అర్థం కాని కొడుకు

26 Dec, 2019 00:48 IST|Sakshi

భార్య చనిపోతే ఆ భర్తకు భార్యను వెతుకుతుంది సమాజం. అయితే ఆ భార్య అతని కొడుకుకు తల్లి కాగలదా? ఆ కొడుకు ఆమెను తల్లిగా స్వీకరిస్తాడా? చాలా సున్నితమైన అంశాలు. సదుద్దేశాలతో ఇటువంటి వివాహాల్లో ప్రవేశించే స్త్రీలకు మనోవ్యధ మిగిలితే? ఏం చేయాలి?

ఆమెను చూస్తే సైకియాట్రిస్ట్‌కు ఆందోళనగా అనిపించింది. చాలాఏళ్లుగా మనోవ్యధ భరించి భరించి పూర్తిగా కుంగిపోయిన స్త్రీలా ఉందామె. ఆమెకు జీవితం మీద ఆశ లేదు. జీవితంలో సంతోషం ఉంటుందనీ తెలియదు. చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు ఫలితం ఇంత చేదుగా ఉంటుందని ఊహించక కుదేలై ఉంది. ‘నేనొక దురదృష్టవంతురాలైన మారుతల్లిని డాక్టర్‌’ అందామె. సమత వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. కాని ఇంకో పది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. జుట్టు పలుచబడింది. కళ్ల కింద నీడలు. పలుచబడ్డ శరీరం. మెల్లగా ఉన్న కదలికలు. కాని పదేళ్ల క్రితం ఆమె ఇలా లేదు. ఎంతో ఉత్సాహంగా ఉండేది. సాటి మనుషుల పట్ల దయగా ఉండేది. తోటి మనుషుల ఆనందంలో తుళ్లిపడేది. ఆ సమయంలో ఆమె వయసు 18 సంవత్సరాలు. హైదరాబాద్‌లో బిటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుండేది. చదువు గురించిన ఆలోచనలు తప్ప జీవితపు ఆలోచనలు లేవు. కాని ఆ ఆలోచనలు చేయాల్సి వచ్చింది.

ఒకరోజు ఆమె తండ్రి గుంటూరు నుంచి కలవడానికి హాస్టల్‌కు వచ్చాడు. ‘ఎలా చదువుతున్నావమ్మా?’ ‘బాగా చదువుతున్నాను నాన్నా’ తండ్రి కాసేపు ఆలోచనలో ఉన్నవాడిలా కనిపించాడు. ‘రోహిత్‌ గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా అమ్మా’ రోహిత్‌ పేరు తలువగానే సమత మనసు బెంగతో నిండిపోయింది. రోహిత్‌ ఆమె అక్క కొడుకు. ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు. సమత అక్క భాను రెండేళ్ల క్రితం కేన్సర్‌తో కన్నుమూసింది. ఆమె బావ సుధీర్‌ జంషడ్‌పూర్‌లో పని చేస్తున్నాడు. చాలా మంచివాడు. భార్య చనిపోయాక చాలా నిబ్బరంగా పిల్లవాడిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. రెండేళ్ల కాలం అతనిలో చాలా మార్పే తెచ్చింది. ఒంటరి జీవితం, చిన్న పిల్లవాడు... అతన్ని గంభీరంగా మార్చాయి. ఎప్పుడైనా గుంటూరు వచ్చినా రెండు మూడు రోజులు ఉండి వెళ్లిపోయేవాడు. ఆ రెండు మూడు రోజుల్లో రోహిత్‌ ఏ ప్రవర్తనలో ఉండాలో తెలియక కొత్తగా ఉండేవాడు. ‘మీ బావను ఇంకో పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదమ్మా’ అన్నాడు తండ్రి. సమత ఈ సంభాషణ ఎక్కడకు వెళుతోందో అర్థం చేసుకుంది.

‘నీ ఆలోచన ఏమిటమ్మా?’ అడిగాడు. ‘నాన్నా... బావ మంచివాడు. రోహిత్‌ మన పిల్లవాడు. నాకు వారిద్దరంటే జాలి, ప్రేమ ఉన్నాయి. కానీ...’ ‘కానీ అంటే లాభం లేదమ్మా. నువ్వు పెద్దమనసు చేసుకోవాలి. వేరే స్త్రీ అయితే రోహిత్‌కు పూర్తిగా తల్లిప్రేమ చూపించకపోవచ్చు. నువ్వైతే నీ అక్క కొడుకే కాబట్టి నీ పిల్లాడిగా చూసుకుంటావు’ సమత మౌనంగా ఉండిపోయింది. ‘మావయ్యా... అలాంటి ఆలోచనలు చేయొద్దు. సమత చిన్నపిల్ల. చాలా భవిష్యత్తు ఉంది. నేను పెళ్లి చేసుకోలేను’ అన్నాడు ఫోన్‌లో సుధీర్‌. ‘లేదు బాబూ... ఇలా ఎక్కువ రోజులు ఉంటే నీ ఆరోగ్యానికే ప్రమాదం. బాబు ఎదుగుదలకు కష్టం’ అన్నాడు సమత తండ్రి. ‘ఈ పెళ్లి సమతకు ఇష్టమేనా?’ ‘తనకు పూర్తి సమ్మతమే’ అన్నాడు తండ్రి. పెళ్లి జరిగిపోయింది. సుధీర్‌ది పెద్ద ఉద్యోగం. మనిషి యావరేజ్‌గా ఉంటాడు. పెళ్లి చేసుకోవడమే లేట్‌గా చేసుకున్నాడు. వీటన్నింటి కారణాన అతనికీ సమతకు దాదాపు 14 ఏళ్ల గ్యాప్‌ ఉంది. ఇంత గ్యాప్‌ ఉన్నప్పటికీ ఎంతో సహృదయంతో తన కోసం,  పిల్లాడి కోసం సమత చేసిన త్యాగానికి అతడి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.

సమతను ఎంతో బాగా చూసుకోవడం మొదలెట్టాడు. అంతవరకూ రోహిత్‌ను నిమిషం కూడా వదలకుండా అంటిపెట్టుకుని ఉండే అతడు కొంచెం రిలాక్స్‌ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే రోహిత్‌ బాధ్యత పూర్తిగా సమతకే అప్పజెప్పాడు. కాని అప్పుడు మొదలైంది చిక్కు. రోహిత్‌ ప్రవర్తనలో సడన్‌గా మార్పు మొదలైంది. అల్లరి పెంచాడు. మాట వినకుండా మొండికేయడం మొదలెట్టాడు. స్కూల్లో కూడా పాఠాలు సరిగ్గా వినకుండా అటెన్షన్‌ పెట్టకుండా నానా యాగీ చేస్తున్నాడని కంప్లయింట్‌లు వచ్చాయి. సుధీర్‌కు ఇవి చిన్న సమస్యలుగా కనిపించాయి. కాని రోహిత్‌ను చూసుకోవాల్సిన సమతను ఇవి టెన్షన్‌ పెట్టసాగాయి. గతంలో రోహిత్‌ సమతను ‘పిన్నీ’ అని పిలిచేవాడు. ఇప్పుడు ‘అమ్మా’ అని పిలవమంటే ఒక్కోసారి పిలుస్తున్నాడు. ఒక్కోసారి పిలవడం లేదు. తండ్రి దగ్గరకు వెళ్లి పడుకుంటాడు. సమతతో ‘నువ్వు వేరే గదిలో పడుకో’ అని హటం చేస్తాడు. చేసేది లేక ఆమె తన గదిలో పడుకుంటుంది. ముగ్గురూ ఒకే బెడ్‌ మీద పడుకోవడం రోహిత్‌కు ఇష్టం లేదు.

సమత ఎంతో ప్రేమ చూపడానికి దగ్గర కావడానికి ప్రయత్నించింది. కాని రోహిత్‌ కాలేదు. ఈలోపు సమతకు రెండుసార్లు అబార్షన్‌ అయ్యింది. దానివల్ల సుధీర్‌ ఆమె మీద ఇంకా కన్సర్న్‌ పెట్టి బాగా చూసుకుంటూ పరోక్షంగా రోహిత్‌ మనసులో ఆమె పట్ల దూరం పెంచాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ రోహిత్‌ దూరమయ్యాడు తప్ప చేరువకాలేదు. ఇంటర్‌ వయసుకు వచ్చేసరికి వాడు పూర్తిగా తల్లికి ఎదురు తిరగడం, లెక్కలేనట్టుగా వ్యవహరించడం, బాధించడం ఎక్కువ చేశాడు. సుధీర్‌ నిస్సహాయత వాణ్ణి ఇంకా రెచ్చిపోయేలా చేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో సుధీర్, రోహిత్‌ బాగానే ఉన్నారు. కాని సమత పూర్తిగా నలిగిపోయింది.
‘నేను చేసిన పాపం ఏమిటి? మంచికిపోతే చెడు ఎదురయ్యింది. నేనే నా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానా’ అనే భావంతో పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆమెలో వచ్చిన మార్పు వాళ్లిద్దరూ గమనించినా ఎలా పరిష్కరించాలో తెలియక కొనసాగనిచ్చారు. చివరకు సమత తండ్రి దీనికి ముగింపు పలకడానికి వాళ్ల ముగ్గురినీ హైదరాబాద్‌లో సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకు వచ్చాడు.

అంతా విన్న సైకియాట్రిస్ట్‌ ‘అయితే మొదట మాట్లాడిల్సింది మీతో కాదు. మీ అబ్బాయితో. మీకు సరైన మెడిసిన్‌ ఆ అబ్బాయే అని నాకు అర్థమవుతోంది’ అన్నాడు. బయట ఉన్న రోహిత్‌ను పిలిస్తే మొదట లోపలికి రావడానికి కూడా వాడు అంగీకరించలేదు. బతిమాలి ఒంటరిగా కూచోబెట్టి రోహిత్‌తో మాట్లాడాడు డాక్టర్‌. ‘చూడు రోహిత్‌. మీ అమ్మకు డబ్బు ఉంది. మీ నాన్నను పెళ్లి చేసుకునే సమయంలో ఆమె మంచి వయసులో ఉంది. ఎంతో మంచి సంబంధం చేసుకుని ఈసరికి ఏ అమెరికాలోనో ఉండేది. కాని నీ కోసం ఒంటరి అయిపోయిన తన అక్క కొడుకు కోసం తల్లిలా మారడానికి మీ ఇంటికి వచ్చింది. మీ నాన్న దానిని అర్థం చేసుకున్నాడు. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఆమె నీకు ఏం అపకారం చేసింది? ఎందుకు వేధిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు... ఆమె విడాకులు తీసుకుంటుంది. మీకు దూరంగా వెళ్లిపోతుంది. సరేనా?’ ఆ మాటకు రోహిత్‌ చటుక్కున తలెత్తి చూశాడు. నిర్లక్ష్యంగా ఉన్న కళ్లల్లో పశ్చాత్తాపం కనిపడింది.

‘లేదు డాక్టర్‌. నాకు మా పిన్నంటే ఇష్టమే. కాని నాకు ఎనిమిదేళ్లు వచ్చేవరకూ అడ్డు చెప్పేవారే లేరు. అమ్మ చనిపోవడంతో గారం పెంచేసి కొండ మీద కోతిని తెమ్మన్నా మా నాన్న తెచ్చిచ్చేవాడు. కాని పిన్ని వచ్చి నన్ను క్రమశిక్షణలో పెట్టబోయింది. అది నా మంచి కోసమే. కాని ఆమె నన్ను కంట్రోల్‌లో పెట్టడానికి వచ్చిన విలన్‌గా ఆ వయసులో నాకు అనిపించింది. అందుకే ఆమెను వ్యతిరేకించాను. అది అలాగే అలవాటైపోయింది. ఆమెకు సరండర్‌ కావడానికి ఇగో అడ్డుపడుతుంది. కాని అమ్మ పరిస్థితి చూసి నాకు నిజంగానే దుఃఖంగా ఉంది. నేను చాలా తప్పు చేశాను’ పదిహేడేళ్ల కుర్రావాడి మాటల్లో నిజాయితీ. మైక్‌ ఆన్‌ చేసి పక్క గదిలో ఉన్న సమతకు ఈ మాటలు వినిపించేలా చేయడంతో సమత పెద్దగా ఏడుస్తూ బయటకు వచ్చింది. ‘నాన్నా... రోహిత్‌’ అని కొడుకును అల్లుకుపోయింది. సమత ఎనిమిదేళ్ల పిల్లవాడికి తల్లి కావాలని వచ్చింది. కాని వాడికి పదిహేడేళ్లు వచ్చాకే నిజంగా తల్లి అయ్యింది. ఇక ఆమె జీవితానికి ఢోకా లేదు.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి,
సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు