సైకియాట్రీ కౌన్సెలింగ్

27 Jul, 2015 23:04 IST|Sakshi

ఆ సమస్యకు బిహేవియర్ థెరపీ బెస్ట్

మాకు ఒక్కగానొక్క కూతురు. ఇటీవలే ఆమెకు పెళ్లి చేశాము. మా అల్లుడు అందగాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, దురలవాట్లేమీ లేవని నిర్థారించుకున్న తర్వాతనే సంబంధం కుదుర్చుకున్నాము. అయితే మా అమ్మాయి ఒక భయంకరమైన విషయం చెప్పింది. భర్త తనతో ఇంతవరకు శారీరకంగా కలవలేదట. ఫోన్‌లో ఎవరితోనో  విపరీతంగా మాట్లాడటం, మెసేజిలివ్వటం చేస్తుంటాడట. అదేమని నిలదీస్తే తనకు స్వలింగసంపర్కం అలవాటుందని (గే) అని, ఆ అలవాటునుంచి బయట పడాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాడని, అయితే ఎంత ప్రయత్నించినా ఆ అలవాటునుంచి బయటకు రాలేకపోతున్నానని, తనని క్షమించమని అడిగాడని చెప్పింది. మేము ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి తగిన సలహా చెప్పగలరు.
 - ఒక తండ్రి, హైదరాబాద్

ఒక తండ్రిగా మీరు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్నాను. అయితే ఈ విషయంలో మీరేమీ ఆందోళన పడవద్దు. ఇటీవలకాలంలో పాశ్చాత్య నాగరికతా ప్రభావం వల్ల ఇటువంటి అలవాట్లు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఇటువంటి వారికి బాల్యంలో జరిగే కొన్ని సంఘటనలు, అనుభవాల వల్ల వారు ఈ విధంగా తయారవుతారు. కొందరి విషయంలో కొన్ని జన్యు సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుంది. నా దగ్గరకు ఇలాంటి కేసులు చాలా వ స్తున్నాయి. అయితే మీ విషయంలో కొంతలో కొంత మెరుగు ఏమిటంటే మీ అల్లుడికి తను చేసేది తప్పని తెలుసు, పైగా చేస్తున్న పనికి పశ్చాత్తాప పడటం, దానినుంచి బయటకు రావాలని ప్రయత్నించటం. ఇటువంటి అలవాట్లు ఉన్న వారు చాలా మంది ముందు అసలు బయట పడరు. ఒకవేళ బయటపడినా తమ జీవిత భాగస్వామి మీదనే ఏవో ఒక నిందలు మోపి, అటు తమ జీవితాన్ని, ఇటు భాగస్వామి జీవితాన్ని కూడా దుర్భరం చేస్తారు. మీరు ఈ విషయాన్ని అందరికీ చెప్పి, పదిమంది చేతా అతనికి హితబోధలు, నీతులు చెప్పించి, సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు. మీ అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పండి. ముందు అతనికి ఆపోజిట్ సెక్స్ అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోండి. ఏదోవిధంగా అతని ఫోన్ కాంటాక్ట్స్ కట్ చేయండి. కొత్తవారిని కలవకుండా మీ అమ్మాయి భర్తతో బాగా ప్రేమగా ఉంటూ మంచిగా దారిలోకి తెచ్చుకోవాలి. మీ అల్లుడికి బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా చాలావరకు ప్రయోజనం ఉంటుంది.
 అందువల్ల ఆందోళన పడకుండా, సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.
 
 డాక్టర్ కల్యాణచక్రవర్తి
 కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
 మెడిసిటీ హాస్పిటల్,
 సెక్రటేరియట్ దగ్గర, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు