నిత్యం తెరచి ఉండే హృదయాలయాలు

24 Mar, 2019 00:43 IST|Sakshi

విశేషం

అక్కడ ఉండేవి ఆలయాలే కాని నిత్యధూపదీప నైవేద్యాలు, పూజలు ఉండవు కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. వైవిధ్యభరితంగా కనిపించే ఆ ఆలయాలే మత్స్యకారులు కొలిచే దేవతల ఆలయాలు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం నిత్య ధూపదీపనైవేద్యాలు ఉండకపోయినా భద్రత ఉంటుంది. ఆలయాలకు తలుపులు, చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. వాటిలో విగ్రహాలకు ఖచ్చితమైన రూపురేఖలు ఉంటాయి కానీ ఇక్కడ అవేమి కనిపించవు. మత్స్యకారులు మనస్సులోనే అమ్మను తలచుకుంటూ ఆమెపై భారం వేసి జీవనోపాధికి వెళుతుంటారని చెబుతున్నారు. తీరప్రాంత గ్రామాలలో మాత్రమే కనిపించే ఈ ఆలయాలు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తమ తమ ఇష్టదైవాలైన అమ్మవార్లకు మొక్కుకుని వేటకు వెళుతుంటారు. దానికి అనువుగా నిర్మించుకున్న ఆలయాలు చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. 

వైవిధ్యభరిత ఉత్సవాలు
ఈ ఆలయాలని విచిత్రంగా కనిపిస్తాయి చిన్నచిన్న ఆలయాలుగా ఉండి ఒకే చోట రెండు నుంచి ఐదేసి ఆలయాలు వరుసగా నిర్మించి ఉంటాయి. ఆలయాలపై ఎటువంటి కళాకృతులు ఉండవు ముఖమండపాలు అసలే కనిపించవు. వాటిలో దేవతామూర్తుల ప్రతి రూపాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. కొన్ని విగ్రహాలు అమ్మవారి రూపాలతో ఉండగా కొన్ని విచిత్ర రూపాలలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివిధ ఆకృతులలో ఉన్న చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి.

తలుపులు ఎందుకు ఉండవంటే..!
ఏ ఆలయానికి ద్వారబందాలు తప్ప తలుపులు కానరావు. సాగరంలో జీవనపోరాటం చేస్తున్న తమకు ఎప్పుడు ఎదురుగా కనిపించే విధంగా ప్రతి ఆలయం సముద్రతీరానికి అతి దగ్గరలో సముద్రం వైపుకు ముఖం ఉండేలా (సముద్రంలోంచి చూస్తే అమ్మవారు కనిపించేలా) నిర్మించి ఉంటాయి. అమ్మవారు ఎప్పుడు తమకు అండగా ఉండాలని ఆలయాలకు తలుపులు వేయడంవల్ల ఆమెను బంధించినట్లుగా భావించే మత్స్యకార పూర్వీకులు ఈవిధంగా ఆలయాలకు తలుపులు వేసేవారు కాదని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. అర్ధరాత్రి వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు ఇతర సామగ్రితో చేతులు ఖాళీ లేకుండా వెళుతుండడం వల్ల తలుపులు తీయడం వీలు కుదరదు కాబట్టి అమ్మవార్లకు మొక్కుకునే విధంగా ఎప్పుడు అమ్మవార్లు ఎదురుగా కనిపించాలనే ఉద్ధేశ్యంతోనే తలుపులు ఏర్పాటు చేయరని, ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారమని మత్స్యకారులు చెబుతున్నారు. 

అమ్మవార్ల పేర్లు 
సాధారణంగా మత్స్యకారులు భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి వంటి పేర్లతో పిలుచుకుంటారు. ఇవే పేర్లు మత్స్యకారులు తమ పిల్లలకు పెడుతుంటారు. 

ఉత్సవాలూ వైవిధ్యభరితమే
సాధారణంగా గ్రామదేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒకసారైనా సాధారణ పూజలు చేస్తుంటారు. కానీ ఈ ఆలయాలలో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కఠినమైన నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారు. సముద్ర తీరంలో ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు రోజున వచ్చే ఫాల్గుణ బహుళ అమావాస్య అంటే కొత్త అమావాస్యరోజున ఈ అమ్మవార్లకు మత్స్యకారులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. 

– వెలుగుల సూర్య వెంకట సత్య వరప్రసాద్, సాక్షి, పిఠాపురం

మరిన్ని వార్తలు