కృష్ణం వందే జగద్గురుమ్

24 Aug, 2016 22:53 IST|Sakshi
కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణతత్వం


లోకానికి తన గీత ద్వారా జ్ఞానం అందించి వెలుగు చూపిన సారధి జగద్గురువు శ్రీకృష్ణుడు. పెనుచీకటికి ఆవల ఏకాకారుడై కోటి సూర్య సమప్రకాశ విరాజితుడు, సర్వేశ్వరుడైన గీతకారుడు లోకానికి గీత అందించి జ్ఞాన ప్రసూనాలు వికశింపజేసిన విజ్ఞాని.


అధర్మం ఏర్పడినప్పుడు
యథా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత!
అభ్యుత్థా నమ ధర్మశ్య తదాత్మానం సృజామ్యహం!!
అని ప్రవచించిన ఆది గురువు శ్రీకృష్ణుడు.


కృష్ణతత్వమ్ అంటే సమానత్వం, ప్రేమ పరిపూర్ణ వికాస రూపం. శ్రీకృష్ణుని బోధనలు ధర్మ పరిరక్షణ, సమభావన, కర్తవ్య నిర్వహణ బాధ్యత, ఆది గురువుగా ఆయన జీవన విధానమే లోకానికి ఒక ప్రామాణికం. సామాన్య జనులకు, భక్తులకు ఊరట కలిగించే ధర్మం పక్షాన, పేదల పక్షాన నిలిచిన సామాన్యవాది.


కులమతాలకు అతీతంగా ఎలా కలిసిపోవాలో తెలిపిన అభ్యుదయ మూర్తి. ధర్మ రక్షణకు పూనుకున్నవాడు. అధర్మం అంతు చూసినవాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అండగా నిలిచి స్త్రీ యొక్క శీలం కాపాడి స్త్రీ దైవస్వరూపం అని లోకుల కళ్ళు తెరిపించిన ఆదర్శమూర్తి.

 
ధర్మం విలువ తెలుపుటకు, ధర్మం పక్షాన నిలుచుటకు వయోపరిమితి అడ్డుకాదు అని తెలిపిన ధర్మశీలి. స్నేహానికి సరైన నిర్వచనం ఏదైనా వుందీ అంటే అది కేవలం శ్రీకృష్ణుడు. కుచేలునిపై శ్రీకృష్ణుడు చూపిన వాత్సల్యం అతని స్నేహధర్మానికి పరాకాష్ఠ.  అర్జునుడికి తాను చేయవలసిన కర్తవ్యాన్ని ఉపదేశించి అధర్మాన్ని ఎదుర్కోవడం ఎంత కష్టం అయినా ధర్మంతో పోరాటం చేస్తే కీర్తి లభిస్తుందని తెలిపిన తత్వదర్శి శ్రీకృష్ణపరమాత్మ.  - శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి

మరిన్ని వార్తలు