నాలుగు క్వింటాళ్ల బరువుతో 48కే నూరేళ్లు..!

27 May, 2014 22:32 IST|Sakshi
నాలుగు క్వింటాళ్ల బరువుతో 48కే నూరేళ్లు..!

అనర్థం
 
 భారీ కాయం.. ఈ మాటను చాలా సులువుగా ఉపయోగిస్తుంటాం. అందుకే, ఉరైబ్ శరీరం గురించి చెప్పడానికి మరో మాటను వెతుక్కోవాల్సి వస్తోంది. అతను దాదాపు 400 కిలోల బరువుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకొన్న వ్యక్తి. మరి అతడి కాయం గురించి చెప్పడం చాలా బరువైన విషయమే. అంతటి  కాయంతో ఇన్ని సంవత్సరాల పాటు బతుకీడ్చిన ఉరైబ్ సోమవారం మరణించాడు. మెక్సికోకు చెందిన ఉరైబ్ కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయ్యాడు. ఆ మంచం మీదే గుండె పోటుతో మరణించాడు.
 
 ఉరైబ్‌కు గుండె పోటు వచ్చినట్లు గుర్తించిన అతడి సహాయకులు ఒక క్రేన్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆసుపత్రికి చేరే సరికే ఉరైబ్ మరణించినట్లు డాక్టర్లు గుర్తించారు. ఉరైబ్ మరణం ఇప్పుడు పాశ్చాత్యదేశాల మీడియాకు ఒక ప్రత్యేకమైన అంశం అయ్యింది. ఎందుకంటే స్థూలకాయంతో క్రమంగా బరువు పెరుగుతూ పోయిన ఉరైబ్ మీడియాకు చాలా సంవత్సరాలుగా పరిచయస్థుడే. 48 ఏళ్ల వయసులో మరణించిన ఉరైబ్ దాదాపు పదేళ్ల కిందటే తన బరువుతో గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఉరైబ్ ఒబేసిటీ బాధితురాలైన మహిళనే పెళ్లాడాడు. వాళ్లిద్దరికీ ఒక బాబు పుట్టాడు.
 
 అయితే వివాహం తర్వాత కూడా ఉరైబ్ అలాగే బరువు పెరుగుతుండడంతో భార్య విడాకులు తీసుకొంది. కొన్ని సంవత్సరాలుగా ఈ భారీ కాయుడు ఒంటరిగా ఉన్నాడు. దాదాపు ఏడాది నుంచి నడిచింది కూడా లేదు. శరీరం అదుపు తప్పి పెరిగిపోవడంతో నడవడానికి కాళ్లు సహకరించక మంచానికే పరిమితం అయ్యాడు.  ఏమైనా, ఉరైబ్ ఈ ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తి. బరువుతో ఎన్నో ఇబ్బందులు పడ్డా గిన్నిస్‌లో స్థానం సంపాదించానని ఆనందపడేవాడు.

మరిన్ని వార్తలు