మేధా వారధి

30 May, 2019 02:02 IST|Sakshi

సాధారణంగా పైచదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు, చదువు మీదే దృష్టి పెడతారు. కాని మేధ మాత్రం చదువుతో పాటు సామాజిక సేవా చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి హెల్త్‌ సైకాలజీలో ఇంటిగ్రేటెడ్‌ ఎం.ఎస్‌సి. చేసిన మేధ, స్కాలర్‌షిప్‌ మీద పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో చేరి మాస్టర్స్‌ ఇన్‌ సోషల్‌ వర్క్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. అక్కడ చేరిన మూడు నెలలకే ‘వాయిస్‌ ఫర్‌  గర్ల్స్‌’ స్వచ్ఛంద సంస్థలో శిక్షణ పొందారు. ఒక పక్కన చదువులో రాణిస్తూనే మరో పక్క సంఘ సేవపై శ్రద్ధ పెట్టారు.

మేధ సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరిన మొదటి సంవత్సరమే వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ సంస్థ తరఫున పనిచేయడానికి కాంపస్‌ నుండి ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సాంఘిక సేవ. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించి, వాటిని ఎదుర్కొనేలా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించడం. అంతే కాదు.. అట్టడుగు వర్గాలకు చెందిన టీనేజర్స్‌కి ఆర్థిక, సాంఘిక సమానత్వం సాధించుకునేలా  ‘వాయిస్‌’ వలంటీర్‌లు అవగాహన కల్పిస్తారు. జీవనోపాధికి ఉపయోగపడే మార్గాలను ఎంచుకునేలా తీర్చిదిద్దుతారు. గ్రామాలలో, చిన్న చిన్న పట్టణాలలో ఉండే బాలికల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, వారికి జీవన నైపుణ్యాలు నేర్పుతారు.

వ్యక్తిగత పరిశుభ్రత, ఋతు సమయంలో పాటించవలసిన పరిశుభ్రత, న్యాప్‌కిన్స్‌ వాడటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియచేస్తారు. ‘‘మొదట్లో వారికి నా మాటలు నచ్చలేదు.  వారం రోజులు గడిచేసరికి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తరవాత ఆచరించడం ప్రారంభించారు’’ అన్నారు మేధ.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలు రాయడం, చిన్న పదాలు చదవడం వచ్చు. ఎవరైనా ఇంగ్లీషు మాట్లాడితే అర్థం చేసుకోగలరు, కాని మాట్లాడాలంటే సిగ్గు పడతారు. అటువంటివారికి నెల రోజుల పాటు స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు నిర్వహించి, ధైర్యంగా మాట్లాడేలా తయారుచేశారు. వారి మీద జరిగే లైంగిక అత్యాచారాల గురించి అవగాహన కలిగించారు. వారికి ఉండే మౌలిక హక్కులను వారికి తెలియపరిచారు.

స్వచ్ఛంద సంస్థల వారధివిద్య పరంగా వెనుకబడిన చోట బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతాయి. అటువంటి వివాహాలు జరగకుండా జాగ్రత్త పడాలని వారికి అర్థమయ్యేలా వివరించడం తన బాధ్యతగా భావించారు మేధ. అలాగేజీవితం లో ఎదుర య్యే ఆటంకాలను అధిగమించేలా పాఠ్య ప్రణాళికను రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే బాలికలకు బోధించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శిబిరాలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలకు, స్వచ్ఛంద సంస్థలకు వారధిగా, ఇతర కౌన్సెలర్‌లకు మార్గదర్శిగా కూడా వ్యవహరించారు మేధ. ఎమ్‌.ఎస్సీ హెల్త్‌  సైకాలజీలో భాగంగా హైదరాబాద్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌లో ఎనిమిది నెలలు ఇంటర్న్‌షిప్‌ చేసిన సమయంలో రోగుల మానసికస్థితిని పూర్తిగా గమనించారు.  
– వైజయంతి పురాణపండ

బాపూ అభిమాని
అమెరికా పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో నేర్చుకున్న విషయాలను, భారత దేశంలోని గ్రామాల అభివృద్ధి, బాలల హక్కుల పరిరక్షణ, బాలికల అభ్యున్నతి, సంక్షేమం కోసం వినియోగించాలనేది మేధ ఆశయం. సితార్‌ వాదనం, శాస్త్రీయసంగీతం, శాస్త్రీయ నృత్యంలో కూడా మేధకు ప్రవేశం ఉన్నది. నాట్యం అంటే మక్కువ. కవిత్వం, సామాజిక అంశాల మీద వ్యాసాలు రాస్తారు. చక్కటి చిత్రకారిణి కూడా. ఆమె అభిమాన చిత్రకారులు జామిని రాయ్, బాపు, వాంగో.

అంతర్జాతీయ పురస్కారం
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ లో ఎమ్‌.ఎస్‌ సోషల్‌ వర్క్‌లో స్కాలర్‌ షిప్‌తో సీటు వచ్చిన మూడు నెలలకే యూనివర్సిటీ సోషల్‌ వర్క్‌ విభాగం నుండి అంతర్జాతీయ ప్రతినిధిగా ఎంపికయ్యారు. తర్వాత ఆరు నెలలకు ఐరిస్‌ మేరియాన్‌ యంగ్‌ అనే ప్రముఖ రాజకీయశాస్త్రవేత్త, అంతర్జాతీయ సమస్యల అధ్యయనకర్త పేర నెలకొల్పిన ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. పట్టభద్రులలో ఒకరికి, ఇంకా పట్టభద్రులు కాని గ్రాడ్యుయేట్‌ విద్యార్థులలో ఒకరికి, అధ్యాపకులలో ఒకరికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. బాలల హక్కుల సంస్థలో విద్యాబోధనకై తను ప్రవేశపెట్టిన సృజనాత్మక బోధన పరికరాలకు, నేతృత్వ స్ఫూర్తికి మేధ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

>
మరిన్ని వార్తలు