అమ్మాయిలూ... వలలో పడకండి

9 Feb, 2018 23:36 IST|Sakshi
బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌

ప్రిన్స్‌

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌కి అమ్మాయిల భద్రత గురించి బెంగ పట్టుకుంది. ‘‘గర్ల్స్‌.. ఎందుకలా మీరు సోషల్‌ మీడియాలో అస్తమానం రకరకాల పోజుల్లో కనిపిస్తారు? గుట్టుగా ఉండండి. లోకం ఎంత బూటకంగా ఉందో తెలుసా? మీరు ఏదో ఒక గొడవలో చిక్కుకుపోతారు. జాగ్రత్తగా ఉండండి’’ అని గురువారం లండన్‌లోని బర్లింగ్‌టన్‌ డేన్స్‌ అకాడమీలో మాట్లాడుతూ.. ఆడపిల్లల్ని హెచ్చరించారు ప్రిన్స్‌. ‘సైబర్‌ బుల్లీయింగ్‌’ గురించి ప్రసంగించేందుకు అకాడమీవాళ్లు ప్రిన్స్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించిన సందర్భం అది.  స్మార్ట్‌ఫోన్‌లో చిక్కుకుపోతే ఎవరికైనా సమస్యలు తప్పవు. అయితే అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రిన్స్‌ ఉద్దేశం. ‘అవసరానికి మించి ఆన్‌లైన్‌లో ఉండకండి.

బుల్లీయింగ్‌కి (టీజింగ్‌కి) గురికాకండి’ అని ప్రిన్స్‌ చెబుతున్నప్పుడు మీడియా ఆ పాయింట్‌కి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చింది. సభలో ఉన్న మిగతా ప్రముఖులు  ప్రిన్స్‌ ఎంతో అమూల్యమైన సూచన చేశారని అభినందించారు. నిజానికి రాజప్రసాదం కూడా సోషల్‌ మీడియాకు మొదట్నుంచీ దూరంగానే ఉంటుంది. ప్రిన్స్‌ విలియమ్స్‌ తమ్ముడు ప్రిన్స్‌ హ్యారీతో పెళ్లి ఫిక్స్‌ కాగానే మేఘన్‌ మార్కెల్‌.. సోషల్‌ మీడియాలోని తన అన్ని అకౌంట్‌లనూ ఇటీవలే క్లోజ్‌ చేసేశారు.  అమ్మాయిలూ విన్నారు కదా! ఆచరించే వారు చెబితే ఎవరు మాత్రం వినకుండా ఉంటారు? 

మరిన్ని వార్తలు