సూక్ష్మ మొక్కలతో వ్యాధుల నివారణ!

9 Jun, 2020 06:53 IST|Sakshi
కంపోస్టులో ఆవాలు చల్లి పెంచిన సూక్ష్మ మొక్కలను కత్తిరిస్తున్న దృశ్యం

సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్‌)ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా నివారించుకోవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మ మొక్కలను ట్రేలలో ఇంట్లోనే పెంచుకునే పద్ధతులను గురించి వ్యాసం మొదటి భాగంలో గత వారం తెలుసుకున్నాం, ఇది చివరి భాగం.

హృదయ సంబంధ వ్యాధులు: ఈ చిన్నమొక్కలు అత్యధికంగా పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వలన గుండెని కాపాడతాయి.

అల్జీమర్స్‌/మతిమరుపు:వీటిలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల ఆరోగ్యాన్ని పనితీరును కాపాడి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును నియంత్రిస్తాయి.

మధుమేహం: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉండటం వలన శరీర కణాలు చక్కెరను సరిగ్గా వినియోగించుకునే ప్రక్రియను నియంత్రిస్తాయి. ప్రత్యేకంగా మెంతులు ఇలా ఉపయోగించినప్పుడు మధుమేహాన్ని నియంత్రించినట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైనది.

కాన్సర్‌: వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల కేన్సర్లను నియంత్రిస్తాయి.

ఏ పంటలో ఏయే పోషకాలు?
1. ముల్లంగి: ముల్లంగి విత్తనాలను కూడా సూక్ష్మవిత్తనాలుగా వాడుకోవచ్చు. ఇవి ఉష్ణ, శీతల వాతావరణ పరిస్థితుల్లో కూడా మొలకెత్తుతాయి. అంతేగాక ఇవి అతి తొందరగా ఎదగడం వల్ల 5 నుంచి 10 రోజులలో కత్తిరించి వాడుకోవచ్చు.

2.బ్రోకలీ: బ్రోకలీని శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు. దీనిలో ఖనిజాలు ముఖ్యంగా ఇనుము, ఎ–సి విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. ఎదిగిన బ్రోకలీ మొక్కల కంటే వీటిలో అత్యధికంగా పోషకాలు ఉంటాయి.

3.బీట్‌రూట్‌: మిగతా విత్తనాలతో పోలిస్తే బీట్‌రూట్‌ విత్తనాలను మొలకెత్తడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. సాధారణంగా 6 నుంచి 8 రోజులలో మొలకెత్తుతాయి. 10–12 రోజుల్లో కత్తిరించుకోవచ్చు. బీట్‌రూట్‌ విత్తనాలను వేసుకునే ముందు  చల్లని నీటిలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఈ సూక్ష్మ విత్తనాలు ఆహారానికి పోషకాలతోపాటు రంగును కూడా చేరుస్తాయి.

4. తోటకూర: తోటకూర విత్తనాలు తొందరగా మొలకలు వచ్చి అతి త్వరగా ఎదుగుతాయి. దాదాపుగా 2 లేదా 3 రోజుల వ్యవధిలో మొలకెత్తుతాయి. 8 లేదా 12 రోజులలో కోతకు వస్తుంది. వీటిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు.

5.ఆవాలు : ఆవాలు 3 నుంచి 4 రోజుల్లో మొలకెత్తుతాయి. 6 నుంచి 10 రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. ఇవి చాలా తొందరగా ఎదుగుతాయి. వీటి ఘాటు రుచి వలన వంటకాలలో లేదా సలాడ్‌లో చేర్చినప్పుడు మంచి రుచిని ఇస్తాయి.

6. చుక్కకూర: చుక్కకూర విత్తనాలు 4 నుంచి 5 రోజులలో మొలకెత్తుతాయి. ఇవి నెమ్మదిగా ఎదుగుతాయి. కాబట్టి 12 నుంచి 20 రోజుల సమయం తీసుకుంటాయి. వీటిని వంటకాలలో చేర్చినప్పుడు పులుపు రుచిని కలిగి ఉండటం వలన ఎక్కువగా ఇష్టపడతారు.

కంపోస్టులో పెరిగిన సూక్ష్మ మొక్కల్లో అధిక పోషకాలు!
► కంపోస్టు, హైడ్రోపోనిక్‌ (పోషకాల ద్రావణం కలిపిన నీరు లేదా నీరు మాత్రమే) మాధ్యమాలను సరి పోల్చినప్పుడు.. కంపోస్టులో పెంచిన మొక్కలలో అధిక పోషకాలు ఉన్నట్లు నిర్థారితమైంది.

► అమెరికా శాస్త్రవేత్తలు బ్రోకలీ మైక్రోగ్రీన్స్‌ని, ఎదిగిన బ్రోకలీ మొక్కలలోని మినరల్స్‌తో పోల్చి చూసినప్పుడు 1.15 నుంచి 2.32 శాతం వరకు (ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, సోడియం, జింక్‌ వంటి) ఖనిజాలు మైక్రోగ్రీన్స్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

► ఈ మైక్రోగ్రీన్స్‌ పెంచడానికి కేవలం ఎకరానికి 15,679 లీటర్ల నీరు మాత్రమే అవసరం. అదే మొక్కలను పూర్తిగా పెంచినట్లయితే 24,80,000 నుంచి 37,00,000 లీటర్ల నీరు అవసరం. అదేవిధంగా బ్రోకలీ మొక్కలు పూర్తిగా ఎదగడానికి 100 నుంచి 150 రోజుల సమయం పడుతుంది. కానీ మైక్రోగ్రీన్స్‌ని 7 నుంచి 9 రోజులలో కత్తిరించుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే తరిగిపోతున్న వనరులు, గ్లోబల్‌ వార్మింగ్, పోషకాహార లోపం వంటి సమస్యలను కూడా ఈ మైక్రోగ్రీన్స్‌ ద్వారా నివారించవచ్చు.

► 25 రకాల మైక్రోగ్రీన్స్‌పై జరిపిన పరిశోధనలో 100 గ్రాములలో 20.4 నుంచి 147.0 మిల్లీ గ్రాముల విటమిన్‌ సి, 6 నుంచి 12.1 మి.గ్రా.ల బీటా కెరోటిన్, 4.9 నుంచి 87.4 విటమిన్‌ ఇ ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి బాగా పెరిగిన ఆకులతో పోల్చితే చాలా ఎక్కువ శాతం పోషకాలను కలిగి ఉన్నాయి. ఈ 25 రకాలలో రెడ్‌ క్యాబేజి, కొత్తిమీర, తోటకూర, ముల్లంగిలో అత్యధికంగా ఆస్కార్బిక్‌ ఆమ్లం, కెరోటినాయిడ్స్, ఫిల్లిక్వినోన్లు, టోకోఫెరాన్లు ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారు.

► చక్కెర శాతం కూడా ప్రతి వంద గ్రాములలో 10.3 గ్రా. ఉండగా అదే పరిపక్వత చెందిన వాటిలో 44–17 గ్రా. ఉన్నట్లు గుర్తించారు.

► రెడ్‌ క్యాబేజీపై జరిపిన పరిశోధనలో మైక్రోగ్రీన్‌లో ప్రతి గ్రాముకు 71.01 మైక్రోమోల్స్‌ ఫాలీఫినాల్స్‌ ఉండగా, పరిపక్వత చెందిన రెడ్‌ క్యాబేజీలో 50.58 మైక్రోమోల్స్‌ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడే వారికి ఫాలీఫీనాల్స్‌ ఉపయోగకరం.

► హైడ్రోపోనిక్‌లో పొటాషియం తక్కువగా ఉన్న పోషకాల ద్రావణం కలపడం ద్వారా ఈ మాధ్యమంలో పెంచిన మైక్రోగ్రీన్స్‌లో తక్కువ పొటాషియం కలిగి మిగతా పోషకాలలో మార్పు లేక పోవటం వలన కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ మైక్రోగ్రీన్స్‌ సహాయ పడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.

సూక్ష్మ మొక్కలతో ఎన్నెన్నో వంటకాలు
సూక్ష్మమొక్కలను సాధారణంగా సలాడ్, సాండ్‌విచ్, పండ్ల రసాలు, మిల్క్‌ షేక్‌లలో వాడతారు. అంతేకాకుండా సూపులు, రోల్స్‌లో కూడా చేర్చడం ద్వారా రుచితోపాటు పోషకాలు కూడా అధికంగా అందుతాయి.
సూక్ష్మమొక్కల ఉపయోగాన్ని మరింత సులభం చేయడానికి హైదరాబాద్‌లోని ‘మేనేజ్‌’, జాతీయ పోషకాహార సంస్థ కలిసి వివిధ ఆహార పదార్థాలలో ఈ మొక్కలను చేర్చి పోషక స్థాయిని అధ్యయనం చేస్తున్నారు.

ఇంత ఆవశ్యకత కలిగిన ఈ సూక్ష్మ మొక్కలను హోటళ్లు, రెస్టారెంట్లలో అధిక ధర పెట్టి కొనుక్కోవటం కాకుండా సులభంగా ఇంట్లోనే పెంచుకోవడం ద్వారా రోజూ తినే ఆహారంలో రుచిని, పోషకాలను పెంచుకొని ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు.
– డా. వినీత కుమారి (83672 87287), డెప్యూటీ డైరెక్టర్‌ (జెండర్‌ స్టడీస్‌),
డా. జునూతుల శిరీష, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో,
డా. మేకల శ్రీకాంత్, కన్సల్టెంట్, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌), హైదరాబాద్‌


 వాడకానికి సిద్ధమైన ఆవాల సూక్ష్మ మొక్కలు
 

 నీటిలో పెరిగిన తెల్ల ముల్లంగి సూక్ష్మ మొక్కలు

మరిన్ని వార్తలు