హద్దులు దాటితే..!

24 Mar, 2019 01:13 IST|Sakshi

బౌద్ధవాణి

పూర్వం మగధ రాజధాని రాజగృహ నగర సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని మీద గరుడ జాతి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షుల పేరు మీద దానికి గృధ్రకూట పర్వతం అనే పేరు వచ్చింది. ఆ పర్వతం మీద అపనందుడు అనే గరుడుడు ఉండేవాడు. మంచి బలశాలి కావడం వల్ల ఆకాశంలో అవలీలగా ఎగిరి రాగలిగేవాడు. అతని పుత్రుడు మిగాలోపుడు. అతను కూడా తండ్రిని మించిన రెక్కబలం కలవాడు. కుర్రతనపు జోరు మీద కన్నూమిన్నూ కానేవాడు కాదు. ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. కంటికాననంత దూరం ఎగిరి వచ్చేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. బిడ్డను పిలిచి– ‘‘కుమారా! మిగాలోపా! నీ విహంగ విన్యాసాల గురించి విన్నాను.

మంచిదే! కానీ, నాయనా! ఒక్కో జీవికి ఒక్కో హద్దు ఉంటుంది. అలాగే పక్షులకు కూడా! మన గరుడ పక్షులకూ ఒక హద్దు ఉంది. ఆకాశంలో మనం లేచిపోయి నేలను చూసినప్పుడు ఈ ప్రాంతం నాలుగు మూలలా కనిపించేంత వరకే మనం పోవాలి. ఆ  హద్దు దాటి పోతే, మన ప్రాణాల మీదికి మనం తెచుకున్నట్లే. నింగి నుండి నేలరాలడం తప్పదు. ఇకనుండి వేగంలో, ఎత్తులో నీ హద్దుల్లో నీవుండు’’ అని చెప్పాడు. తండ్రి చెప్పాడే కానీ, తనయుడు దాన్ని చెవికెక్కించుకోనేలేదు. ఒక రోజున మిగిలిన పక్షులు వద్దని వారించినా వినకుండా సహజ వాతావరణ పరిధిని దాటి ఇంకా పైపైకి పోయాడు మిగాలోపుడు. అక్కడ మేఘాల్లో సుడిగాలి రేగింది.

ఆ సుడిలో చిక్కుకున్న అతని దేహం ఛిద్రమైపోయింది. ప్రాణాలు కోల్పోయిన మిగాలోపుని శరీర భాగాలు గాలిలోనే ఎటో కొట్టుకుపోయాయి. అతని మరణం అతని పరివారాన్ని కుంగదీసింది. తండ్రి తల్లడిల్లాడు. అతని మీద ఆధారపడ్డ భార్యాబిడ్డలు భుక్తి కోల్పోయారు. గృధ్రకూట పర్వతం మీద ఛిద్రమైన పక్షి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దల మాట వినకపోవడం, తమ హద్దులు తాము తెలుసుకోలేకపోవడం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఎంతటి విపత్తును కలిగిస్తాయో బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది. 
– డా. బొర్రా గోవర్ధన్‌
 

మరిన్ని వార్తలు