తెలుగునాథుడు

28 Jun, 2016 22:51 IST|Sakshi
తెలుగునాథుడు

పుణ్య తీర్థం



జగన్నాథుడిని దర్శించుకోవడానికి పూరి వెళ్లనక్కరలేదు, తెలుగు గడ్డపై రెండు రాష్ట్రాల్లోనూ జగన్నాథ ఆలయాలున్నాయి.  జగమంతనిండిన జగన్నాథుడు. మన తెలుగునాథుడు. జనసమ్మోహనుడు. అందుకే, ఆయనకు జనార్ధనుడన్న పేరు. భక్తజనులతో కలిసి మెలసి ఉండటం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

 
కృష్ణుడి బాల్యం, యవ్వనం... జనసమూహంతోనే కలిసి కనిపిస్తుంది. తన భక్తులను వెతుక్కుంటూ రథయాత్ర చేసే జగన్నాథుడ్ని ఒడిశా రాష్ట్రంలోని పూరిలోనే చూస్తాం. ఆ రథయాత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని కన్నులారా దర్శించాలనుకునేవారికి మన తెలుగు రాష్ట్రాల్లో వెలుగొందుతున్న జగన్నాథుడి ఆలయాలు ఇవి.

 

సిరిపురంలో పూరి
విశాఖ నగరం సిరిపురంలో కొలువై ఉన్న సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు భక్తులచేత విశేష పూజలందుకుంటున్నాడు. ఒడిశా పూరిలోని జగన్నాథునికి మాదిరిగానే ఇక్కడా రథోత్సవం, పూజలు, సంప్రదాయాలూ జరుగుతాయి. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒడిశా ఉత్కళ్ సాంస్కృతిక సమాజ్ సభ్యులు సమావేశం కావడం కోసం వచ్చిన ఆలోచన జగన్నాథుని ఆలయానికి అంకురార్పణకు దారితీసింది. అప్పట్లో విశాఖలో ఉంటున్న ఒరియా వారి అభ్యర్థన మేరకు దస్‌పల్లా రాజు ప్రమోద్‌కుమార్ దేవ్‌భంజ్ సిరిపురం (ఆకాశవాణి) వద్ద స్థలం ఇచ్చారు. దీంతో ఇక్కడే తమ ఇలవేల్పయిన జగన్నాథుని ఆలయం కట్టారు. పూరి మహారాజు గజపతి దివ్యసింగ్, దస్‌పల్లా మహారాజు దేవ్‌భంజ్‌లు ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చిన్నది కావడం, ఆదరణ పెరగడం వంటి కారణాలతో ఆ పక్కనే జగన్నాథునికి మరో పెద్ద ఆలయం నిర్మించారు. చిన్న గుడిలోని స్వాములను పెద్ద గుడికి తరలించారు. దీంతో ఇప్పుడక్కడ మరెక్కడా లేనివిధంగా ఇద్దరు స్వాములున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో జగన్నాథునితో పాటు లక్ష్మీగణపతి, కమల, విమల శక్తిమాతల గుడులు (పూరిలో మాదిరిగానే) కాశీ విశ్వేశ్వరుని ఆలయాలు కట్టారు.

 

పూరి తరహాలోనే పూజలు
ఏటా రథోత్సవానికి ముందు జరిగే అన్ని సంప్రదాయాలనూ ఇక్కడ పాటిస్తారు. ఆశ్చర్యం గొలిపే ఈ ఆచారాలను నిష్టగా అమలు చేస్తారు. జ్యేష్ట పౌర్ణమినాడు (స్నాన పౌర్ణమి) అద్దంలో చూస్తూ జగన్నాథుడికి పంచామృతాలతో స్నానం చేయిస్తారు. దీంతో స్వామికి జలుబు చేసి జ్వరం వస్తుంది. దీంతో స్వామికి తెల్లని పంచెతో ముసుగేస్తారు. ఈ సమయంలో స్వామి భక్తులకు దర్శనం ఇవ్వరు. జ్వరంతో ఉన్న స్వామికి పథ్యంగా శొంఠి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలను పొడి చేసి, తేనెలో కలిపి నైవేద్యంగా పెడతారు. ఇలా నాలుగైదు రోజుల పాటు నివేదించాక జ్వరం తగ్గుముఖం పట్టాక పండ్లు ఆహారంగా ఇస్తారు. ఇలా 15 రోజులకు జలుబు, జ్వరం త గ్గాక స్వామికి వేసిన ముసుగును తొలగిస్తారు. ఈ పక్షం రోజులూ స్వామి అనారోగ్యంగా ఉన్నారని భావించి గంట కూడా మోగించరు. 15 రోజుల తర్వాత స్వామికి రథోత్సవం నిర్వహిస్తారు. ఆలయం నుంచి ఊరేగింపుగా స్వాములను తీసుకెళ్లే ముందు బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేస్తారు. పూరిలో రాజవంశీయులు, ఇక్కడ దస్‌పల్లా రాజవంశీయులతో ఈ ప్రక్రియ చేపడ్తారు. అనంతరం రథాన్ని ఊరేగింపుగా బీచ్‌రోడ్డు అప్పుఘర్ వద్ద ఉన్న గుండిచా మందిరానికి తీసుకెళ్తారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు పూజలు చేశాక ఏకాదశినాడు తిరిగి ఆలయానికి ఊరేగిస్తూ రథంపై తీసుకొస్తారు. ఈ రథయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగుతారు. ఈ ఏడాది రథోత్సవాన్ని జూలై 6న నిర్వహిస్తున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

ఆలయానికి ఇలా వెళ్లాలి
విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న సిరిపురంలో జగన్నాథుని ఆలయం ఉంది. విశాఖ రావడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. విమానాశ్రయం నుంచి 15, రైల్వేస్టేషన్‌కు 3, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం

 

శతాబ్దాల చరిత..!
ప్రశాంతంగా సాగే పంచక్రోశ ఉత్తర వాహినియైన గోదావరి నది తీరాన అగస్త్య మహా ముని తపస్సుతో తరించిన తరులు, గిరుల చెంతన రెండవ పూరీగా అలరారుతున్న దక్షిణాది జగన్నాథ స్వామి భక్తుల కొంగుబంగారమై అలరారుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలో గల ఈ జగన్నాథుడిని కోరి కొలుచుకునేవారికి కొంగు బంగారమే అవుతుందని భక్తుల నమ్మకం. పట్టణ ప్రజలే కాకుండా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్.. పట్టణాల నుంచి భక్తులు తరలి వస్తారు. నాలుగు శతాబ్దాల నుంచి వంశ పారంపర్యంగా అర్చకులు మోహనాచార్యుల కుటుంబ సభ్యులు ఇక్కడ త్రికాల పూజలు నిర్వహిస్తారు.

 
పూరి ఆలయంలో ఉన్నట్టే!

ఆలయంలో జగన్నాథస్వామి మూల విగ్రహాలతో పాటు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇందులో జగన్నాథ స్వామి సుభద్ర, బలరాముడితో కలిసి పూజలు అందుకుంటున్నాడు. అలాగే, వెంకటేశ్వరుడు, అలివేలుమంగ, పద్మావతి విగ్రహాలతో పాటు అల్‌వాల్, ఆండాల్ విగ్రహాలూ ఈ ఆలయంలో ఉన్నాయి. పూరిలో జరిగే స్వామి రథయాత్ర సందర్భంగా చెన్నూర్ లో అర్చనలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు అంగరంగవైభవంగా జరుగుతాయి.

 
వెయ్యి స్తంభాల గుడిలా...!

నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నిర్మాణం వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిని పోలి ఉండటం విశేషం. రాతిస్తంభాలతో నాటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగు వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఆ ప్రాంత సంస్థానాధీశుడికి జగన్నాథస్వామి స్వప్నంలో కన్పించి ఆగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతంలో తనకు పూజలు నిర్వహించాలని కోరారట. ఆ రాజు ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణానికి వెళ్లి.. జగన్నాథ స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని, అనంతరం కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు. 

 
పంచకోసుల పుణ్యం!

మంచిర్యాల పట్టణంలో నుంచి చెన్నూర్ 40 కిలోమీటర్ల దూరం. ఆలయం ఎదుట అభినవ పోతన బిరుందాంకితులు వానమామలై వరదాచార్యుల విగ్రహం ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా పట్టణ సమీపంలో గల పంచక్రోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో స్నానాలు అచరించి మొక్కులు తీర్చుకుంటారు. పంచ కోసులు ఉత్తర దిశగా గోదావరి నది ప్రవహించడంతో దక్షణ భారతదేశంలో మొట్ట మొదటిదని ఈ నదికి కాశీ అంతటి ప్రాశస్త్యం ఉందని వేదపండితులు పేర్కొంటారు. ఆలయం నుంచి గోదావరి నది రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.

 
రాష్ట్రంలోనే మొట్టమొదటిది

పూరీ తర్వాత జగన్నాథాలయం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదిగా పేరొందింది. అయితే, ఈ ఆలయ చరిత్ర ఆధారాలు నేటికీ లభించడంలేదు. ఆలయం నిర్మాణం కాకతీయుల కాలంలో జరిగినట్టుగా మాత్రమే తెలుస్తోంది.   - అట్టెమ్ మధునయ్య చెన్నూర్, ఆదిలాబాద్

 

వడలి జగన్నాథుడు
పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోలేని వాళ్లు.. వడలి జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలోని ‘వడలి’లో 200 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ దేవాలయం పూరి జగన్నాథస్వామి ఆలయానికి నమూనాలా కనిపిస్తుంది. గర్భాలయంలోని మూలవిరాట్టులను సైతం పూరి నుంచి తీసుకువచ్చి ప్రతిష్టించడం విశేషం. ఈ దేవాలయం ఇక్కడ నిర్మించడానికి దారితీసిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా క ర్లపాలేనికి చెందిన పురుషోత్తమానంద అనే అవ ధూతకి ఓనాడు రాత్రి జగన్నాథస్వామి కలలో కనిపించి, తన ఆలయాన్ని నిర్మించవలసిందిగా చెప్పాడు. దాంతో ఆయన అందుకు అనుకూలంగా ఉండే స్థలాన్ని అన్వేషిస్తూ ప్రయాణించడం మొదలుపెట్టాడు. వడలి ప్రాంతానికి చేరుకున్నాక స్వామి కొలువుదీరి ఉండటానికి అదే అనువైన స్థలమని భావించాడు. వాకబు చేయగా ఆ ప్రాంతం నవాబుదని తెలుసుకున్నాడు. ఈ విషయం గురించి మాట్లాడటానికి  ఆయన విజయవాడ వద్ద కృష్ణానదిలో మునిగి, నిజాంనవాబు అంతఃపురంలో ప్రత్యక్షమయ్యాడట. విషయం తెలుసుకున్న నవాబు సంభ్రమాశ్చర్యాలకు లోనై.. వడలిలో సూర్యోదయం నుంచి అస్తమయం వరకు ఎంత దూరం తిరిగితే అంత భూమి ఆలయ నిర్మాణానికి ఇస్తానని ఆ అవధూతకి చెప్పాడట. ఆ అవధూత ఆ సమయంలో 1200 ఎకరాల మేర తిరిగి ఆ స్థలం దేవాలయానికి దక్కేలా చేశాడట. 1765వ సంవత్సరంలో ఒక వైష్ణవ భక్తుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అరణ్యంలా ఉండేదని, బోయలు ఎక్కువ ఉండే ఈ ప్రదేశాన్ని పూర్వం ‘వ్యాధాళి’ అనేవారట. అది కాలక్రమేణా వడాలిగా రూపాంతరం చెందింది అని చెబుతారు. నాటి నుంచి నేటి వరకు ఆలయం దిన దిన ప్రవర్ధమానమవుతూ దక్షిణ పూరీగా భక్తులతో విశేష పూజలందుకుంటోంది. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే కార్యక్రమాలతో పాటు శ్రీ కృష్ణాష్టమి నాడు ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.

 
గుడివాడ-బంటుమిల్లి ప్రధాన రహదారికి సమీపంలో గల ఈ పుణ్య క్షేత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి 60 కి.మీ దూరం, గుడివాడ రైల్వే స్టేషన్‌కి 15 కి.మీ దూరంలో ఉంది.

 

సుందర మనోహరుడు
ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు పూరి జగన్నాథ మందిరాన్ని దర్శించిన అనుభూతే కలుగుతుంది. అచ్చు పూరి ఆలయానికి నమూనాగా ఉండే ఈ దేవాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉంది. ఆలయం మొత్తం ఎర్రని రంగులో, ఒడిస్సీ శిల్పకళా చాతర్యంతో అలరారుతుంటుంది. ఎటువైపు చూసినా అబ్బురపరిచే శిఖర భాగం 70 అడుగుల ఎత్తుతో ఆధ్యాత్మికకు అసలు సిసలైన అద్దం పడుతుంది. పరిసరాలు ఎంతో ప్రశాంతంగా, మరెంతో రమణీయంగా ఉండే ఈ ఆలయాన్ని ఒరియా కమ్యూనిటీ వారు 2009లో నిర్మింపజేశారు. అత్యంత సుందర మనోహరంగా కనిపించే ఈ దేవాలయంలో పూరిలో మాదిరిగానే జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో మూల విరాట్టుగా కొలువుదీరి ఉన్నాడు. పూరీలో మాదిరిగానే ఈ ఆలయంలోనూ జగన్నాథుడికి నిత్య పూజలు జరుపుతారు. అలాగే పూరిలో జరిగినట్టు జేష్ట్య, ఆషాఢమాసంలో జరిగే ప్రత్యేక సేవలన్నీ జరుపుతున్నారు. భక్తులు ఈ సేవలలో పాల్గొని ఆనందపారవశ్యం చెందుతారు. రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణజన్మాష్టమి, వసంతపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జగన్నాథుడితో పాటు లక్ష్మి, శివ, గణేష, హనుమాన్, నవగ్రహ మూర్తులను దర్శించుకోవచ్చు. నగర సందర్శనలో భాగంగా పూరి ఆలయం దర్శనం కూడా ఒకటిగా ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.

 

ఏడాదిలో ఒక్కరోజే..!
శ్రీ జగన్నాథ స్వామి తూర్పు గోదావరి జిల్లాలోని దేవి చౌక్‌లో బలభద్ర, సుభద్ర సమేతుడై కొలువుదీరి ఉన్నాడు. అతి ప్రాచీన ఆలయంగా పేరొందిన ఈ మందిరాన్ని దేశంలోనే 2వ పూరిగా జగన్నాథుడిని భక్తులు కొలుస్తుంటారు. దీప, ధూప, నైవేద్యాలతో స్వామి వారికి నిత్యం పూజలు జరుపుతారు. అయితే, కేవలం తొలి ఏకాదశి రోజున మాత్రమే ఈ దేవాలయాన్ని భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంచుతారు. ఈ సందర్భంగా అత్యంత వేడుకగా జరిగే స్వామి వారి పూజలను కనులారా వీక్షించాల్సిందే తప్ప వర్ణించనలవి కాదంటారు భక్తులు. దేదీప్యమానంగా వెలుగొందే జగన్నాథుడు భక్తులకు అభయమిస్తూ విశేషంగా ఆకట్టుకుంటాడు. మిగతా అన్నిరోజులు పూజారులకు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. 200 ఏళ్లుగా ఇక్కడ స్వామి విశేష పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయాన్ని వైష్ణవభక్తులు నిర్మించారని కథనాలు ఉన్నాయి. రాజమండ్రి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది జగన్నాథ స్వామి దేవాలయం. సమీప బస్ స్టేషన్ రాజమండ్రి. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

 

 

మరిన్ని వార్తలు