డీజిల్‌ పొగలో పనిచేస్తుంటా... లంగ్స్‌ రక్షించుకునేదెలా?

29 Jul, 2019 10:20 IST|Sakshi

పల్మునాలజి కౌన్సెలింగ్‌

నేను నా వృత్తిరీత్యా రోజూ డీజిల్‌ పొగ వెలువడే ప్రదేశంలో ఉండాల్సి వస్తోంది. నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంది. దయచేసి లంగ్‌ క్యాన్సర్‌ నివారణ చెప్పండి.
– మహ్మద్‌ సుభానీ, ఒంగోలు

మీరు చెప్పినట్లుగా డీజిల్‌ వంటి ఇంధనాల నుంచి వెలువడే పొగ వల్ల ఊపిరితిత్తుల (లంగ్‌) క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువే. పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో మొదటిది ఊపిరితిత్తుల క్యాన్సర్‌. మహిళలో పాటు పురుషుల్లోనూ లెక్కచూస్తే ఇది నాలుగోది. పురుషుల్లో ఉండే పొగాకు వాడే అలవాటు, ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల వెలువడే పొగ, పట్టణప్రాంతాల్లోని కాలుష్యం వంటి అంశాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం.  ఇక ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే, వాళ్లతో పాటు ఆ పొగపీల్చేవారూ (ప్యాసివ్‌ స్మోకింగ్‌ చేసేవాళ్లూ) ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను టీబీ వ్యాధిగా నిర్ధారణ చేయడం (మిస్‌ డయాగ్నోజ్‌) వల్ల అది ముదిరిపోయే అవకాశాలూ ఎక్కువ. ఒకవేళ మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. లేకపోతే మీరు వృత్తిరీత్యా పీల్చే కాలుష్యానికి తోడు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని ఈ అలవాటు మరింత వేగవంతం చేయవచ్చు. ఇక మీరెలాగూ మీ వృత్తిరీత్యా డీజిల్‌ పొగకు ఎక్స్‌పోజ్‌ అయ్యే చోట ఉన్నారు కాబట్టి లంగ్‌ క్యాన్సర్‌ నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. మీకు వృత్తిపరంగా తీసుకునే జాగ్రత్తలలో భాగంగా రెస్పిరేటర్‌ వంటివి ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని తప్పనిసరిగా ధరించండి. ఇక అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఎన్‌–95 రేటింగ్‌ ఉన్న మాస్క్‌లను ముక్కుకు అడ్డుగా కట్టుకోండి. దీనివల్ల చాలావరకు డీజిల్‌ పొగతో పాటు, కాలుష్యప్రభాలనూ అధిగమించవచ్చుని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

పాపకు తరచూ జలుబు... లంగ్స్‌ దెబ్బతింటాయా?
మా పాపకు తొమ్మిదేళ్లు. తనకు తరచూ జలుబు చేస్తుంటుంది. మందులు వాడితే తగ్గుతుంది. కానీ ఇంచుమించు నెలకొకటి రెండుసార్లు జలుబు బారిన పడి, చాలా బాధపడుతోంది. మాకు భయంగా ఉంటోంది. భవిష్యత్తులో ఆస్తమా వస్తుందా? లంగ్‌ పని తీరు మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? దయచేసి తెలియజేయండి.– శ్రీలత, రామచంద్రాపురం
చిన్నపిల్లల్లో జలుబు సాధారణమే. కానీ, అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే లక్షణాలకు కాకుండా, వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ... ఆస్తమాకి మారే అవకాశం ఉండదు. సాధారణంగా జలుబు 3–4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పదిరోజులైనా తగ్గదు. ఇది గుర్తుంచుకోండి. ముక్కు నుంచి పసుపు లేదా ఆకుపచ్చ స్రావం కారుతుంటే ఇన్ఫెక్షన్‌ వల్ల అది వచ్చినట్లు భావించాలి. అలాకాకుండా తెల్లగా వస్తుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలర్జీ వల్ల తుమ్ములు, పొడిదగ్గు, గొంతునొప్పి సైతం ఉంటాయి. మీరు చెప్పిన అంశాలను  బట్టి మీ పాపవి అలర్జీ లక్షణాలే అనిపిస్తున్నాయి. దీనితో పాటు కళ్ల నుంచి నీరు, ముక్కు మూసుకుపోయినట్లుంటే అది అలర్జిక్‌ రైనైటిస్‌ తాలూకు లక్షణంగా పరిగణించాలి.

మీలాగే చాలామంది జలుబు చేయగానే పిల్లలను డాక్టర్‌ దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తారు. దాని వల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ తరచూ జలుబు చేస్తుంటే అది ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ అని అర్థం చేసుకోవాలి. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకుంటూ పోతే లోపల వ్యాధి పెరిగిపోతుంది. అలా కాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఆలస్యం చేయవద్దు. అలా చేస్తే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఇలాంటి సమయల్లో డాక్టర్‌ పర్యవేక్షణ లేకుండానే చాలామంది విచ్చలవిడిగా  యాంటీబయాటిక్స్‌ వాడటం, నెబ్యులైజర్‌ పెట్టించడం చేస్తున్నారు. మీరు మీ పాపను వెంటనే మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించండి.

సిగరెట్‌ అలవాటు ఉంది... ఆయాసం వస్తోంది
నా వయసు 43 ఏళ్లు. చాలా తీవ్రమైన ఒత్తిడి ఉండే ఉద్యోగంలో ఉన్నాను.  చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్‌ వల్ల సిగరెట్‌ కాల్చడం అలవాటైంది. దాదాపు 25 ఏళ్లుగా సిగరెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు కూడా ఒత్తిడి తగ్గడం కోసం రోజూ రెండు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు తాగుతుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.– డి. భగవాన్, భీమవరం
సిగరెట్లు కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్నీ పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాలుస్తున్నట్లు చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ప్రభావం తప్పక చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్‌ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే అది మీ ఆరోగ్యానికి అంత మంచిది. -డాక్టర్‌ సి. యుగంధర్‌ భట్టు,సీనియర్‌ పల్మునాలజిస్ట్,యశోద çహాస్పిటల్స్,మలక్‌పేట్, హైదరాబాద్‌

>
మరిన్ని వార్తలు