ఈ రోజు చెత్త పడలేదే!

19 Nov, 2018 23:49 IST|Sakshi

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త ఇంటినుండి బయలుదేరి ఎటో వెళుతున్నారు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత ఒక ఇంటిదగ్గర గోడపై నుండి ఊడ్చిన చెత్తాచెదారం పైన పడింది. ప్రవక్త మహనీయులు తల, వస్త్రాలు శుభ్రంగా దులుపుకొని తన దారిన తను వెళ్లిపోయారు. రెండవరోజు కూడా అదేవిధంగా ఊడ్చిన చెత్తమీద పడింది. ప్రవక్త ఆ మలినమంతా మళ్ళీ శుభ్రం చేసుకొని ముందుకు సాగిపోయారు. ప్రతిరోజూ ఇలానే జరిగేది.ఎవరో కావాలనే ప్రతిరోజూ చెత్తాచెదారం వేయడం, ప్రవక్త ఎవరినీ ఏమీ అనకుండానే ఓ చిరునవ్వు నవ్వి దులుపుకుని వెళ్ళిపోవడం ఇదే తంతు.

ఏం జరిగిందో ఏమోగాని ఒకరోజు ప్రవక ్తమహనీయులు యధాప్రకారం అదే దారిన వెళ్ళారు. కాని ఆరోజు కసువు పడలేదు. ఆ రోజే కాదు, తరువాత రెండు రోజులు కూడా ఎలాంటి చెత్తాచెదారం పడలేదు. అలా రెండు మూడు రోజులుగా పడకపోయేసరికి చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఫలానా ఇంట్లో ఎవరూ లేరా? ఏదైనా ఊరెళ్ళారా? అని.ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుందని, కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని వారు చెప్పారు.

వెంటనే ప్రవక్త తను వెళుతున్న పని వాయిదా వేసుకొని, ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు తీవ్రజ్వరంతో బాధపడుతోంది. వైద్యం, తిండి తిప్పలు లేక ఆమె  నీరసించి పోయింది.‘‘అమ్మా! ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా పరామర్శించారు. మంచినీళ్ళు తాగించారు. అత్యవసర సేవలు అందించి సపర్యలు చేశారు. రోజూ వచ్చి, ఆమె కోలుకునే వరకూ కనిపెట్టుకుని ఉన్నారు. తనపట్ల ప్రవక్త ప్రవర్తిస్తున్న తీరుకు ఆ వృద్ధురాలు ఆశ్చర్యచకితురాలైంది. తను ఆయనని ఛీత్కరించినా, చెత్తాచెదారం పైన పోసి అవమానించినా, ఆ మహనీయుడు తనపై చూపిన దయకు, చేసిన మేలుకు ముగ్ధురాలైపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతూ, ప్రవక్తకు ప్రియశిష్యురాలిగా మారిపోయింది. చెడుకు చెడు సమాధానం కాదు. చెడును మంచి ద్వారా నిర్మూలించడమంటే ఇదే..!
– మదీహా 

మరిన్ని వార్తలు