నానమ్మ కోకిలమ్మ

21 Nov, 2019 05:48 IST|Sakshi

అపురూప క్షణాలు

ఇంగ్లిష్‌ కవి విలియమ్‌ ఎర్నెస్ట్‌ హెన్లే రాసిన ‘ఇన్విక్టస్‌’ (అజేయం) లోని కొన్ని పంక్తులను పొందుపరుస్తూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్‌ 19న తన నానమ్మ ఇందిరా గాంధీ 102వ జయంతికి ప్రేమపూర్వకమైన నివాళి అర్పించారు. ‘పిడిగుద్దులకు నా తల బద్దలై రక్తం ఓడుతున్నా.. నేను తలవంచను’ అని అర్థం వచ్చేలా ఉన్న ఆ పంక్తులు ఇందిరలోని పోరాట పటిమను శ్లాఘించాయి. బాల్యంలో తను నానమ్మతో కలిసి ఆడుకుంటున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ప్రియాంక ఈ హెన్లే కవిత్వాన్ని జోడించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31న కూడా ప్రియాంక తన నానమ్మ వర్ధంతికి ఒక శ్లోకాన్ని ట్వీట్‌ చేశారు. ‘అజ్ఞానం నుంచి వాస్తవం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మరణం నుంచి అమర్త్యం వైపు నన్ను నడిపించు.. ఓం శాంతి శాంతి శాంతి’ అనే ఆ శ్లోకం నానమ్మ తనకు, సోదరుడు రాహుల్‌కి నేర్పిన తొలి శ్లోకం అని గుర్తు చేసుకున్నారు.

శ్రావ్య గాయని లతా మంగేష్కర్‌ నేటికింకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఊపిరి పీల్చడంలో తలెత్తిన ఇబ్బంది కారణంగా నవంబరు 11న ఈ మెలడీ క్వీన్‌ ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచీ వివిధ రంగాల్లోని ప్రసిద్ధులంతా ఆమెను పరామర్శించి వస్తున్నారు. బయటికి వచ్చాక ‘ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని వాళ్లు చెబుతున్న ఆ ఒక్క మాట మాత్రమే దేశ విదేశాల్లోని లత అభిమానులకు ఊరట చేకూరుస్తోంది. ఆసుపత్రికి వెళ్లి ఆమెకు ఇబ్బంది కలిగించకూడదని అనుకున్నవారు సోషల్‌ మీడియాలో ఆమె కోలుకోవాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. బాలీవుడ్‌ పూర్వపు హీరో ధర్మేంద్ర ట్విట్టర్‌లో ఆమె పాత ఫొటో ఒకటి షేర్‌ చేసి.. ‘‘ప్రపంచానికి ప్రాణమా.. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండు’ అని కామెంట్‌ రాశారు. ఆ నలుపు తెలుపు ఫొటోలో ఒక పెయింటింగ్‌ పక్కన నిలబడి, పెయింట్‌ బ్రష్‌ను మునిపంట పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు లత. అరుదైన గాయని అరుదైన చిత్రమది.

మరిన్ని వార్తలు