మందులు వాడినా దద్దుర్లు తగ్గడం లేదు!

29 Jul, 2016 23:51 IST|Sakshi

ఆయుర్వేద కౌన్సెలింగ్

 

నా వయసు 29 ఏళ్లు. గత నాలుగు నెలల నుంచి ఒళ్లంతా దద్దుర్లు, దురద ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ‘అర్టికేరియా’ అని చెప్పి ఇచ్చిన మందులు వాడినా, తాత్కాలిక ఉపశమనమేగానీ పూర్తిగా తగ్గడం లేదు. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద చికిత్స సూచించండి.  - శాంభవి, హైదరాబాద్
మీరు చెప్పిన లక్షణాలున్న అవస్థను ఆయుర్వేదంలో ‘శీత పిత్త, ఉదర్ద ఉత్కాఠ’ అనే పేర్లతో వివరించారు. దీనికి ప్రధాన కారణం ‘అసాత్మ్యజ’ (అలర్జిక్) పదార్థాల ప్రభావం దీనివల్ల శరీరంలో ‘పిత్తం’ ప్రకోపిస్తుంది. దీనికి తోడుగా అతిశీతల వాతావరణం చర్మం మీద ప్రభావం చూపడం జరిగితే వాత, కఫాలు కూడా వికృతి చెంది ‘దురదతో కూడిన దద్దుర్లు’ వ్యక్తమవుతాయి. కందిరీగలు కుట్టినట్లుగా నొప్పి, మంట ఉండవచ్చు. అప్పుడప్పుడు జ్వరం, వాంతి కూడా ఉంటాయి. ఆ దద్దుర్లు బండి చక్రాల్లాగ గుండ్రంగా ఉండి మధ్యలో పల్లంగా ఉండవచ్చు.

 
చికిత్స సూత్రాలు:  జఠరాగ్ని సక్రమంగా పనిచేసేట్టు చూసుకోవాలి. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ‘జావల’ వంటి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. అలర్జీని కలిగించే ఆహార పదార్థాలను, ఇతర ద్రవ్యాలను శీఘ్రంగా పసిగట్టడం కష్టం కాబట్టి ఆ సమయంలో మజ్జిగ అన్నం కానీ, బార్లీ, గోధుమ జావలుగానీ రెండు రోజుల పాటు సేవిస్తే మంచిది  పొట్టలో క్రిములు లేదా అమీబియాసిస్ (ప్రవాహికా) వంటి వికారాలు ఉంటే వాటికి వెంటనే చికిత్స చేయాలి  ఆహారపదార్థాల్లో వాడే రంగులు, నూనెలు, నిల్వ కోసం వాడే రసాయనాలు, గరం మసాలాల వంటివి ఎన్నో ద్రవ్యాలు అలర్జీలకు కారణమవుతాయని గుర్తుంచుకోండి. వాటికి దూరంగా ఉండండి  అతిశీతల వాతావరణానికి గురికావద్దు దుమ్ము ధూళి రసాయనాలు వంటి వాటికి దూరంగా ఉండండి  అలాగే ఎక్కువ సేపు ఎండకి కూడా గురికావద్దు.

ఔషధాలు :  క్రిమికుఠారరస (మాత్రలు) : ఉదయం 1 మధ్యాహ్నం 1 రాత్రి 1 (ఐదు రోజుల పాటు వాడాలి) లఘుసూతశేఖర రస (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 (రెండు వారాలు వాడాలి). రసపీపరీరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 (మూడు వారాలు వాడాలి)యష్టిమధు (మాత్రలు) : ఉదయం 2 రాత్రి 2 ( మూడు వారాలు వాడాలి). ఖదిరారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రోజూ మూడుపూటలా తాగాలి (సమస్య తగ్గేవరకు)పైపూతకు: ‘మహామరిచాదితైలం మూడు పూటలా పూయవచ్చు.

గృహవైద్యం:  పసుపు 500 మి.గ్రా + వేపాకు ముద్ద 3 గ్రాములు + బెల్లం 5 గ్రాములు కలిపి ఒక మోతాదుగా వేడినీటితో ఉదయం పరగడుపున సేవించాలి. వ్యాధి తీవ్రతను బట్టి రోజూ రెండు, మూడు సార్లు కూడా తీసుకోవచ్చు. ఆవనూనెను దద్దుర్లపై పూసుకోవచ్చు.


గమనిక : పై చికిత్సలకు లొంగకపోతే, వైద్యనిపుణుడి పర్యవేక్షణలో అవసరమైన పంచకర్మలు చేయించుకోవాలి (విరేచన, వమన, అభ్యంగ, స్వేద వంటి ప్రక్రియలు).  కొన్ని ప్రత్యేక కషాయాలు కూడా వైద్యుడు తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది.ట
ఉదా : గుడూచీ, మంజిష్ఠా, శారిబా మొదలైన ద్రవ్యాలతో వాటిని తయారు చేస్తారు.

 

నొప్పి ఎక్కువై నడవడం కష్టమౌతోంది
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 

నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి.  - రత్నమ్మ, కాకినాడ
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) చేయాల్సి రావచ్చు.


ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది.  - నీరజ, గుంటూరు
మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

 
నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నొప్పి పెరుగుతోంది.  డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి ల్యూబ్రికెంట్ పనిచేసే అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ చాలా ఖరీదైనవి అంటున్నారు. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి.   - దుర్గాప్రసాద్, విజయవాడ

మీరు చెప్పినట్లుగా ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాటిని వాడుతూనే ఉన్నారు. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేస్తాయి. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని కాస్త తగ్గించి, కార్టిలేజ్‌ను బలం చేకూరుస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్య చికిత్స  పొందండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు