పొలం పొమ్మంది.. ఇల్లు రమ్మంది

5 Apr, 2018 00:02 IST|Sakshi

వృత్తి కథలు – 3

ఒక తరం పోయి మరో తరం వస్తుంది.. ఒక పాత కనుమరుగై... మరో కొత్తకు నాంది అవుతుందిమార్పు సంస్కృతిలో భాగం...  మారి తీరాల్సిందే... మార్పును స్వాగతించాల్సిందే.నాగలి పోయి ట్రాక్టర్‌ వచ్చింది...రోకలి పోయి మిక్సీ వచ్చింది. వాకర్‌ వచ్చింది... మూడు చక్రాల బండిని పక్కకు తోసేసింది.పొలం... ‘నీకిక్కడ ఇంకేం పనుంది’ అన్నది... పట్టణాల్లో ఇళ్లు ‘పని చేద్దువురా’ అని పిలిచాయి.వడ్రంగి ఊరిని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ... సిటీలో అడుగుపెట్టాడు.సమాజంలో వచ్చిన మార్పుకు... ప్రత్యక్ష సాక్షి అయ్యాడు.

‘‘మా నాన్న పేరు సాంబాచారి. ఆయన ఊరందరికీ చుట్టమే. మా ఇంటికి పని కోసం వచ్చినవాళ్లను, పని కోసం ఇంటికి పిలిపించుకునే వాళ్లను ఎవరినైనా సరే ‘మామా, చిన్నాన్నా’ అని వరుస పెట్టి పిలిచేవాడు. చేతిలో పనితోపాటు మాట మంచితనంతోనే మా ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడాయన.

మార్పు నా కళ్ల ముందే!
నేను మా నాన్న చేతికింద పన్నెండేళ్లు పని చేశాను. సొంతంగా పని చేయడం మొదలు పెట్టి ముప్పై ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో నేను పెద్ద మార్పునే చూశాను. మా ఉలి, బాడిశె, కలప కోసే రంపం, తోపుడు రంపం వంటి వస్తువులు అలాగే ఉన్నాయి. కానీ వాటితో మేము తయారు చేసే వస్తువులు మారిపోయాయి. ఒకప్పుడు మా పనంతా వ్యవసాయం ప్రధానంగా ఉండేది. వ్యవసాయానికి వాడే పనిముట్లంటే... నాగలి, ఎడ్లబండి, ఏతం తొక్కడానికి ఏతం మాను, కపిల బావి నీరు తోడడానికి గిలక, గింజలు నాటడానికి జడ్డిగం గొర్రు, పళ్లమాను, గెడ్లమాను, మాను అడ్డ, గుంటక అడ్డ, కర్రల మాను, కాడి, కొడవలి ముఖ్యంగా ఉండేవి. 

ఇక ఇంట్లో రోజువారీ వాడకంలో... నులకమంచం, మడతమంచం, మడత కుర్చీ, బల్ల, కుర్చీ, పిల్లలకు ఊయల, చక్రాలబండి, గిలక్కాయలు ఉండేవి. వంటగదికోసం వాడే రోకలి, కత్తిపీట, పప్పుగుత్తి, తెడ్డు, కవ్వం, పీటలు, తిరగలి పిడి, రుబ్బురోలు పిడి వంటివన్నీ వడ్రంగి చేయాల్సినవే. ఇప్పుడు వంటగది మా కోసం చూసేది ఒక్క పప్పుగుత్తి కోసమే. మిగిలిన అన్నింటికీ ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. ఇంటి నిర్మాణంలో అయితే పునాది వేసిన తరవాత మొదట ద్వారబంధాలు నిలబెట్టేవాళ్లు. ఇంటి తలుపులు, దంతులు, కిటికీలు, అల్మరాలు వడ్రంగి చేతి నుంచే రావాలి. మా నాన్న దగ్గర నేను అవన్నీ నేర్చుకున్నాను.అప్పట్లో దీపావళి వరకు వ్యవసాయ పనులుంటే ఆ తర్వాత వరికోతల వరకు పని ఉండేది కాదు. శీతాకాలం, ఎండాకాలాల్లో కొట్టాలు వేసేవాళ్లు. ఇప్పుడు తాటాకు కొట్టాల్లేవు. అన్నీ రేకుల కొట్టాలే. వాటిలో మా పని పెద్దగా ఉండదు. పెంకుటిళ్లు కూడా లేవు. అన్నీ స్లాబ్‌ ఇళ్లే. అన్నింట్లోనూ కొత్తదనం వచ్చి పాతదనం కొట్టుకుపోయినట్లే ఇది కూడా.

చిన్న కుటుంబాలూ కారణమే!
ఇప్పుడు ఇళ్లు కట్టడం బాగా ఎక్కువైంది. అప్పట్లో ఉన్నట్లు ఉమ్మడి కుటుంబాల్లేవిప్పుడు. ఇంటికి ఇద్దరున్నా సరే ప్రతి ఇంటికీ ఒక డైనింగ్‌ టేబుల్, సోఫాసెట్‌ తప్పనిసరిగా ఉంటున్నాయి. డ్రెస్సింగ్‌ మిర్రర్‌లు, కార్నర్‌ స్టాండ్, చెక్క బీరువా, టీపాయ్, దివాన్‌ సెట్‌ వంటివి చాలా మంది వాడుతున్నారు. గ్రామంలో మేము చేసే పనులు తగ్గినప్పుడు ఊరినే నమ్ముకుంటే గడవడం కష్టమే. అందుకే వడ్రంగులం పట్టణాల బాట పట్టాం. ఫర్నిచర్‌ షాప్‌లతో కలిసి పని చేస్తున్నాం. వాళ్లయితే రోజూ పని చూపిస్తారు. పీస్‌ లెక్కన పేమెంట్‌ ఇస్తారు. మేము సొంతంగా పని చేసుకోలేకపోతున్నాం... అనే మాట నిజమే. కానీ ఇప్పుడు మాకు నెలకింత డబ్బు వస్తుందనే భరోసా ఉంటోంది. నిజానికి అప్పట్లో కంటే ఇప్పుడే మాకు పని పెరిగింది. అందరూ ఇళ్లను బాగా అందంగా కట్టుకుంటున్నారు. సిమెంట్‌ పనికి ఉన్నంత విలువ మా కొయ్యపనికి కూడా ఉంటోంది. 

మార్పు మంచిదే!
అప్పట్లో మా పని ఎక్కువగా రైతుల కోసమే ఉండేది. మాకు ఆత్మీయులూ వాళ్లే. ఇప్పుడు మాకు పని చూపించేది యజమాని, ఆ యజమానితోపాటు యజమాని దగ్గర పని చేసే మా లాంటి మరికొందరు కార్పెంటర్‌లతోనే స్నేహమైనా, ఆత్మీయత అయినా. మా వృత్తిలో ఎప్పుడూ మాట మెత్తగా ఉండాలి. కస్టమర్‌లు వాళ్లకు ఏం కావాలో చెప్తారు. ఒక్కో డిజైన్‌ నుంచి ఒక్కో పార్ట్‌ చెప్పి అన్నింటినీ కలిపి కొత్త డిజైన్‌ కావాలంటారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంతో మేము కూడా కొత్త డిజైన్‌ నేర్చుకుంటాం. ఒక్కోసారి వాళ్లడిగినట్లు చేయడం కుదరదు. ఉడ్‌ పట్టు నిలవదు. అలాంటప్పుడు ఎందుకు కుదరదో వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఆ సూత్రాన్ని ఒంటబట్టించుకుంటే మా వృత్తి అన్నమే కాదు పరమాన్నం కూడా పెడుతుంది. ఈ వృత్తి ఎన్ని తరాలైనా ఎక్కడికీ పోదు. చెట్టు ఉన్నంత కాలం మేమూ ఉంటాం’’.

యంత్రసాయం!
వ్యవసాయంలో మా పనిముట్ల స్థానంలో ట్రాక్టర్, కరెంట్‌ మోటార్, వరికోత మెషీన్‌ వచ్చేశాయి. వాటి వల్ల రైతుకి పని చాలా సులువైంది. గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్‌ పెరిగే కొద్దీ నాగళ్లు అటకెక్కసాగాయి. పొలం దున్నేవాళ్లు తగ్గిపోసాగారు. గొర్రుతో సేద్యం చేసేవాళ్లు లేరిప్పుడు. 

– అలజంగి వెంకటాచారి, కార్పెంటర్‌ 
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, 
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు