ప్రొఫైల్ పిక్చర్...

18 Jul, 2015 22:45 IST|Sakshi
ప్రొఫైల్ పిక్చర్...

మెట్రో  కథలు
 
 మీరు నాకు పని ఇవ్వాలి. చేస్తాను. చూశాడు. అలా చూడొద్దు. పని ఇవ్వండి. చేస్తాను.  ప్యాంట్ వేసుకుని ఉంది. కొత్తదని తెలిసిపోతూ ఉంది. ఫుల్‌షర్ట్ వేసి చేతులు మాటిమాటికి పైకి నెడుతూ ఉంది. ఒదులొదులు శరీరం. బట్టలు బిగుతుగా ఉండటం వల్ల చూడటానికి కొంచెం అసౌకర్యంగా ఉంది. సినిమా ఫీల్డంటే చీరలు సారెలు ఇబ్బంది అని చెప్పారు. కొత్తవి. మొన్నే కొన్నాను. కాళ్ల వైపు చూశాడు. షూస్ కూడా కొత్తవే. స్పోర్ట్స్ షూస్. మూడు గంటలకు ఒక ఆడిషన్ ఉంది. ముంబై నుంచి ఆర్టిస్ట్ రావాలి. శంషాబాద్‌లో ల్యాండయ్యి రింగ్‌రోడ్డున పడింది అని ఫోన్. కాని నాలుగయ్యేలా ఉంది. ఈలోపు ఈమె దూరింది. గంట నుంచి అసిస్టెంట్ డెరైక్టర్‌ని నస పెడుతోందట. వదిలేశాడు.

 సినిమాల గురించి మీకేం తెలుసు? మీరు నవ్వుతున్నారు. లేదు.. లేదు.. చెప్పండి.పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని. చాలా తెలుగు సినిమాలు చూశాను. నరసింహరావుగారు రాసిన డెరైక్టర్ కావడం ఎలా అనే పుస్తకం చదివాను. అంతే. మీరు నవ్వుతున్నారు.
 వయసు నలభై లోపు ఉండే అవకాశం లేదు. యాభై కూడా దాటకపోవచ్చు. ఈ వయసు వాళ్లు ఇలా వచ్చి అడగడం మొదటిసారి.
 ఏం చేస్తుంటారు? మామూలే. హౌస్‌వైఫ్. మావారు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో వాలెంటరీ తీసుకున్నారు. ఒక ప్రయివేట్ ఫర్మ్‌వాళ్ళు మంచి ఆఫర్ ఇవ్వడంతో మళ్లీ ఉద్యోగంలో చేరారు. మా అబ్బాయి యూ.ఎస్. వెళ్లి టూ ఇయర్స్. ఇంట్లో అత్తగారు.. నేను...
సరే. చూద్దాం. అంటే పని ఇచ్చినట్టేనా? కాల్ చేస్తాను. మావాడితో టచ్‌లో ఉండండి.పోనీ పద్యం పాడనా? ఇస్తారా? పద్యం పాడతారా? నేను కాలేజ్ రోజుల్లో చాలా పాత్రలు వేశాను. ప్రైజ్‌లు కొట్టాను. బెస్ట్ యాక్టర్‌ని.ఆ సంగతి చెప్పలేదూ. నాటకాలు కూడా రాశాను. యూనివర్సిటీలో ఉండగా ఒక నాటకం ఢిల్లీ దాకా వెళ్లిందనుకోండి. అయితే అవన్నీ పాత రోజులు. చూస్తున్నాడు.

పెళ్లయ్యింది. ట్రాన్స్‌ఫర్లతో ఊళ్లు తిరగడమే సరిపోయింది. అన్నీ పోయాయి. కొడుకు ఒక లోకం అనుకున్నా. వాడూ రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. రెండేళ్లుగా కొంచెం గొడవలు. మావారికి తెలియకుండా మూడు లక్షలు అప్పు చేశాను. మూడు లక్షలా? అవును. చీరల కోసం. ఫేస్‌బుక్‌లో పెట్టాలిగా... చూస్తున్నాడు. మొదట ఇంట్లో మొక్కల ఫొటోలు... నచ్చిన సినిమాల ఫొటోలు... గుడ్ మార్నింగ్‌లు... గుడ్‌నైట్‌లు... వెలిగే కొవ్వొత్తులు... వాటి కింద క్యాప్షన్‌లు... ఇవి పెట్టేదాన్ని. తర్వాత ఒకరోజు మంచి ఫొటో దిగి ప్రొఫైల్ పిక్చర్ మార్చాను. బాబోయ్. ఎన్ని లైకులు. చాలా కామెంట్లు. ఏదో పెద్ద నేషనల్ అవార్డు వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఒక కుర్రాడు పొయెట్రీ రాశాడు. సాహిత్యం నుంచి కూడా రిఫరెన్స్ ఇచ్చాడు. అలాంటి చీర కట్టుకున్నవాళ్లను ఏదో అంటారట. గుర్తు లేదు. మొత్తం మీద అలా. మొదట తెలియలేదు. కాని చాలా అలవాటైపోయింది. వారానికి ఒకసారి ప్రొఫైల్ పిక్చర్- నాకు గురువారం సెంటిమెంట్- ఆరోజు మార్చేదాన్ని. లైకులూ కామెంట్లూ నా థ్యాంక్యూ వెరీమచ్‌లూ...  వీటితో మళ్లీ గురువారం దాకా గడిచిపోయేది. మళ్లీ ఇంకోటి. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించేది. టీవీ సీరియళ్లలో పడి కొట్టుకోవడంలో ఈ మజా లేదనిపించేది.

కొందరు చాటింగ్‌లోకి వచ్చేవారు. ఎలా ఉన్నావ్ అక్కా అని పలకరించేవారు. అర్ధరాత్రి దాకా అదో కాలక్షేపం. కాని చివరకు అక్కను తీసి గట్టున పెట్టేవారు. చెడ్డ పిల్లలు ఉంటారు కదా. వాళ్లను అన్‌ఫ్రెండ్ చేసి మళ్లీ ఇంకొకరితో. ఎంత ఫేమస్ అయ్యానంటే గురువారం వస్తుందంటే చాలు ముందు రోజు నుంచే హడావిడి... మెసేజ్‌లు... వెయిటింగ్ ఫర్ న్యూ ప్రొఫైల్ పిక్చర్ అని ఆకాంక్షలు. అంత డిమాండ్ ఉన్నప్పుడు కట్టిన చీరలే కట్టి కనపడటం బాగోదు కదా. వాటి వెంట పడ్డాను. మావారు హ్యాపీనే. తన్ను వదిలిపెట్టి ఏదో ఒకటి చేసుకుంటున్నాను. ఇంకేం కావాలి? కాని మా అత్తగారే నస పెట్టి మొన్నొక రోజు సెల్ లాక్కుని విసిరి కొడితే ఆమెను తోసేస్తే తుంటి

విరిగి... పెద్ద గొడవ... తల దించుకుంది. తర్వాత సిగ్గేసింది. ఏంటిది? అని. ఇదిగో ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని మీ దగ్గరకు వచ్చాను. మీ సినిమాలు కొంచెం పద్ధతిగా ఉంటాయి. పని ఇచ్చినట్టేనా?ఇంకా ఫేస్‌బుక్‌లోనే ఉన్నారా? నవ్వింది. భలేవారే. ఎందుకు బయటకు వస్తాను. కాకపోతే ఇక మీదట నా పోస్ట్‌లు మారతాయి. ఫలానా సినిమా షూటింగ్‌లో క్లాప్‌బోర్డ్ పట్టుకుని నేను... ఫలానా లొకేషన్‌లో పుస్తకం చదువుకుంటూ నేను... అలా అన్నమాట. ఆగి అంది.
 
పెద్దగా ఆశలు లేవు. కాని కొంచెం పని నేర్చుకుని ఏవైనా షార్ట్ ఫిల్మ్‌లు తీయాలని ఉంది. ఆడవాళ్ల గురించి.. ఆడపిల్లల గురించి.. చదువుకునే వయసులోకొస్తున్న అబ్బాయిల గురించి. ఏదో మార్చేస్తానని కాదు. నేను మారానుగా మొదట. వేళ్లు మాత్రమే పని చేస్తూ మిగిలిన శరీరమంతా పారలైజ్ అయ్యే వ్యవస్థ ఏదో మనల్ని బిగిస్తోంది. దానిని కొంచెం అలెర్ట్ చేయాలనిపిస్తోంది. మావారు ఆల్రెడీ అయ్యారనుకోండి. ఉద్యోగం మానేశారు...

 ఈసారి నిజంగానే నవ్వాడు.అయితే పని ఇచ్చినట్టేనా? సరే. రండి. మీరు నాకు పే చేయాలి. కొత్తవాళ్లకు డబ్బులివ్వరని విన్నాను. నాకు కావాలి. మూడు లక్షల అప్పు తీర్చేస్తానని మా అత్తగారికి మాట ఇచ్చాను. ఇదొకటా?అవును. సరే సరే  పెద్దగా నవ్వుతూనే ఉన్నాడు.
 
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 

మరిన్ని వార్తలు