పల్మనాలజీ కౌన్సెలింగ్‌

12 Nov, 2018 01:16 IST|Sakshi

గురకవస్తోంది... మర్నాడంతా మగతగా ఉంటోంది
నా వయసు 56 ఏళ్లు. రాత్రిళ్లు ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయినట్లు అనిపిస్తోంది. మళ్లీ నిద్రపట్టడం కష్టం అవుతోంది. పెద్దగా శబ్దం చేస్తూ గురక పెడుతున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏడెనిమిది గంటలు పడుకుంటున్నా. పగటి వేళ అలసటగా ఉంటోంది. ఇక్కడ డాక్టరుకు చూపిస్తే ïస్లిప్‌ ఆప్నియా అని కొన్ని టాబ్లెట్లు రాసిచ్చారు. ఇదేమి వ్యాధి? దీంతో ప్రమాదం ఏౖమైనా ఉంటుందా? గురక రాకుండా చేయలేమా? దయచేసి వివరంగా చెప్పండి. – ఆర్‌. ఆర్‌. రెడ్డి, కమలాపురం
స్లీప్‌ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. దీనివల్ల శరీరానికి అందే ఆక్సిజన్‌ పరిమాణం తగ్గిపోతుంది. ఇది కాస్తంత ప్రమాదకరమైన మెడికల్‌ కండిషన్‌ అనే చెప్పవచ్చు. దీన్ని ఎదుర్కొంటున్నవారు రాత్రంతా గురకపెట్టి నిద్రపోయినా... మర్నాడు వారికి చాలా మగతగా ఉంటుంది. నిజానికి స్లీప్‌ ఆప్నియా అన్నది ఒక లక్షణ సముదాయం. అంటే సిండ్రోమ్‌ అన్నమాట. నిద్రలేమి నుంచి శ్వాస పీల్చడం వరకు ఆప్నియాలో అనేక అంతరాయాలు ఏర్పడుతుంటాయి.

కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్‌ అందక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. రాత్రి నిద్ర సమయం పొడవునా ఇదే పరిస్థితి కొనసాగుతుంటుంది. ఫలితంగా ఒంటికి కావాల్సినంత ఆక్సిజన్‌ అందక, రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా  మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్‌లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో  ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్నియాలో సంభవించే ఒక ప్రమాదకరమైన లక్షణం.

కారణాలు
టాన్సిల్స్, సైనసైటిస్, రైనైటిస్‌ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరవై పగటిపూట కునికిపాట్లు పడుతుంటారు. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్‌ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్‌ అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా సిండ్రోమ్‌ అని కూడా అంటారు. గుండెజబ్బులు,, శరీరంలో కొలెస్ట్రాల్‌ వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గుండెజబ్బులు ఉన్నవారికి స్లీప్‌ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది.

పరిష్కారం / చికిత్స
ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్‌ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్‌ అందేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇక చికిత్స విషయానికి వస్తే స్లీప్‌ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్‌’ (కంటిన్యువస్‌ పాజిటివ్‌ ఎయిర్‌ ప్రెషర్‌) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది.

దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్‌ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్‌ డాక్టరుకు చూపించుకోండి.

నాకూ అదే శ్వాస సంబంధ సమస్య వస్తుందా?
నా వయసు 34 ఏళ్లు. గృహిణిని. మేము ఒక పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇటీవల నాకు తీవ్రంగా దగ్గు, ఆయాసం వస్తోంది. ఊపిరిపీల్చడంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాను. ‘ఇది సాధారణ సమస్యే కదా, అదే తగ్గుతుందిలే’ అని అంతగా పట్టించుకోలేదు. ఈ సమస్య తగ్గకపోగా... రోజురోజుకూ తీవ్రమవుతోంది. మా కాలనీలోనే ఒకరికి ఇలాంటి లక్షణాలే ఉంటే హాస్పిటల్‌లో చూపించుకున్నారు. తనకు ఆస్తమా ఉందని తేలింది. నాకూ అలాంటి సమస్య ఏమైనా ఉందా అని అనుమానంగా ఉంది. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – డి. రమాసుందరి, సనత్‌నగర్, హైదరాబాద్‌
మీరు పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే పొగలో అనేక రసాయనాలు ఉంటాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రసాయనాలతో కూడిన గాలి పీల్చినప్పుడు... కాలుష్యాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అలర్జీ, ఆస్తమా, సీఓపీడీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీకు కొంతకాలంగా దగ్గు, ఆయాసం తగ్గడం లేదని తెలిపారు కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగితే, శ్వాసకోశ సంబంధ వ్యాధులను ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు.

మీరు సాధ్యమైనంతవరకు మీ ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లో పచ్చటి చెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పచ్చదనంతో కాలుష్యప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దాంతో పాటు మీ ఇంటి పరిసరాల్లో దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేసేలా చూడండి. ఎందుకంటే పొగతాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి కూడా అది ప్రమాదమే. పరిశ్రమల పొగతో పాటు, సిగరెట్‌ కాల్చితే వచ్చే పొగ... ఈ రెండింటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక మీరు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించండి.


- డాక్టర్‌ జి. హరికిషన్, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, ఛాతీ – శ్వాసకోశ వ్యాధుల విభాగం, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు