సరిగమల శిల్ప సంపద!

14 Jun, 2016 23:51 IST|Sakshi
సరిగమల శిల్ప సంపద!

పుణ్యతీర్థం

 

రాజుల కాలం పోయింది. రాజ్యాలు అంతరించాయి. అప్పట్లో కాకతీయులు నిర్మించిన కట్టడాలు, ఆలయాలు అప్పటి కళావైభవం, భక్తి భావానికి ప్రతీకగా... చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శివుని మీద ఉన్న అపారమైన భక్తితో కాకతీయులు రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. వరంగల్ జిల్లాలో నిర్మించిన కాకతీయ కట్టడాలన్నింటిలోనూ రుద్రేశ్వరుడిని ప్రతిష్టించి దైవభక్తి, ప్రత్యేకతను చాటారు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. 40 ఏళ్ల పాటు ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి నామకరణం చేయడం కాకతీయుల గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక పద్ధతులతో ఇక్కడ పూజలు జరుగుతాయి.  ప్రపంచ వారసత్వ సంపదగా పిలువబడుతున్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించినట్లయితే భవిష్యత్ తరాలకు వరంగా మారనుంది.

 

803 ఏళ్ల కట్టడం
రామప్ప దేవాలయం నిర్మించి 803 ఏళ్లు దాటినా ఆలయ శిల్పాలు చెక్కు చెదరలేదు. ఆలయం నిర్మించిన 1213 నుండి 1323 వరకు ఇక్కడ నిత్య పూజలు జరిగాయి. కాకతీయ సామ్రాజ్యం ఆనంతరం 1910 వరకు ఆలయంలో ఎలాంటి పూజలు జరగలేదు. 1911లో నిజాం ప్రభుత్వం రామప్ప ఆలయాన్ని గుర్తించి స్వల్ప మరమ్మతులు చేపట్టి ఆలయాన్ని వినియోగంలోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఏటా రామప్పలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, అగ్నిగుండాలలో నడిచే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

 


విద్యుత్తు లేకుండా వెలుగు
ఆలయ గోపురాన్ని నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. గోపురం ఇటుకలను తీసి నీళ్లలో వేస్తే అవి తేలుతాయి. ఇలా మరెక్కడా జరగదు. రామప్ప రామలింగేశ్వరునికి మరో ప్రత్యేకత ఉంది. ఏ ఆలయంలో అయినా గర్బగుడిలో వెలుతురు ఉండదు. అన్ని చోట్ల విద్యుత్ బల్బులు ఏర్పాటు చేస్తారు. రామప్ప ఆలయంలో మాత్రం సూర్యోదయం నుండి సుర్యాస్తమయం వరకు గర్భగుడిలోని రామలింగేశ్వరుడు కాంతివంతంగానే దర్శనమిస్తాడు. ఆలయంలో ఎర్పాటు చేసిన మంటపం స్థంభాలపై పడే సూర్యకాంతి పరావర్తనం(రిఫ్లెక్ట్) చెంది గర్భగుడిలోని శివలింగం కాంతివంతంగా దర్శనమిస్తుంది. పూజలకు సంబంధించీ ఇక్కడ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఆలయంలో మధ్యాహ్నం వరకే పూజలు నిర్వహిస్తారు. రామప్ప ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. ‘ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు, ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అర్చన పూజలు నిర్వహిస్తాం’ అని ఆలయ పూజారులు కోమల్లపల్లి హరీష్‌శర్మ, ఉమాశంకర్ లు వివరించారు.

 

శిల్పకళా అందాలు రామప్పకే సొంతం
రామప్ప ఆలయం శిల్ప కళాసంపదకు ప్రసిద్ధి. శిల్పాలను నిశితంగా పరీశీలిస్తే... ద్వాపర, త్రేతాయుగాల చరిత్ర, జైన, బౌద్ధ మతాల అంశాలు, ఈజిప్టు మమ్మీలు, వాస్తు, జ్యోతిష్యం, నాట్యం, నీతి, శంగారం, లౌకితత్వం, చరిత్ర, హేతువాదం, క్రీడలు, అధునిక సైన్స్ పరిజ్ఞానం శిల్పాల్లో కనిపిస్తుంది. ఆలయంలో తూర్పు ముఖద్వారం వైపు గణపతి విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. ఆలయంలోని స్థంభానికి దిష్టిచుక్క పెట్టారు. ఈ అంశాలను పరిశీలిస్తే కాకతీయులు ఆ కాలంలోనే వాస్తును బాగా నమ్మినట్టు తెలుస్తోంది. గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సంగీత(సరిగమపదనిస) స్వరాలు వినిపిస్తాయి.

 

తేలియాడే ఇటుకలు
గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు  40 ఏళ్ల పాటు ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి నామకరణం చేశారు  గోపురం ఇటుకలను తీసి నీళ్లలో వేస్తే తేలి ఉంటాయి  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు  గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సంగీత స్వరాలు వినిపిస్తాయి.

 

ఇలా చేరుకోవచ్చు..
వరంగల్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో రామప్ప దేవాలయం ఉంది. హైదారాబాద్ నుండి వచ్చే పర్యాటకులు హన్మకొండకు చేరుకుని అక్కడి నుండి ములుగుకు చేరుకోవాలి. ములుగు నుంచి ప్రైవేటు వాహనాలల్లో రామప్ప గుడికి వెళ్లవచ్చు. ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్ నుంచి వచ్చే పర్యాటకులు భూపాలపల్లి, గణపురం క్రాస్‌కు చేరుకోవాలి. అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. ఖమ్మం, భద్రాచలం మీదుగా వచ్చే వారు జంగాలపల్లి క్రాస్‌రోడ్‌కు చేరుకొని, అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. రామప్పను సందర్శించే పర్యాటకుల, భక్తుల సౌకర్యార్థం టూరిజం శాఖ వారు రామప్ప సరస్సు కట్టపై కాటేజీలు నిర్మించారు. పర్యాటకులు విడిది చేసేందుకు హరిత హోటల్ అందుబాటులో ఉంది.

 

మరిన్ని వార్తలు