వ్యాసం మీద వ్యాసం

25 May, 2020 00:30 IST|Sakshi
పురిపండా అప్పలస్వామి 

రీవిజిట్‌

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1969లో ప్రచురించిన సారస్వత వ్యాసముల (రెండవ సంపుటము)కు పరిష్కర్తగా వ్యవహరించిన పురిపండా అప్పలస్వామి, ‘వ్యాసం అంటే’ పేరుతో ఒక పీఠిక రాశారు. అందులో తెలుగులో తొలి వ్యాస రచయితగా సామినేని ముద్దు నరసింహం నాయన్ని పేర్కొనడం సహా, వ్యాస చరిత్రను వివరించారు. అందులోంచి కొంత భాగం:

పదహారో శతాబ్దానికి ముందు సాహిత్య ప్రక్రియకు Essay అన్న పేరు లేదు. 1571లో ఫ్రెంచి రచయిత మాన్‌టైన్‌ తన గద్య రచనలకు ఎస్సేస్‌ అని ఓం ప్రథమంగా నామకరణం చేశాడు. అదిగో ఆ పేరే తీసుకుని సుప్రసిద్ధుడై ఆంగ్ల రచయిత ఫ్రాన్సిస్‌ బేకన్‌ ఇంగ్లిష్‌ వాఙ్మయంలో ఎస్సేకు నాంది పలికాడు. దానికి మరింత అందచందాలు కూర్చి కౌలే ‘ఫాదర్‌ ఆఫ్‌ ది ఇంగ్లిష్‌ ఎస్సే’ అనిపించుకున్నాడు. మైసెల్ఫ్‌ అన్న ఇతడి వ్యాససంపుటి ప్రసిద్ధమైంది.

ఇంగ్లిష్‌ ఎస్సే అన్ని విధాలా అభివృద్ధి పొందడానికి ముఖ్య కారణం పత్రికలు. పత్రికలకి వ్యాసాలూ, వ్యాసాలకి పత్రికలూ పరస్పరం దోహదం కలిగించాయి. పద్దెనిమిదో శతాబ్ది ఆరంభంలో స్టీల్, అడిసన్‌ అని ఇద్దరు స్నేహితులు టాట్లర్, స్పెక్టేటర్‌ అన్న పత్రికలు స్థాపించి చమత్కారపూర్వకమైన చక్కని వ్యాసాలు సృష్టించారు. ఈ పత్రికలు స్వల్పకాలమే నడిచినా విలక్షణమైన వీటి వ్యాసాల ప్రభావం వల్ల ఆంగ్లసాహిత్య చరిత్రలో ప్రతిష్ట సంపాదించుకున్నాయి. స్పెక్టేటరులోని వ్యాసాలే పానుగంటి వారి సాక్షికి ఒరవడి అయినాయి.

అనంతరం జాన్సన్, గోల్డుస్మిత్, లాంబ్, వంటి సుప్రసిద్ధ రచయితలు తమ వ్యాసాలతో ఆంగ్లవ్యాస వాఙ్మయాన్ని ఎంతయినా పరిపుష్టం చేశారు. జాన్సన్‌ ధార్మిక వ్యాసాలు రాశాడు. ది రాంబ్లర్, ది బడ్లర్‌ వ్యాసాలు గొప్పవి. గోల్డు స్మిత్‌ తన సిటిజన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ వ్యాసాలలో సరసమైన చమత్కారంతో ఆనాటి సమాజంలోని మంచి చెడ్డలు ఎత్తి చూపాడు. లాంబ్‌ వ్యాసాలు అధికంగా ఆత్మాశ్రయమైనవి. అతడి వ్యాస సంపుటి Essay of Elia వ్యాస వాఙ్మయంలో అతి ప్రసిద్ధమైంది. లాంబ్‌ చూపిన మార్గమే అనుసరించి చెస్టర్‌టన్, బెలాక్, బయర్‌బమ్, ప్రిస్టీ మొదలైనవారు వ్యాసరచనలో సిద్ధహస్తులయ్యారు. Familiar Essayకు లాంబ్‌ నిజమైన మార్గ దర్శకుడు. మృదువైన హ్యూమర్‌ అతడి సొమ్ము. ఇలియా అన్నది అతడి మారుపేరు. అదేపేరుతో అతడు ద లండన్‌ మ్యాగజైన్‌ పత్రికలో వ్యాసాలు రాశాడు. అదే కాలంలో హాజ్లిట్‌ మంచి విమర్శ వ్యాసాలు ప్రకటించి విమర్శకుల విమర్శకుడు అయ్యాడు. అతడి టేబుల్‌ టాక్స్, ద ప్లెయిన్‌ స్పీకర్‌ గొప్ప వ్యాస సంపుటాలు.

‘కవికి గీటురాయి గద్య అయితే గద్యకి గీటురాయి వ్యాసం’ అన్నాడు హిందీ సాహిత్య చరిత్రకారుడు రామచంద్ర శుక్ల.
వ్యాసం స్వల్పకాలంలో చదవగలిగినది కావాలి. విషయం ఏదైనా కావచ్చు. రచన కళావంతం కావాలి. మెదడుకి సంబంధించినది కాకుండా హృదయానికి సంబంధించింది కావాలి. భావగీతంలాగా ఆత్మాశ్రయంగా వుండాలి. ద ట్రూ ఎస్సే ఈజ్‌ ఎసెన్సియల్లీ పర్సనల్‌ అంటాడు హడ్సను.

మరిన్ని వార్తలు