సెక్యూరిటీ ఇవ్వండి ఆభరణాలు కాదు...

5 Dec, 2013 00:44 IST|Sakshi

ఇప్పటికీ మన దేశంలో... ఆడపిల్ల అనగానే దిగులు పడిపోయే తల్లిదండ్రులకు తక్కువేమీ లేదు. కొందరు గర్భంలోనే తుంచేద్దామని ఆలోచిస్తే, కొందరు పుట్టిన తరువాత ఎలా వదిలించుకుందామా అని చూస్తుంటారు. ఇంకా పాపకి ఊహ కూడా రాకముందే... ఆమెకి పెళ్లి ఎలా చేయాలి, ఎంత కట్నం ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని టెన్షన్ పడిపోతుంటారు. ఆడపిల్లని చూడగానే పెళ్లి అన్నమాటే ఎందుకు గుర్తొస్తుందో ఇప్పటికీ అర్థం కాదు.
 
 సమాజం ఇంతకుముందులా లేదు. ప్రపంచం వాయువేగంతో పరిగెడుతోంది. ఆ వేగాన్ని అందుకోవాల్సిన అవసరం పురుషులకే కాదు, మహిళలకూ ఉంది. జీవన ప్రమాణం పెరిగేకొద్దీ బాధ్యతలను స్త్రీ, పురుషులిద్దరూ పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు బయటకు వస్తున్నారు. అన్ని రంగాల్లో పాదం మోపుతున్నారు. అందలాలు ఎక్కుతున్నారు. కానీ ఇప్పటికీ మహిళలు అని గుచ్చి గుచ్చి అనడం మానలేదు కొందరు. దానికి కారణం ఉంది.
 
 శక్తి అవతలివాళ్లకు ఎలా తెలుస్తుంది? బహిర్గతపరిచినప్పుడే కదా? అందుకే ముందు మహిళల్లో చైతన్యం రావాలి. మేము ఈ పని చేయలేము, ఈ ఉద్యోగానికి సూటవము అన్న దృక్పథాన్ని వీడాలి. ఏదైనా సాధించగలిగే సత్తా ఉందని నిరూపించాలి. అయితే మహిళలు ఇలా కావడానికి తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం కూడా అవసరం.

నేను మంచి టెన్నిస్ ప్లేయర్‌ని. మ్యాచ్ ఆడి ఇంటికొచ్చేసరికి నా ఒళ్లు, జుట్టు చెమటతో తడిసిపోయేవి. పెద్ద జుట్టు కావడంతో దాన్ని ఆరబెట్టుకోవడం పెద్ద సమస్యగా ఉండేది. అప్పుడు మా పేరెంట్స్ నన్ను జుట్టు కట్ చేసేసుకోమన్నారు. అప్పట్లో ఆడపిల్లలకు జుట్టు కట్ చేసేవాళ్లు మా ఊళ్లో లేకపోవడంతో, మగాళ్లకు చేసే బార్బర్‌తోనే బాయ్ కట్ చేయించేశారు. ఇది చిన్న విషయమే. కానీ వాళ్ల దృక్పథం చాలా గొప్పది. నేను చేసేదానికి ఆ చిన్న అడ్డు కూడా రాకూడదన్నది వాళ్ల ఉద్దేశం. అందరు తల్లిదండ్రులూ పిల్లల లక్ష్యాల గురించి అంతగా ఆలోచించాలి అని చెప్పేందుకే దీన్ని ఉదహరించాను.
 
 మరో విషయం ఏమిటంటే... ఎంత ఎదిగినా స్త్రీలకు సెక్యూరిటీ సమస్య ఉంటుంది. అందుకు కూడా నా తల్లిదండ్రులు ఓ మార్గం ఆలోచించారు. వాళ్లు ప్రతిసారీ నాతో రాలేరు కాబట్టి, నాలోనే చిన్న చిన్న మార్పులు చేశారు. నాకెప్పుడూ వదులుగా ఉండే చొక్కాలు, ప్యాంట్లు వేసి అబ్బాయిలా తయారు చేసి పంపేవారు. దొంగలుంటారని ఆభరణాలు కూడా పెట్టేవారు కాదు. నేను అదే చెబుతున్నాను అందరికీ. పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వండి, ఆభరణాలు కాదు.
 
 కాస్త ఆలోచిస్తే ఆడపిల్లలను పెంచడం, వృద్ధిలోకి తేవడం, సెక్యూరిటీ ఇవ్వడం... ఏదీ అంత సమస్య కాదు అని చెప్పేందుకే నేనివన్నీ చెప్పాను. ఎందుకంటే, ఈ కారణాలతోనే చాలామంది ఆడపిల్లలు వెనకబడిపోతున్నారు. ఆ అవసరం లేదు. మీలోని శక్తిని వెలికి తీయాల్సిందే. అందుకు తగిన దారుల్ని వెతికి పట్టుకోవాల్సిందే. దేనికైనా సిద్ధపడి అడుగు ముందుకు వేయాల్సిందే. ఆ తెగువ, ఆత్మవిశ్వాసం, పట్టుదల మీలో ఉండాలే కానీ... మిమ్మల్నెవరు ఆపగలరు చెప్పండి!    
     
 - కిరణ్‌బేడీ, తొలి మహిళా ఐపీఎస్

 

మరిన్ని వార్తలు