సోరియాసిస్‌కి హోమియో వైద్యం

19 Oct, 2013 23:37 IST|Sakshi
సోరియాసిస్‌కి హోమియో వైద్యం

దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం స్త్రీ, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సోరియాసిస్ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఉత్పాతాలను సృష్టిస్తోంది.
 
 ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో నలిగిపోతున్నారు. అయితే హోమియో వైద్య విధానం సూచించిన సంపూర్ణ శారీరక, మానసిక తత్వశాస్త్రాన్ని అనుసరించి, సత్వర పరిష్కారాల కోసం చూడకుండా శాశ్వత స్వాంతన చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధి మీద అంతిమ విజయం సాధించవచ్చు.
 
 సోరియాసిస్ అనేది దీర్ఘకాలంపాటు కొనసాగే చర్మవ్యాధి. చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు, పొడలు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపునీ కలిగి ఉండవచ్చు. కేవలం చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల తదితర శారీరక భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. మొదట్లో సోరియాసిస్ మచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచేకొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. పొలుసులను తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి.
 
 దురద ప్రధాన లక్షణం కాదు. అయితే వాతావరణం చల్లగా ఉండి, తేమ తగ్గిపోయినప్పుడు కాని, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడు గానీ, తీరుబడిగా ఉన్నప్పుడుగానీ దురద ఎక్కువవుతుంది. బాధితుల్లో 10-20 శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా వ్యాపిస్తాయి.
 
 ఎందుకు వస్తుంది?


 వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వల్ల సోరియాసిస్ వస్తుందని ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడిచేసినప్పుడు వాటినుంచి రక్షణ పొందడానికి, అవి ఏర్పరచిన అపశ్రుతులను సరిచేయటానికి మన శరీరంలో తెల్లరక్తకణాలనే ప్రత్యేకమైన కణాలు పనిచేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలను మానేలా చేస్తాయి. దీనినే వ్యాధినిరోధక శక్తి అంటున్నాం.
 
 ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్‌ఫ్లమేషన్ (ఎరుపుదనం, వాపు) తయారవుతుంది. సోరియాసిస్‌లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. ఇది శరీర కణజాలాన్ని (చర్మ కణజాలం) అన్యపదార్థంగా అన్వయించుకొని, దాడి చేసి ఇన్‌ఫ్లమేషన్ కలిగిస్తుంది. దాంతో చర్మకణాలు అనియతంగా పెరిగే పొలుసులుగా తయారవుతాయి. అయితే వ్యాధి నిరోధక శక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాలవల్ల జరుగువచ్చు. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు ప్రేరకాలుగా పనిచేస్తాయి.
 
 సోరియాసిస్ రకాలు


 సోరియాసిస్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. స్థూలంగా అవి 1) సోరియాసిస్ వల్గారిన్ 2) గట్టేట్ సోరియాసిస్ (గట్టా అంటే బిందువు) 3) పుస్టులార్ (పస్ అంటే చీము) 4)ఎరిత్రో డెర్మల్ సోరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపు).
 
 చికిత్సా విధానం - హోమియోపతి దృక్పథం


 ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్ధాంతంపై హోమియోపతి వైద్యవిధానం ఆధారపడి ఉంది. దీనినే లాటిన్‌లో ‘సిమిలియా సిమిలిబస్ క్యూరేంటర్’ అంటారు. ఇంచుమించు మన ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ లాంటిదని చెప్పవచ్చు.
 
 ఒకే రకమైన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్నవ్యక్తులు భిన్నభిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదంపైన హోమియోపతి ఆధారపడి ఉంది. దీన్నే మూర్తిత్వమంటారు. హోమియోపతికి మాత్రమే సంబంధించిన విలక్షణ అంశమిది.
 
 సోరియాసిస్ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక - శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకుని మందులను సూచిస్తారు. అయితే చికిత్సా ఫలితాలు ఆహార, వ్యవహార, ఔషధాల సమిష్టి ప్రయోగాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి ఉంటాయి.
 
 సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సెనికం ఆల్బం (శీతాకాలం ఎక్కువగును), సల్ఫర్, కాలి ఆర్క్, సోరినమ్, మెజీరియం, పెట్రోలియం వంటి మందులను వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
 
 అసలు ఈ వ్యాధిఎలా వస్తుంది?


 మామూలుగా ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరమూ తయారవుతుంటాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పై పొరగా ఏర్పడినవి క్రమంగా నిర్జీవమై ఊడిపోయి కింది కణాలను బహిర్గత పరుస్తాయి. సోరియాసిస్ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపలకు చేరుకుంటాయి. అదనపు కణసముదాయానికి పోషకత్వాలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది. దీనితో చర్మంపైన ఎర్రని పొడ తయారవడం, పొలుసులు ఏర్పడడం జరుగుతాయి.
 
 డాక్టర్ మురళి అంకిరెడ్డి,

 ఎం.డి (హోమియో),
 స్టార్ హోమియోపతి,
 సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్,  కూకట్‌పల్లి,
 విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
 రాజమండ్రి, కర్ణాటక
 www.starhomeo.com
 ph: 7416107107 / 7416109109

 

మరిన్ని వార్తలు