దశ దిశలా నిరసన

2 Dec, 2019 23:43 IST|Sakshi
సిలిగురి

‘నా కూతురు ఈ సమాజంలో భద్రంగా ఉందా?’ ‘మన పిల్లలను మనం కాపాడుకోగలమా?’ ‘సినిమాల్లో బూతును నిరోధించండి’ ‘ప్రతి మూడు నిమిషాలకు ఒక అత్యాచారం. ఇదా మన దేశం’ ‘విచారణలో కాలహరణం... న్యాయహరణమే’ ‘బాధితురాలి పేరు బయటకు చెప్పకండి’ ‘అంగీకారం లేని శృంగారం వద్దు’ ‘ఇంకా ఎంతమంది నిర్భయలు బలి కావాలి?’ ‘ఆడపిల్లలు ఆటవస్తువులు కారు’ ‘నీకు జన్మనిచ్చిన స్త్రీనే అగౌరపరుస్తావా?’ ‘మా దుస్తులు మీకు ఆహ్వానం కాదు’ ‘రేపిస్ట్‌లను ఉరి తీయండి’ ‘మేము రిపబ్లిక్‌లో ఉన్నాం. రేప్‌–పబ్లిక్‌లో కాదు’ ‘అందరి లక్ష్యం ఒక్కటే– అత్యాచార రహిత భారతదేశం’ ఇవీ  నేటి స్లోగన్లు... ప్లకార్డులపై కనిపిస్తున్న నినాదాలు

అన్నిచోట్లా నినాదాలు. దిక్కులు పిక్కటిల్లే ప్రతిధ్వనులు. ‘దిశ’ ఘటనకు దేశవ్యాప్త ప్రతిస్పందనలు ఇవి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, పౌర సంఘాలు, ప్రజలు... ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా కూడి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నారు. దోషులను శిక్షించాలని కోరుతున్నారు. తమ పిల్లలకు భద్రత ఇవ్వండి అని నిలదీస్తున్నారు. ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.

అమృత్‌సర్‌

కాని దిశ ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజంగా జరగవలసిన పని ఏమిటి? వీధివీధినా, వాడవాడనా స్త్రీలపట్ల గౌరవం కలిగించే చైతన్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించడం. పాఠశాలల్లో బాల్యం నుంచే విద్యార్థులకు జెండర్‌ అవగాహన కలిగించడం. అబ్బాయిలకు ఆడపిల్లలను సమస్థాయిలో చూసే సంస్కారం కలిగించడం. వారి ప్రవర్తనా దోషాలను మొగ్గలోనే తుంచేయడం. అందరం వ్యవహార శైలిలో, మాటలో, తిట్లలో స్త్రీలను కించపరిచే ధోరణిని పరిహరించడం. ఇళ్లల్లో భర్తలు భార్యలను గౌరవించడం.

ఢిల్లీ

పిల్లల ముందు పలుచన చేయకుండా ఉండటం. ఆడపిల్లలను మగపిల్లల కంటే తక్కువగా చూడకుండా ఉండటం. స్త్రీలను ఒక జోక్‌గా చేసి మాట్లాడకపోవడం. అశ్లీలతను మాధ్యమాలలో ప్రోత్సహించకపోవడం. బహిరంగ ప్రదేశాలలో స్త్రీలకు ప్రతి పౌరుడు ఒక కాపలాదారుగా మారగలగడం. వికృత ఆలోచనలు వెంటాడుతున్నవారు తమను తాము మార్చుకోవడానికి కౌన్సెలింగ్‌ సెంటర్లు తెరవడం. మానసిక జాడ్యాలను చెక్‌ చేసుకొనేందుకు ఉచిత మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయడం.

బెంగళూరు

వాటికి వెళ్లేలా ప్రోత్సహించడం. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎటువంటి శిక్షలు పడతాయో విరివిగా ప్రచారం చేయడం. అన్నింటికి మించి ప్రభుత్వాలు ఈ విషయంలో గట్టిగా, చిత్తశుద్ధిగా పని చేయడం, చర్యలు తీసుకోవడం. అప్పుడే ‘దిశ’ ఆత్మకు శాంతి. అప్పటి వరకూ ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి. ఈ నిరసన ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.

మరిన్ని వార్తలు