నీడల ఊడ

30 Sep, 2019 15:19 IST|Sakshi

గేయం

పూసిన పూలకు దోసిలొగ్గితే వాసిగ పరిమళమొంపునుర
కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులునుర

జీవన సారం నిలుపుకున్న పామరులే నిజ సిద్ధులుర
బావిల కప్పల బెకబెక అరిసే బోధలు వెర్రి సుద్దులుర

నీడల ఊడల ఉయ్యాల్లూగిన పసితనమెంతో మురిపెముర
మేడల తేరులపయి ఊరేగిన అతిశయమే ఓ కృతకముర

కవులను పీఠము లెత్తకపోతే కవిత వెలగదని అనుకోకు
రసములూరి రంజిల్లె కవితకు కాలమె తోరణమవుతదిర

నిజమును శోధించె ఓ కవి నిను నీవె మరువాలన్న
కర భజనల మురిపెంబులకన్న ఎద నుబికె తడి ఎంతో మిన్న

యుగాలుగ పగ సిగమె ఊగిన సహనం జగాన వెలిగెనుర
ఉరిమే ఉప్పెన వరదై ముంచిన ఇసుక రేణువులు మెరిసెనుర

పొద్దు వెన్నెల సుక్కల కాంతులు ఆరక వెలిగె దివ్వెలుర
పలకని ప్రతిమల మహిమల కోసం తైలపు దీపాలెందుకుర

ఆకసమే తన గోపురమయిన దేవునికీ గుడులెందుకుర
అంతట తానై ఉండిన వానికి ఆగమ నియమాలెందుకుర

కాసుకు లొంగిన బంధమందున ప్రేమను ఎందుకు వెతికేవు
కందెన ఇంకిన బండిన నీవు ఎందాకని పయనించేవు

గనిలొ పుట్టిన ఇనుము రూపం మారి గనినె తవ్వుతున్నది
ఓటమికి నీ గెలుపునకు నీ గుణమె కారణమవుతున్నది

సీకటినెలిగె వజ్రములున్నవి నా సరి ఎవరని అనకన్న
ఆకటికి వరి అన్నమె కాని వజ్రములు తినలేవన్న

భూమి సొంతం కావాలనుకొనె దాహం నీలో ఉన్నదిర
నీవె తనలోకెన్నడొస్తవని నేల ఎదురు చూస్తున్నదిర

-గోరటి వెంకన్న

మరిన్ని వార్తలు