ప్యాలియేటివ్ కేర్వేదన-సాంత్వన!

28 Apr, 2014 23:24 IST|Sakshi
ప్యాలియేటివ్ కేర్వేదన-సాంత్వన!

కొన్నిసార్లు జబ్బు చాలా మంచిది. అది బంధాలను బలంగా చేస్తుంది. అందర్నీ దగ్గర చేస్తుంది. కళ్లు చెమర్చేలా చేస్తుంది. అన్నీ అమర్చేలా చూస్తుంది. సన్నిహితులెవరో చెబుతుంది. కానీ చికిత్సకు లొంగే జబ్బు అయితేనే మంచిది. అందులోనూ డబ్బు ఉంటేనే జబ్బు మంచిది. కానీ ఆ వచ్చిన రుగ్మత ఒకపట్టాన లొంగనిదైతే? ఎప్పటికీ తగ్గనిదైతే? మృత్యువొక్కటే దానికి మందైతే? అయితే ఆ వేదన ఒక్క రోగిదే కాదు... అనుభవించే అందరిదీ. పక్కనుండే పలువురిదీ. ఇక మరణం అనివార్యమని నిర్ధారించే జబ్బు వస్తే... ఆ వచ్చే కష్టాలు కేవలం చికిత్సాపరమైనవి మాత్రమే కాదు. మరెన్నో! ముఖ్యంగా శారీరకంగా కలిగే నొప్పులు, తెంచుకోలేని పాశాలు, మానసికమైన క్లేశాలు... వీటన్నింటినుంచీ విముక్తి ఎలా? మరణమే శరణ్యమనే పరిస్థితుల్లో సంవేదననుంచి సాంత్వన ఇచ్చే ‘ప్యాలియేటివ్ కేర్’పై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం.
 
హాస్పిటల్ కాదది... హాస్పిస్
ఒక రోగికి వచ్చిన జబ్బు కారణంగా ఇక మరణం తప్పదు. అలాంటి రోగిని ఏ హాస్పిటల్ చేర్చుకుంటుంది? పైగా అలాంటి రోగులను చేర్చుకోడానికి విముఖత చూపుతుంది. ఫలానా దగ్గర రోగికి నయమైపోయిందనే కీర్తి వస్తే గొప్పగానీ... ఫలానాయన అంత పెద్ద ఆసుపత్రిలోనూ చనిపోయారంటే అది ఆసుపత్రికి అపకీర్తి కదూ! అందుకే అలాంటివారిని చేర్చుకోడానికి హాస్పిటళ్లు ముందుకు రావు. చెవికి చేదుగా వినిపించినా, మనసుకు కష్టంగా అనిపించినా ఇది సత్యం. మరి హాస్పిటళ్లే ముందుకు రాకపోతే వారికి వేదన నుంచి విముక్తి ఎలా? అందుకే ఇలాంటి రోగులకు సాంత్వన కలిగించేందుకు ఉద్భవించినవే ‘హాస్పిస్’లు. ఒక్కమాటలో చెప్పాలంటే... అది ఇల్లైనా కావచ్చు లేదా హాస్పిటల్ వంటి వసతైనా కావచ్చు. కానీ రోగి తన చివరి రోజు వరకూ నొప్పీ, బాధా లేకుండా ప్రశాంతంగా బతికేలా చేసే ఇన్‌పేషెంట్ వసతి సౌకర్యమే ‘హాస్పిస్’.
 
 హాస్పిస్ కాదేమో... హాస్-‘పీస్’ ఏమో!
 మరణం తప్పదని తెలిశాక మనసు దెబ్బతింటుంది. శారీరక బాధలకు మానసిక వేదన తోడుగా వస్తుంది. ఇలా రెట్టింపైన బాధలను తగ్గించే మార్గం ఏదైనా ఉంటే అది హాస్పిస్. పెదవిపై ‘హాసాన్ని’, మనస్సుకు శాంతిని... అదే ‘పీస్’ ఇప్పించే ఆ ప్రదేశాన్ని ‘హాస్పిస్’ అనడం కంటే హాస్-పీస్ అనడం సముచితమేమో!
 
 క్యూర్ లేని చోట కావాల్సిందే... కేర్
 కొన్ని జబ్బులకు ఇక చికిత్స జరిగే పరిస్థితి ఉండదు. ఉదాహరణకు మెటస్టెసస్ దశకు చేరిన క్యాన్సర్‌కు ఇక చికిత్స చేసే మార్గం మిగలదు. కీమోథెరపీ, రేడియేషన్ ప్రక్రియ, శస్త్రచికిత్సలూ ఇవేవీ పనిచేయవు. కానీ ఆ దశలో అంతులేని శారీరక వేదన ఉంటుంది. ఇలాంటి అవసానదశలో ఉన్నవారికీ కొన్ని  శారీరక బాధలుంటాయి. అవి మరీ తీవ్రంగానూ ఉంటాయి. ఆ సంవేదనలకు కావాల్సింది శమన చికిత్సఒక్కటే. లక్షణాలకు చేసే ఉపశమన చికిత్స ఒక్కటే. ఆ చికిత్సను అందిస్తూ, రోగుల బాధల తీవ్రత తగ్గించే కేర్‌ను అందిస్తారు.  
  ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట ఇది...
 ‘ప్యాలియేటివ్ కేర్’ అంటే ఒక రోగికి ఇక జబ్బును నయం చేసే చికిత్స ఇవ్వడం సాధ్యం కాదని నిర్ధారణ అయినప్పుడు రోగికి తీవ్ర లక్షణాల బాధ నుంచి విముక్తి కలిగించే చికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్‌మెంట్), మానసిక వేదననుంచి దూరం చేసే మానసిక చికిత్స (సైకలాజికల్ ట్రీట్‌మెంట్), ఆత్మతృప్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక చికిత్స (స్పిరిట్యువల్ ట్రీట్‌మెంట్) ఇవ్వాలనీ, రోగి బంధువులను సైతం ఆవేదననుంచి దూరం చేసేలా ఈ కార్యకలాపాలు ఉండాలని, తద్వారా రోగి జీవననాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను) మెరుగుపరచాలనీ చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). అంతేకాదు... రోగికీ, అతడి బంధువులకూ అవసరమైన మానసిక, సామాజిక బలాన్నీ ప్రసాదించాలని పేర్కొంటోంది.
 
 ఆ అపోహే వద్దు...
 రోగిని బాధల నుంచి విముక్తం చేసేలా వ్యవహరిస్తారనే మాట ఒక్కోసారి కొందరిలో తప్పుడు అభిప్రాయాలను కలిగించవచ్చు. రోగికి తీవ్రమైన బాధా, నొప్పీ ఉంటాయి కాబట్టి వాటి నుంచి విముక్తం కలిగించడానికి ‘కారుణ్యమరణం’ కలిగిస్తారేమో అనే అపోహ ఉంటుంది. కానీ ప్యాలియేటివ్ కేర్‌లో రోగికి కారుణ్యమరణం కలిగేలా చేయరు. మరణాన్ని ముందుకు తీసుకురారు. అది వచ్చినప్పుడు దాన్ని ఆలస్యం చేయరు. జబ్బు వచ్చినా, రుగ్మతతో రుజాగ్రస్తమైనా రోగి తన సహజమరణం సమీపించినప్పుడే చనిపోయేలా చేస్తారు. ఆ సమయంలోనూ వారు పెద్దగా బాధపడని విధంగా తాత్విక దృక్పథం కలిగి ఉండేలా రోగికీ, కుటుంబ సభ్యులందరికీ తగిన కౌన్సెలింగ్ ఇస్తారు. అయితే ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ రోగితో ఉండే భావోద్వేగ పరమైన బంధాల వల్ల అది సరిపోయినంత అని ఎవరూ చెప్పలేరు. అలా చేయడం సాధ్యమూ కాదు.
 
 అంగట్లో అన్నీ ఉన్నా రోగి నోట్లో మందూ కరవే...
 సాధారణంగా చివరిదశలో తీసుకుంటున్న రోగికి ప్రధానంగా అవసరమైనవి నొప్పిని తెలియకుండా చేసే మందులు. వీటిని వైద్యుల పర్యవేక్షణలో అవసరం ఉన్నవారికే ఇస్తే ఆ మందులను ‘ఓపియాయిడ్స్’ అనవచ్చు. కానీ ఒక మత్తు కోసం, ఒక దుర్వ్యసనం కోసం దుర్వినియోగం చేస్తే వాటిని ‘నార్కోటిక్స్’ అంటారు. అందుకే వీటి లభ్యత తక్కువ. సాధారణ మెడికల్ షాపుల్లో ఇవి దొరకనే దొరకవు. ఇవి దొరికే ప్రత్యేకమైన మందుల దుకాణాలుంటాయి. అక్కడా ఎంతో మంది ఉన్నత స్థాయి వైద్యాధికారుల అనుమతులతోనే వీటిని విక్రయిస్తారు. అంతేకాదు... వీటి ప్రిస్క్రిప్షన్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఈ మందు దొరకడం సాధ్యమవుతుంది. విచిత్రం ఏమిటంటే... వీటిపై కఠినాతికఠినమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ మందుల తయారీకి అవసరమైన పంట అయిన ‘ఓపియమ్’  ప్రపంచంలో పండే మొత్తం పంటలో 90 శాతం భారత్‌లో పండుతోంది. కానీ నొప్పుల నివారణ కోసం కేవలం 5 శాతం కంటే తక్కువకే ఇక్కడ దీని లభ్యత పరిమితమైంది. అంతెందుకు ఈ తరహా రోగులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నా... ఈ బాధానివారిణులు మాత్రం కేవలం ప్రస్తుతం ‘హైదరాబాద్’లో మాత్రమే లభ్యమవుతున్నాయి. మొదటి కారణం... ‘ప్యాలియేటివ్ కేర్’ చికిత్స ప్రక్రియలపై అవగాహన తక్కువగా ఉండటం. రెండో కారణం... వీటి లభ్యతపై కఠినమైన నిబంధనలు అమలవుతూ ఉండటం. ఈ పరిమితుల దృష్ట్యా ప్యాలియేటివ్ కేర్ అవసరమైన రోగులు ఎందరో దీనికి దూరంగా నొప్పులతో విసిగిపోతూ, బాధలతో వేసారిపోతూ దుర్భరంగా జీవిస్తున్నారు.
 
 హాస్పిస్ నుంచి హాస్పిటల్‌కు తరలిస్తారా?
 ప్యాలియేటివ్ కేర్ దొరికే హాస్పిస్ నుంచి రోగిని హాస్పిటల్‌కు తరలించేందుకు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇక రోగికి మృత్యువు తప్పదని తెలిశాకే ఇక్కడికి చేర్చుతారు. ఒకవేళ రోగి సంక్లిష్ట దశల్లోకి వెళ్లి మరణానికి చేరువవుతుంటే బాధానివారణకు అవసరమైన చర్యలు చేపడతారు తప్ప... ఆసుపత్రికి తీసుకెళ్లరు. అయితే కొందరు రోగులు తమ పరిస్థితిని గుర్తెరిగాక... తమ సొంత ఇంట్లోనో, తమకు ఇష్టమైన చోటో ప్రశాంతంగా కన్నుమూద్దామని భావిస్తారు. అలాంటి రోగుల కోరిక మేరకు వారు తమకు ఇష్టమైన, అనువైన చోటికి వెళ్లవచ్చు.
 
 విజయ సంతృప్తి... ఆత్మతృప్తి
 ఒక కఠినమైన, సంక్లిష్టమైన కేసును స్వీకరించి రోగిని బతికిస్తే ఆ డాక్టర్‌కు తన వృత్తిపరంగా విజయసంతృప్తి లభిస్తుంది. కానీ మరణం తథ్యమని తెలిసిన ఒక రోగికి కేవలం బాధ నుంచి విముక్తి కలిగిస్తే ఏమొస్తుంది? కనీసం ఫీజు కూడా రాదు. అందుకే కేవలం ఆత్మతృప్తి కోసమే ఈ రంగాన్ని ఎంచుకుని సేవలందించే వారే భారత్‌లో ప్యాలియేటివ్ కేర్‌లో కొనసాగుతున్నారు. సేవాపథంలో సాగుతున్నారు. విజయసంతృప్తికీ... ఆత్మతృప్తికీ... తెచ్చుటలో ఉన్న హాయికీ... ఇచ్చుటలో ఉన్న హాయికీ తేడా తెలిసిన వారే ఈ కేర్ కోసం క్రతువు సాగిస్తున్నారు.
 
 చివరగా...
 ఉర్దూ మహాకవి, గజల్ చక్రవర్తి గాలిబ్ అంటాడూ...  
 మృతియే లేకున్న ఈ బతుకుకు రుచే లేదు అని వచిస్తాడు.
 మరణం కూడా గొప్ప ఆనందకర అనుభవమేనని ప్రవరిస్తాడు. గోరు ఊడిన సుఖం లాంటిదే మరణమంటూ మృత్యువును నిర్వచిస్తాడు. ఎప్పటికైనా తప్పనప్పుడు ఆనందంగా ఆహ్వానించమని ఉద్బోధిస్తాడు. ఆ తాత్విక స్థాయిని, ఆధ్యాత్మిక భావననూ, ఆ అంతర్దర్శనాన్ని అందరూ దర్శించగలిగేలా చేసే పవిత్రక్షేత్రమే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్. ఓ వ్యక్తికి చివరగా దొరకాల్సిన సేవల మజిలీ... ఈ మలిమజిలీ! మేలిమి మలిమజిలీ!!
 
 బాధా విముక్తి కోసం శక్తిమేర ప్రయత్నం
 చివరకు తీసుకుని తీసుకుని మరణించే కొన్ని జబ్బుల చివరి దశ చాలా బాధాకరంగా ఉంటుంది. కొన్ని జబ్బులు భయంకరమైన శారీరక వేదనలను కలిగిస్తాయి. ఆ దశలో తీవ్రమైన నొప్పులతో, వికారాలతో, వాంతులు, భ్రాంతులూ, మింగలేకపోవడాలూ, విరేచనాలూ, విలాపాలూ విషాదాలూ వంటి బాధలు శరీరాన్ని వేదనకూ, మనసును ఆవేదనకూ గురిచేస్తాయి. శత్రువుకూ ఈ పరిస్థితి వద్దనే బాధనుంచి విముక్తి కోసం శక్తిమేరకు ప్రయత్నించే సిబ్బంది  హాస్పిస్‌లో నిరంతరం పనిచేస్తుంటుంది. కలచివేసే నొప్పిని అణచివేసేందుకూ, తొలిచేసే బాధను ఆవలికి తోసేసేందుకు కృషి చేస్తుంది. ఇక్కడ బాధానివారణా నిపుణులుంటారు. వీరిని ప్యాలియేటివ్ కేర్ స్పెషలిస్టులంటారు. మందులందించే నర్సులుంటారు. సలహాలతో సాంత్వన పరిచే కౌన్సెలర్లుంటారు. స్వచ్ఛంద సేవకులుంటారు. ముక్తిని పొందాలనుకుని భక్తిని ఆశ్రయించేవారికి మనసును సేదదీర్చేలా మాట్లాడే మానవీయమూర్తులుంటారు. ఔషధాల కోసం ఫార్మసిస్టులూ, పౌష్టికాహారం కోసం అవసరమైన న్యూట్రిషనిస్టులు... ఇలా వీళ్లంతా కలిసికట్టుగా పనిచేస్తూ మన గుండెబరువులను వారు పంచుకుంటూ, మన వేదనలను ఆవలికి తోస్తూ ఉంటారు.
 
 పునరావాసం కాదది... మరణావాసం
 ప్రపంచంలోని మొట్టమొదటి హాస్పిస్‌ను పధ్నాల్గవ శతాబ్దంలో సెయింట్ జాన్స్ ఆఫ్  జెరూసెలం రోడ్స్‌లో ప్రారంభించారు. పతితులూ, పథికులూ, నొప్పి చేత  పీడితులూ, బాధాసర్పదష్టులు అలా వెళ్తూ వెళ్తూ, మార్గమధ్యంలో మరణవేదన బారిన పడితే వారికి దిక్కెవరు... అన్న ఆలోచననుంచి పుట్టిందే ఈ మొట్టమొదటి హాస్పిస్. లాటిన్‌లో హాస్పెస్ అనే మాటకు అర్థం... ‘అనుకోని ఓ అపరిచిత అతిథికి అవసరమైన ఆతిథ్యమిచ్చి చివరివరకూ వేదనలనుంచీ, రోదనలనుంచీ విముక్తి కల్పించడం’. దీనికి సుదీర్ఘమైన నేపథ్యమూ ఉంది. పదకొండో శతాబ్దం నుంచే యుద్ధాల్లో గాయపడి కోలుకోలేకున్నవారూ,  అంతుతెలియని జబ్బులతో తీసుకుంటున్నవారూ, మార్గమధ్యంలో రోగగ్రస్తులై దారీతెన్నూ తెలియని ప్రస్థాన పథికులూ...  ఆ ప్రవాసాల్లో చివరి వరకూ నివాసముండి, ప్రశాంతంగా కనుమూయడానికి అవసరమైన కేంద్రాలుండేవి.  ప్రధానంగా ఇవి సుదీర్ఘప్రయాణం చేసే యాత్రికులకోసం ఉద్దేశించినవి. ఇక  ఎప్పటికీ జబ్బు తగ్గదని తెలిసిపోయాక, తేలిపోయాక వీరికి కలిగిన రుగ్మతనూ, రుజాగ్రస్త అవస్తను ‘టెర్మినల్ ఇల్‌నెస్’ అనేవారు. ఇల్లేలేనివారి ఇల్‌నెస్‌ను, వారి వెల్‌నెస్‌ను పట్టించుకునే వారెవరు? వారికోసమూ ఏదైనా ఏర్పాటు ఉండాలనే మానవీయమూర్తుల తాత్వికత నుంచి ఆవిర్భవించిన చికిత్సా ప్రక్రియ ఇది.  ప్రేమను పంచుతూ రోగికి చివరి వరకూ చేసే సేవ పేరే ‘ప్యాలియేటివ్ కేర్’! ఆ కేర్‌ను అందిస్తూ చివరివరకూ ఉంచే మరణావాసమే ‘హాస్పిస్’.
 
 మరి ఆ సామాజిక బలం దొరుకుతోందా?
 దురదృష్టవశాత్తూ మరణమే శరణ్యమైన రోగులకు సామాజిక స్థ్యైర్యాన్ని అందించే పరిస్థితి భారత్‌లో లేదు. మనదేశంలో మరణాన్ని ఒక కీడుగా పరిగణిస్తారు. ఒక చెడుగా చూస్తారు. అందుకే తప్పనిసరిగా మరణించే రోగిని చేర్చుకోడానికి ఆసుపత్రులూ అంత సుముఖంగా ఉండవు. అలాంటి వారికి అద్దెకు ఇల్లు ఇవ్వడానికి యజమానులూ సిద్ధంగా ఉండరు. మన దేశంలోని అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే... క్యాన్సర్ నాలుగో దశతో ఇక తప్పనిసరిగా మరణిస్తాడనే రోగి ఉన్న కుటుంబానికి ఇల్లే అద్దెకు ఇవ్వరు. తమ ఇంటిలో ఆ రోగి మరణించడాన్ని అంగీకరించరు. ఇక ఇల్లే ఇవ్వని వారు ఇల్‌నెస్ గురించీ, వారి వెల్‌నెస్ గురించీ ఆలోచిస్తారనుకోవడం అత్యాశే. అందుకే ఈ తరహా రోగులకు అవసరమైన సామాజిక స్థైర్యం (సోషల్ సపోర్ట్) అందడం లేదు. అలాంటి వారికి ఇప్పుడు ‘హాస్పిస్’లే ఒక వరం. కానీ మరో దురదృష్టపరిస్థితి ఏమిటంటే... భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన హాస్పిటల్‌కు  అనుబంధంగానైనా ఒక హాస్పిస్ కూడా లేదు. మన రాష్ట్రంలోనూ ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా ఈ వసతి లేదు. స్పర్శ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోనే కొందరు మానవీయ వైద్య నిపుణుల చొరవతో ఈ కార్యక్రమం సాగుతోంది. అలాంటి రోగుల అవసరాలను తీరుస్తోంది.
 
 ఎదురుగా ఎన్నెన్నో  సవాళ్లు...
 ఈ తరహా చికిత్స సౌకర్యాల ఏర్పాటుకు ఎన్నో సవాళ్లు అడ్డంకిగా ఉంటాయి. ముఖ్యంగా వసతి. ఒకచోట అందరూ చనిపోయేవారే ఉంటారని తెలిశాక అలాంటి ఆవాసాన్ని తమ పొరుగునే ఉండాలని కోరుకునేంత మానవీయ, మాననీయ మూర్తులెవరు? ఇక చికిత్స ఎంతగా చేసినా ఫలితం ఉండదు. చేయాల్సిన చికిత్సల్లా లక్షణాలను బట్టి కనిపించే బాధలకు లేపనం పూయడం లాంటిదే. నొప్పికి మందు వేయడం లాంటిదే. తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం లాంటిదే. అలాంటప్పుడు రోగికీ ఆ విషయం తెలిశాక, బంధువలకూ సంగతి అర్థమయ్యాక తగ్గని రోగం కోసం డాక్టర్‌కు ఫీజు చెల్లించాలంటే ఇష్టపడేవారెవరు? అది సరే... అన్నీ తెలిసి ఫీజు అడగాలంటే సదరు వైద్యుడికి మాత్రం మొహమాటం ఉండనే ఉంటుంది కదా. కాబట్టి ఫీజు వసూలుకు అవకాశం లేదు. ఒకవేళ అడిగినా అది మానవత్వం కాదు. కాబట్టి ఈ తరహా ‘ప్రాక్టీస్’ను ఎంచుకునే అవకాశమే తక్కువ. అందుకే భారత్‌లో అత్యున్నత స్థాయిలో ‘ప్యాలియేటివ్ కేర్’ కోర్సే లేదు. మన రాష్ట్రంలోనూ ఈ తరహా అత్యున్నత స్థాయి విద్య చదివిన వారూ పెద్దగా లేరు. దేశవ్యాప్తంగానూ ఒకరిద్దరే ఈ తరహా అత్యున్నత స్థాయి విద్యను అభ్యసించిన వారున్నారు. మరి  సమాజానికి ఈ తరహా సేవలూ కావాలి కదా. అందుకే చొరవ తీసుకని కొందరు మానవత్వంతో తమకు చేతనైన పరిధిలో ఇలాంటి సేవ అందిస్తున్నారు.
 

ప్యాలియేటివ్ కేర్‌లోని ప్రధాన లక్ష్యాలు
 రోగికి నొప్పి నుంచి లక్షణాల బాధలనుంచి విముక్తి కలిగించడం.
     
 మరణం తథ్యమని తెలిశాక ఆ సమయం వరకూ సాధ్యమైనంత మేరకు మంచి, సాధారణ జీవితాన్నే అందించడం.
     
 సామాజిక, ఆధ్యాత్మిక, మనశ్శాంతిని ఇచ్చే సాంత్వన ప్రక్రియలను అనుసరించడం.
     
 సంఘపరంగా అవసరమైన స్థైర్యాన్ని అందించడం.
     
 మరణం వరకూ మామూలుగానే ఉండేలా, తన దైనందిన పనులన్నీ ఇదివరకులాగే చురుగ్గా చేసుకునేలా రోగిని ప్రోత్సహించడం. అలాంటి స్ఫూర్తిని రోగిలో రగిలించడం.
     
 రోగి కుటుంబాన్ని సైతం అన్ని విధాలా మానసికంగా సిద్ధం చేసి, వారినీ మామూలుగా ఉంచేందుకు ప్రయత్నించడం, వారిలోని బాధను తొలగించడానికి కృషి చేయడం.
     
 పై విషయాలన్నీ జరిగేందుకు అవసరమైన వ్యక్తులతో ఒక సమూహం (టీమ్)గా ఏర్పడి అన్ని విషయాల్లోనూ రోగికీ, అతడి బంధువులకూ ఆ బృందం ఒక భరోసాగా నిలవడం. చేయూతనివ్వడం.
     
 రోగి అనునిత్యం సానుకూల దృక్పథంతోనూ, మంచి నాణ్యమైన జీవనప్రమాణాలతోనూ జీవించేలా చేయడం.
 
 హైదరాబాద్‌లోని ‘స్పర్శ్’ స్వచ్ఛందంగా...


 వసూళ్లకు అవకాశం లేని ఈ రంగంలోకి ప్రవేశించి, సమాజానికి తమ వంతు సేవగా తమ భాగస్వామ్యాన్ని అందజేస్తున్నారు కొందరు డాక్టర్లు. వారిలో ప్రధానమైన వారు డాక్టర్ ఫణిశ్రీ. ఆమె ఈ సంస్థకు మెడికల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. పైగా ఆమె ప్యాలియేటివ్ కేర్‌లో శిక్షణపొందిన నిపుణురాలు. అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం కూడా ఈ స్పర్శ్ సంస్థకు అధ్యక్షుడిగా, ప్రధాన ట్రస్టీగా, కోశాధికారిగా సేవలందిస్తున్నారు. ఇక మరికొందరు స్వచ్ఛంద సేవకులు సైతం ఈ కృషిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. హాస్పిస్ సౌకర్యాన్ని తమ సేవామందిరం బయటకూడా అందిస్తున్నారు. అంటే ఇండ్లకు వెళ్లీ  కడగండ్లు తీర్చే సేవా చేస్తున్నారు. వీరు తమ సేవలన్నింటినీ ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకుగాను ఎలాంటి డబ్బునూ వీళ్లు రోగుల నుంచి లేదా వారి బంధువులు, సన్నిహితుల నుంచి స్వీకరించరు. కానీ ఈ తరహా సేవలకు, మందులకూ పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకోసం ఒకవేళ రోగి బంధువులూ, సన్నిహితులూ తమ వంతు విరాళాలు అందించదలచుకుంటే తమ స్పర్శ్ సంస్థకు ఇవ్వాల్సిందిగా కోరతారు.
 
 రోగికి కావాల్సింది ఆత్మీయ స్పర్శ: కాబట్టే ఈ సంస్థకు విజిటింగ్ అవర్స్ అంటూ ఉండవు. సందర్శకులెప్పుడైనా రావచ్చు. తుదిఘడియల్లో తోడుగా ఉంటూ... తామున్నామన్న భరోసా ఇస్తూ... చివరి వరకూ రోగి వెంటే నడుస్తూ, వారితో కలిసి చదువుతూ, ఆడుతూ, పాడుతూ, ఆనందింపజేస్తూ తమ స్పర్శను వారికి అందించవచ్చు.
 
 హైదరాబాద్‌లో స్పర్శ్ చిరునామా
 స్పర్శ్ హాస్పిస్,సెంటర్ ఫర్ ప్యాలియేటివ్ కేర్,
 ప్లాట్ నెం. 85, (8-2-703/2/1), రోడ్ నెం. 12,
 బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034.
 ఫోన్: 040 2338 4039, 94904 48222.
 ఈ-మెయిల్ : hospicesparsh@gmail.com
 వెబ్‌సైట్: www.sparshhospice.org

 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 

మరిన్ని వార్తలు