గోల్డ్‌ మెడల్‌ కూడా వచ్చింది. ఇలా మూడుసార్లు ఆయనకే రావడాన్ని కొందరు విమర్శకులు తప్పుపట్టారు. 1940లలో మజుందార్‌ అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు గడించారు. జైపూర్, బికనీర్, కోటా, కశ్మీర్, మయూర్‌భంజ్, పటియాలా మహారాజులు తమ దగ్గర పనిచేయమని కోరుకున్నారు. పటియాలా మహారాజు భూపేంద్రనాథ్‌ సింగ్‌ ఆయనను తన ఆస్థాన చిత్రకారుడిగా ఐదు సంవత్సరాల పాటు నియమించుకున్నారు కూడా. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీ’æలో ఉన్న సాంటియో గ్యాలరీలో ఈ నెల 17 వరకు వారం పాటు ఆయన చిత్రాలను ప్రదర్శించారు.
– జయంతి

మరిన్ని వార్తలు