ప్రోబయాటిక్స్‌తో కాలేయానికి మేలు!

24 Apr, 2018 00:40 IST|Sakshi

పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అన్నారా? మజ్జిగ, ఆవకాయ వంటి ప్రోబయాటిక్‌ ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారుగానీ.. శాస్త్రవేత్తలు తాజాగా వీటినే శాస్త్ర పరిశోధనల చట్రంలో నిరూపిస్తున్నారు. విషయం ఏమిటంటే.. మన కడుపు, పేవుల్లోని బ్యాక్టీరియాు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినప్పటి నుంచి ప్రోబయాటిక్స్‌పై కూడా పరిశోధనలు ఊపందుకున్నాయి. ఎమరీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో ఈ ప్రోబయాటిక్స్‌ కాలేయానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసింది. బ్యాక్టీరియా మన జీవక్రియల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? అందుకు ఏ ఏ పరమాణువులు ఎలా కారణమవుతున్నాయి? అన్న అంశాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకోగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సయీదీ తెలిపారు.

లాక్టోబాసిల్లస్‌ రామ్నోసస్‌ జీజీ అనే బ్యాక్టీరియాపై తమ పరిశోధనలు జరిగాయని, రెండు వారాలపాటు ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న ఆహారంతోపాటు కాలేయానికి చేటు చేయగల రసాయనాన్ని ఉద్దేశపూర్వకంగా అందించామని, ఆశ్చర్యకరంగా ప్రోబయాటిక్స్‌ తీసుకుంటున్న ఎలుకల్లో నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని వివరంచారు. బ్యాక్టీరియా కారణంగా శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు స్పందించి రసాయనం కారణంగా ఎక్కువైన ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా కాలేయానికి నష్టం తగ్గినట్లు చెప్పారు. ఈ ఫలితాలు మానవుల్లోనూ ఇలాగే ఉంటే.. ప్రోబయాటికక్స్‌ వాడకం ద్వారా కాలేయానికి జరిగే నష్టాన్ని తగ్గింవచ్చునని అన్నారు. 

మరిన్ని వార్తలు