మోదీ సంకల్పం కోసం పురాణపండ

8 Apr, 2020 10:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహామ్మారి కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురుచేస్తోంది. ఈ అంతుచిక్కని వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో భారత్‌తో పాటు అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ భయంకర వైరస్‌ బారి నుంచి రక్షించమని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ సంకల్పానికి మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి సమర్పణలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు సుధీష్‌ రాంభట్ల, ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు ఒక అద్భుతమైన దైవీయ గ్రంథాన్ని ప్రచురించనున్నారు. 

దేశరాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ప్రతులు ఉచితంగా పంపిణీ చేసుందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అయితే ఆది శంకరాచార్య ప్రణీతమైన మహాశక్తి సంపన్న స్తోత్రమ్‌ ‘శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్‌’ ప్రచురించే మహత్కార్యాన్ని తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈయన రచించిన మహాగ్రంథం ‘నన్నేలు నాస్వామి’ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పురాణపండపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ప్రముఖ ఆధ్యాత్మిక  సంస్థ ' జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం '  సమర్పణలో  పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వెలువరించిన ఎన్నో సమ్మోహన గ్రంధాలకు భారీ డిమాండ్ వున్న  విషయం అందరికీ తెలిసిందే. భారత దేశంలో ప్రముఖమైన పదహారు నృసింహ క్షేత్రాల మూలవిరాట్టుల మనోహర మంగళ దృశ్యాలతో,  అందమైన వ్యాఖ్యాన వైఖరితో పరమ శోభాయమానంగా ఈ  గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ ప్రస్తుతం తీర్చిదిద్దుతున్నారు. శంకర జయంతి సందర్భంగా ఈ నెల 28 వ తేదీన విడుదల చేస్తున్న ఈ పుస్తకాన్ని బీజేపీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తారు.

మరిన్ని వార్తలు