వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్‌ సప్లిమెంట్‌?

17 Jan, 2020 02:08 IST|Sakshi

వయసులో ఉన్నప్పుడు వ్యాయామం గట్రా చేయడం పెద్ద ఇబ్బందేమీ కాకపోవచ్చు. వద్ధులు... వికలాంగులు, గాయాలపాలైన వారి పరిస్థితి ఏమిటి? వారికి వ్యాయామం అవసరమున్నా.. చేయలేని పరిస్థితి. కొంచెం చిత్రమైన ఈ సమస్యను అధిగమించేందుకు మిషిగన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేవలం ఒక ప్రొటీన్‌ సప్లిమెంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా వ్యాయామం తాలూకూ అన్ని ప్రయోజనాలు పొందవచ్చునని వీరు అంటున్నారు. శరీరంలో సహజంగా ఏర్పడే సెస్ట్రిన్‌ అనే ప్రొటీన్‌ వ్యాయామం తరువాత కండరాల్లో పేరుకుపోతుందని గతంలోనే గుర్తించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము  ప్రయోగాలు మొదలుపెట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న జూ హన్‌ లీ తెలిపారు.

ఈగలపై తాము పరిశోధనలు చేశామని ఒక గుంపు సాధారణమైన ఈగలు కాగా.. ఇంకోదాంట్లో సెస్ట్రిన్‌ ఉత్పత్తి జరక్కుండా చూశామని, మూడోదాంట్లో ఎక్కువ స్థాయిలో సెస్ట్రిన్‌ ఉత్పత్తి అయ్యేలా చేశామని జూ హన్‌ లీ వివరించారు. మూడు గుంపుల ఈగలూ శారీరకంగా శ్రమపడేలా చేసినప్పుడు సెస్ట్రిన్‌ ఎక్కువగా ఉన్న ఈగల సామర్థ్యం బాగా పెరిగినట్లు గుర్తించారు. శారీరక శ్రమ లేనప్పుడు కూడా వీటి సామర్థ్యం తగ్గకపోవడాన్ని బట్టి సెస్ట్రిన్‌ ద్వారా వ్యాయామం తాలూకూ ఫలితాలు అందుతున్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఈ సెస్ట్రిన్‌ ప్రొటీన్‌ను సప్లిమెంట్‌గా ఇవ్వడం ద్వారా శ్రమ లేకుండానే వ్యాయామం తాలూకూ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు