తియ్య గుమ్మడి తిని తీరాలి

23 Nov, 2019 04:38 IST|Sakshi

ఆయుర్వేదం

సనాతన భారతీయ వైద్యమైన ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, పువ్వులు, మూలికల పోషక విలువలు, ఔషధ గుణాల గురించి ప్రాచీన ఆచార్యులు వివరించారు. పచ్చి మిరప, టొమాటో వంటి కొన్ని ద్రవ్యాలు మాత్రం మన దేశపు పురాతన పంటలలోకి రావు. అవి విదేశాల నుండి మనకు సంక్రమించినవే. ‘తియ్య గుమ్మడి’ కూడా అలాంటిదే. దక్షిణ అమెరికా దీనికి కాణాచి. మన దేశానికి ఇది అక్కడి నుంచి వలస వచ్చినదే. బూడిద గుమ్మడి (కూష్మాండ), కర్బూజ (కూష్మాండీ), త్రపుస (దోస) మొదలైనవి మన దేశపు వారసత్వ శాకఫలాలే. అయితే ‘కూష్మాండీ’ ని తియ్య గుమ్మడి జాతి భేదంగా పరిగణించారు మన ప్రాచీన శాస్త్రజ్ఞులు.

కూష్మాండీ: దీనికే ‘కర్కారు’ అనే పేరుంది. వృక్షశాస్త్రంలో దీని పేరు ‘కుకుర్బిటా మేక్జిమా’, ‘పెపా’. ఇది దేహాన్ని చల్లబరచి (శీతలం) రక్త స్రావాలని అరికడుతుంది (రక్తపిత్తహరం). బాగా పండినదైతే కొంచెం ఉప్పగా, చిరు చేదుగా ఉంటుంది. పుష్టికరం. ఆకలి కలిగిస్తుంది (అగ్నిదీపకం). కఫవాత రోగాల్ని తగ్గిస్తుంది.

భావప్రకాశ: ‘‘కూష్మాండీ... కర్కారుః... శీతా రక్తపిత్తహరా, గురుః , పక్వా తిక్తాగ్ని జననీ సక్షారా కఫవాతనుత్‌’’
తియ్య గుమ్మడి: ఇది శీతాకాలంలో అధికంగా లభిస్తుంది. దీనిని కాయగానూ, పండుగానూ కూడా పిలుస్తుంటారు. భారతీయ వివాహాలలో దీనికి మంగళప్రదమైన స్థానం ఉంది. మన నిత్య వంటకాలలో దీనిని కూరగా వండుతుంటారు (నువ్వుల పొడి కూర, మెంతి పొడి కూర మొదలైనవి). పులుసులో ముక్కలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పండులోని గింజలను... పై పొరను తొలగించి తినటం ఆనవాయితీ. కృశించినవారికి బలకరం. ఎక్కువగా బరువున్న వారికి (స్థూలురకు) కొవ్వు కరిగించి బరువు తగ్గిస్తుంది.

ఆధునిక శాస్త్ర విశ్లేషణ: 100 గ్రాముల తియ్య గుమ్మడిలో 7 గ్రా. పిండిపదార్థాలూ, 1 గ్రా. ప్రొటీన్లూ, 0.1 గ్రా. కొవ్వులూ ఉంటాయి. 26 కేలరీలు ఉంటాయి. సోడియం, కొలెస్టరాల్‌ చాలా నామమాత్రంగా ఉంటాయి. ‘విటమిన్‌ – ఎ’ (170 శాతం), విటమిన్‌ సి (15 శాతం), బి – 6 (5 శాతం), క్యాల్షియం (20 శాతం), ఐరన్‌ (4 శాతం) మెగ్నీషియం (3 శాతం) లభిస్తాయి. కాపర్, మెగ్నీషియం కూడా కొద్దిగా లభిస్తాయి. విటమిన్‌ – ఇ, ఫోలేట్స్, ఒమేగా – 3 ఫాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. స్టార్చ్‌ అధికం. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం.

ప్రయోజనాలు: వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. కంటి ఆరోగ్యానికి, చర్మ కాంతికి, గుండె బలానికి దోహదకారి. అధిక బరువుని తగ్గించటానికి ఉపయోగకరం. కాన్సరు వంటి క్లిష్టమైన వ్యాధులను నివారించటానికి, వ్యాధి తీవ్రతను తగ్గించటానికి ఉపకరిస్తుంది. ఇది ఎంత తిన్నా మంచిదే. నూటికొక్కరికి సరిపడక ఎలర్జీలు కలిగించవచ్చు. అలాంటివారు దీనిని తినకూడదు గాని, దీనిని ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యకరం. దీనిని పండ్లు తినే రీతిలో పచ్చిగా తినరు. వండుకుని కూరగాను, పులుసులో ముక్కలుగా (ఉడికించి) ను సేవించాలి.

చిన్న మాట
నిమ్మచెక్కతో చాలా వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. కూరలు తరిగిన ప్లాస్టిక్‌ బోర్డు మీద అలాగే డైనింగ్‌ టేబుల్‌ మీద నిమ్మ చెక్కతో రుద్ది, పదిహేను నిమిషాల తరవాత కడిగితే మురికితో పాటు క్రిములు కూడా మటుమాయం అవుతాయి.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌
 

మరిన్ని వార్తలు