బాధ్యతలూ కోరికలకూ మధ్య

13 Jan, 2020 00:09 IST|Sakshi

కొత్త బంగారం

గది పైకప్పుకున్న రెండు బల్లులు మాట్లాడుకుంటుంటాయి. ‘అలా తిరిగి వద్దామా!’ అని ఒక బల్లి అడిగినప్పుడు రెండోది, ‘వద్దు, పైకప్పును ఎవరు నిలబెడతారు?’ అంటుంది. యీ ప్రస్తావన ‘ద ప్రైవేట్‌ లైఫ్‌ ఆఫ్‌ మిసెస్‌ శర్మ’ నవలికలో రెండు సార్లు వస్తుంది. తన బాధ్యతలని తప్పించుకోవాలనే కోరికకూ, తన వ్యక్తిగత అవసరాలకూ మధ్య చిక్కుకున్న రేణుకా శర్మ పరిస్థితీ అదే. ఆమె భర్త దుబాయిలో పని చేస్తుంటాడు. 37 ఏళ్ళ రేణుక, ఢిల్లీలో– అత్తామామలతోనూ, 15 సంవత్సరాల కొడుకు బాబీతోనూ, ఒక బెడ్రూమ్‌ ఇంట్లో అద్దెకుంటుంది. గైనకాలజిస్టు క్లినిక్‌లో రెసెప్షనిస్టుగా పని చేసే ఆమే కథకురాలు.

రేణుక కనే కలలన్నీ కొడుకు ఎమ్బీయే చదవడమూ, ఆధునిక పరిసరాల్లో మంచి అపార్టుమెంటు కొనుక్కోవడమూ, మాల్సులో షాపింగ్‌ చేయడమూ చుట్టూ తిరుగుతుంటాయి. భర్తతో వారానికి రెండు సార్లు స్కైప్లో మాట్లాడుతుంటుంది. ‘గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు సుమీ’ అంటూనే, తన కొడుకు అందం గురించీ, తనెంత సెక్సీగా ఉంటుందో అనీ చెప్తూనే ఉంటుంది. తనూ, భర్తా వేరువేరుగా ఎందుకున్నారని ఇరుగుపొరుగు ప్రశ్నించినప్పుడు, ‘అత్తమామల మెడికల్‌ బిల్స్‌ లక్షల్లో వస్తాయి. నా కొడుకు చదువింకా మిగిలుంది. ప్రేమా, రొమాన్స్‌ మమ్మల్ని రక్షిస్తాయా?’ అని తిరగబడుతుంది. ‘డబ్బున్న– బక్కపలుచని భార్యల, ఉబ్బిన బ్యాగుల’ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. 

ఒకరోజు హౌస్ఖాస్‌ మెట్రో స్టేషన్లో 30 ఏళ్ళ వినీత్‌ సెహగల్‌ను కలుసుకుంటుంది. వాళ్ళ పరిచయం స్నేహంగా మారి శృంగారానికి దారి తీసినప్పుడు, ‘రేపటి’ గురించి ఆలోచించుకుంటూ, ఈ రోజు దొరికే సంతోషాన్ని ఎంతకాలం వద్దనగలం?’ అని ప్రశ్నించుకుంటుంది. తమిద్దరికీ రహస్య సంబంధం ఉందని ఒప్పుకోక, అది ‘స్నేహం’ అనే ఒత్తి చెప్తుంది. రేణుకకి అతనితో గడిపే సమయం కేవలం ఆటవిడుపే. ఆమె వివాహిత అని తెలిసిన తరువాత కూడా వినీత్‌ ఆమెని పెళ్ళి చేసుకుంటానన్న పంతం విడవడు. 

భర్త సెలవు మీద ఇంటికి రాబోతున్న రోజు ముస్తాబయి వొంటరిగా కూర్చున్న రేణుక ఇంటికి వినీత్‌ వచ్చి, తనతోపాటు వచ్చెయ్యమని బలవంతపెడతాడు. వెళ్ళిపొమ్మని చెప్పినా మొండికెత్తితే, కొడుకు ఉపయోగించే ఐదు కిలోల డంబ్‌ బెల్‌ ఎత్తి అతని తల వెనుక మొత్తినప్పుడు, వినీత్‌ చనిపోతాడు. ‘అతన్ని కావాలని చంపేయలేదే! నన్ను పోలీసులు తీసుకుపోతే, నా భర్తెలా ఉండగలడు? వంటెవరు చేస్తారు? అత్తగారూ ఇంట్లో లేదే!’ యీ సతమతంతోనే పుస్తకం పూర్తవుతుంది.

రచయిత్రి రతికా కపూర్‌ శైలి సులువుగా, విశదంగా ఉంటుంది. స్వల్ప హాస్యమూ, విషాదమూ సమపాళ్ళల్లో ఉన్న కథనం పాఠకులతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. రోజువారీ ఆలోచనలతో, కొద్ది సంఘటనలతో సాగే పుస్తకంలో పాత్రలు ఎక్కువుండవు. వర్ణనలు ఢిల్లీని కళ్ళకి కట్టేలా చూపిస్తాయి. ప్రారంభపు వాక్యాలు మట్టుకు భారీ పంజాబీ యాసతో ఉన్న ఇంగ్లీషులో ఉండి, అవి పాత్ర పలికినవనీ, రచయిత్రివి కావనీ పాఠకులు అర్థం చేసుకునేటంతవరకూ అయోమయపరుస్తాయి. ‘రేణుక మనతో అబద్ధం చెప్తోందా, తన్ని తానే మోసం చేసుకుంటోందా లేకపోతే ముక్కుసూటిగా మాట్లాడుతోందా?’ అన్న సందేహాలని కలిగించే భాగాలెన్నో ఉన్నాయి నవలికలో.

బాధ్యతలకీ, ఇచ్ఛలకీ మధ్యన నలిగిపోయిన మధ్యతరగతి, మధ్య వయస్కురాలి యీ కథ మే 7 నుంచి ఆగస్టు 31 మధ్య కాలంలో జరిగేది. మగవారు ఏ భావోద్వేగ అనుబంధం లేకుండానే సంబంధాలని విడచిపోగలరన్న అపోహని ఈ నవలిక తలకిందులు చేస్తుంది. దీన్ని బ్లూమ్స్‌బెరీ డిసెంబర్‌  2016లో పబ్లిష్‌ చేసింది. కపూర్‌ రెండవ పుస్తకం ఇది.   
- కృష్ణ వేణి

మరిన్ని వార్తలు