మానవత్వమే శీలం

5 Mar, 2018 00:31 IST|Sakshi

కథాసారం
ఢాం... ఢాం... ఢాం..!
బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. గాఢనిద్రలో వున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది. ఊరివారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి నిద్ర నుండి త్రుళ్లిపడి లేచారా అన్నంత అలజడి. ఊరిచుట్టు పెరండ్లలో కుక్కల అరుపు. తల్లులు పిల్లలకు శ్రీరామరక్ష తీశారు.

గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని వుంది. ఆమె కాళ్లు చేతులు వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకొని వుంది. పేరు మల్లమ్మ. హఠాత్తున కిటికీ నెవరో తట్టారు. కిటికీ అంటే దాని ప్రాణమెంత? మంటిగోడలో వెల్తురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం. దానికి రెండు చిన్న తలుపులు. చప్పుడుకు వారిద్దరు ఉలికిపడ్డారు. శ్వాస బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. మళ్లీ అదే చప్పుడు. ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు, పిల్లి అసలే కాదు. ఏం చేయాలి?

ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. ‘నాకు బయమైతాందే అవ్వ’.
‘అట్లుండు! ఏదో చూత్తాం’ అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. గొళ్లెం తీస్తూ ‘ఎవర్రా?’ అంది. ఆ ప్రశ్న ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే అతడే తలుపులు బిగించాడు.

ఏ రజాకారో ఇంట్లో దూరాడు. తనకు చావు తప్పదు. తానల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన మనుమరాలికి మానభంగం తప్పదు. తాను పిల్లను సాది సంబాళించింది తుదకీ రాక్షసునికి ఒప్పగించడానికేనా? ఇంకొక్క అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది. ఆ తరువాత పాపం మల్లి!
ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్లు దొరికించుకుంది. ‘నీ బాంచెను. నీ కాళ్లు మొక్కుత. అది నీ చెల్లెలనుకో’.
ఆ వ్యక్తి గుసగుసగా చెప్పాడు: ‘నేను దొంగను కాను, రజాకార్ను కాను, పోలీసును కాను. మిమ్మల్నేమీ అనను’.

కాళ్లు పట్టుకొన్న ముసలవ్వ మెల్లగా లేస్తూ అతని మోకాళ్లు, నడుము తడుమసాగింది. చొక్కా లేదు. దేహమంతటా పల్లేరుకాయలు, జిట్టరేగు ముండ్లు. గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి. శరీరం జ్వరంతో రొట్టెపెంక వలె మసలి పోతున్నది. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు.
‘మల్లీ! దీపం ముట్టియ్యే జెప్పన’
‘వద్దవ్వా వద్దు. దీపం వెలిగించకు. పోలీసులు నా వెంటపడ్డారు, పట్టుకుంటారు’
‘పోలీసుల కన్నా ముందు నిన్ను సావుదేవతే పట్టుకునేటట్టున్నది’ గద్దించింది ముసలమ్మ.

మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ మూలకొక గొంగడి పరిచింది. అతడు పదునెనిమిదేండ్లకు మించని బక్కపలుచని యువకుడు.
‘మల్లిపోరీ! కుంపటి మీద కడుముంతెడు నీళ్లెక్కియ్యే. ఎక్కిచ్చినవా? ఇగరా. కూకో వాని పక్కన. ముండ్లు తీసెయ్యి ఉల్లుల్లుగ. అయొ! సిగ్గయితాందా వాన్ని ముట్టుకుంటె? ఏం మానవతివి గదనే! పాపం పీనుగోలె పడున్నడుగాదె!’ ముసలవ్వ గొణుగు మహాప్రవాహం వలె సాగిపోతున్నది. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు.

యువకుని దేహమంతా శుభ్రమైంది. ఇంతలో తలె తెచ్చి, ముసలవ్వ యువకుని తలాపున కూర్చుంది. ‘ఇగ లే కొడుకా. కొద్దిగంత గట్క చిక్కటి సల్లల పిసుక్కచ్చిన. పొయ్యే పాణం మర్లుతది. కులం జెడిపోతవని భయపడుతున్నవా? మొదలు పాణం దక్కిచ్చుక్కో’. ఆమె మాటలకు చిరునవ్వుతో యువకుడు తలె అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు గటగట త్రాగాడు. సగం పోయిన ప్రాణాలు తిరిగివచ్చాయి. కండ్లలో జీవనజ్యోతి వెలుగజొచ్చింది.

యువకుడి దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చడ్డీ జేబు వద్ద ఆగింది. ‘గిదేందిరో’ అంటూ ఒక్కు వస్తువ తీసింది.
‘అది తోటాల తుపాకి’ అన్నాడు యువకుడు.
‘ఎందుక్కొడుకో తుపాకి? మమ్ములగిట్ల చంపుదమనుకున్నవా ఏంది?’
‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్లను చంపే అందుకది... ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలో నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే’
‘ఎందుకురా నీకు పోలీసోల్ల తోటి కైలాట్కం?’
‘నేను స్టేట్‌ కాంగ్రెస్‌ వాలెంటియర్ను. నైజాం రాజుతోటి కాంగ్రెస్‌ పోరాడుతున్నది’
పెద్ద పెద్దోల్లేమో పట్నంల ముచ్చట్లు పెట్టుకుంటు కూకుంటరట, పసిపోరగాళ్లనేమో పోలీసోల్ల మీదికి పొమ్మంటరట... అని రామవ్వ కాసేపు గొణిగింది. కొద్దిగ కన్ను మలుపుకొమ్మని యువకునికి చెప్పింది.

పాలు పిండేవేళ అతిక్రమించి పోతున్నది. యువకుడు సుఖనిద్ర పోతున్నాడు.
అకస్మాత్తుగా బజారులో మోటారు ట్రక్కు చప్పుడైంది. ఎటువిన్నా బూటుకాళ్ల తటతటలే.
మల్లమ్మ గడగడలాడింది. యువకుడు దిగ్గున లేచాడు. బయటికి పోబోతే ముసలవ్వ వారించింది.
‘అటో యిటో తేలిపోవాలి. నా వల్ల మీకు అపాయం కలుగుతుంది’ అన్నాడు యువకుడు.
ముసలవ్వ అతణ్ని వెనక్కి నెట్టింది. రివాల్వరు లాగుకుంది. మినుకు మినుకు మంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పేసింది.
బయట మనుషుల అలికిడి.
మల్లమ్మకు చెప్పింది: ‘పొల్లా! నిన్న మర్రి కొంరడు కట్టుటానికియ్యలె? ఆ దుప్పటిన్నూ కండువా తీస్కరా!...’
తలుపు మీద నాలుగుసార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి.
యువకుడిని దుప్పటి కట్టుకొమ్మంది. కండువాను నెత్తికి చుట్టుకొమ్మంది.
‘ఓ రామీ! తల్పూకి ఖోల్‌’
మల్లివి రెండు దండె కడాలు తీయించి అతడికి తొడిగింది. ‘గొల్ల వేషం’ తయారైంది.
మళ్లీ తలుపు మీద దిబదిబ. ‘ఓ రామీ! తల్పూ తీస్తా లేదూ. నీకి తోడ్కల్‌ తీస్తం ఠైర్‌. ఫౌరన్‌ తీ తల్పు’.
‘మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో’
యువకునికి ఎటూ తోచలేదు. తుదకు పట్టుపడటమే నొసటన వ్రాసి యున్నట్లుంది. విధి లేక పడుకున్నాడు.
ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వలె ఆవలిస్తూ– ‘ఎవర్రా పెద్ద దొంగనాత్తిరచ్చి తలుపు కొడ్తాన్రు. మీ ఇల్లు పాడుబడ. పోలీసోల్లు రాత్రి గత్తుకత్తె మీ యిపులు పెట్న బలుగుతయ్‌’ అంది. ‘మల్లీ! మాట్లాడక ఆ పోరని పక్కల పండు, ఊ నడూ!...
బయటినుండి ‘మేం పోలీసోళ్లం’ అన్నది ముసలవ్వ వినిపించుకోలేదు.
‘నన్నేం దోసుకుంటర్రా? లేచి తలుపు తీసేదాక గూడా ఓపిక లేకపోతే పగులగొట్టుండ్రి. దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గిలేదు. మల్లికి నిన్న మొగడచ్చిండేమో, దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినిపించుకోదు...’
‘చెయ్యేసి పండుకో పోరడా దానిమీద. చూసెటోని కనుమానం రావద్దు... ’

‘ఓ మల్లీ! ఓరి మల్లిగా! ఊహూ వీల్లు లేవరు. వీల్ల వైసు వక్కలుగాను, బజార్ల గంత లొల్లాయితాంటె మా రాజుగ గుర్రుకొడతాన్రు... నా ముంగట్నే కొడుకూ కోడలూ రుచ్చాలోలె పడిపోయిన్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు. యాడున్నవురో కొడుకా’ అంటూ రాగం పెట్టి ఏడువసాగింది.
బయటివాళ్లు నానావిధాల మాట్లాడుతున్నారు. ‘పాపం పోనీ’ అని ఒకరు. ‘అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్‌’ అని మరొకరు. బయటినుంచి పగలగొట్టుదామనే లోపు తలుపు తీసింది.

‘పోరి మెడల గంటెపుత్తెలున్నయి, పోరగానికి రెండు దండె కడియాలున్నయి, ఇగేం కావాల్నో తీసుకోండి’ అంది.
అప్పుడే నిద్రలోంచి లేచినట్టు మల్లమ్మ కండ్లు నులుముకుంటూ లేచింది. యువకుడు కూడా లేచి కూర్చున్నాడు. యువకుని వైపు చూపిస్తూ పోలీసు ‘వాడు కాంగ్రెసోడా యేం’ అని ప్రశ్నించాడు.

‘వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్లమనుకున్నవా? నిన్నెవడన్న గట్టనే అడుగుతె ఎట్టుంటది?’ ముసలవ్వ తీవ్రతకు పోలీసులు చకితులైనారు. రేపు వీన్ని హాజరు చెయ్యాలని ఆదేశించి వెళ్లిపోయారు. ‘అవ్వా నువ్వు సామాన్యురాలవు కావు, సాక్షాత్‌ భారతమాతవే’ అన్నాడు యువకుడు. ‘దోడ్త్‌! నాకే పేర్లు బెడుతున్నావు? నేను గొల్లరామిని. గంతే. ఇగ నువ్వెల్లు. మల్లిని అత్తోరింటికి తోలుకపోత’.

కాళ్లు పట్టుకొన్న ముసలవ్వ మెల్లగా లేస్తూ అతని మోకాళ్లు, నడుము తడుమసాగింది. చొక్కా లేదు. దేహమంతటా పల్లేరుకాయలు, జిట్టరేగు ముండ్లు. గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి.

భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కథ ‘గొల్ల రామవ్వ’కు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ కాకతీయ పత్రికలో 1949లో అచ్చయింది. ‘విజయ’ కలంపేరుతో రాశారు. బహుభాషా కోవిదుడిగా కీర్తినొందిన పీవీ ఆత్మకథాత్మక నవల ‘ఇన్‌సైడర్‌’ (లోపలి మనిషి) రాశారు.

- పి.వి. నరసింహారావు

మరిన్ని వార్తలు