భరిస్తే... చాలు బహుమతులు!

18 Apr, 2014 00:43 IST|Sakshi
భరిస్తే... చాలు బహుమతులు!

వినూత్నం
 
పందాలు బోలెడు రకాలు...ఒంటరిగా, జంటగా, జట్టుగా పాల్గొనే రకరకాల పందాల పోటీలుంటాయి. కానీ, ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న పందెం మాత్రం అన్నింటికీ భిన్నమైంది. ఈ పందెంలో భార్యను మోస్తూ పరుగెత్తాలి. కుటుంబభారాన్ని మోసే భర్తకు భార్యను మోయడం పెద్ద విషయం కాకపోవచ్చు.

గుంతలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ ఎవరు ముందుకు పరుగెడితే వారికి మొదటి బహుమతన్నమాట. బహుమతేమిటంటారా! భర్త బరువు బీరు, భార్య బరువు డబ్బుని ఇస్తారు. ఉత్తర అమెరికాలో సండే రివర్ దగ్గర ఏటా అక్టోబర్‌లో జరిగే ‘వైఫ్ క్యారీయింగ్ ఛాంపియన్‌షిప్’ చాలా పాపులర్ అయింది. గత పద్నాలుగేళ్లుగా అక్కడ ఈ పరుగు పందెం పోటీలు జరుగుతున్నాయి.
 
ఫిన్‌లాండ్‌లో మొదలై...
 
ఫిన్‌లాండ్‌కి చెందిన సొంకజార్వి అనే వ్యక్తి ఈ పందాన్ని కనిపెట్టారు. ఈ  పరుగుపందాల్లో  క్యాలిఫోర్నియా, హవాయ్, మారిలాండ్,  పెన్సిల్వేనియా, న్యూయార్క్, ఇంగ్లండ్‌ల  నుంచి వచ్చే జంటలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఏటా యాభై జంటల వరకూ పాల్గొనే ఈ పందాలను తిలకించడానికి జనం వేల సంఖ్యలో వస్తారు. భార్యను భుజాలపై మోస్తూ 278 అడుగులు ఎవరు ముందుగా పరుగెడతారో వారే విజేతలన్నమాట. నిరుటి పోటీల్లో టైస్టో మైటినెన్ అనే వ్యక్తి ఛాంిపియన్‌షిప్ గెలుచుకున్నాడు. భార్య క్రిస్టియానా హాపనెన్‌ని భుజాలపై ఎక్కించుకుని 278 అడుగుల దూరాన్ని 45 సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించాడు.
 
అడ్డంకులను దాటుతూ...
 
అయితే ఈ పరుగు పందెం...నున్నటి రోడ్డుపై రన్నింగ్ కాదు సుమా! రాళ్లు, బురద గుంటలు, మధ్యలో అడ్డుగా చెట్ల కొమ్మలు, ఇసుక కుప్పలు....ఇలాంటి అడ్డంకుల్ని దాటుతూ భార్య కింద పడిపోకుండా పరుగెత్తాలి. చాలామంది హడావిడిగా పరుగులు తీయడంవల్ల మధ్యలోనే భార్యలు కిందపడిపోతుంటారు. భర్త వంతు పరుగెత్తడం అయితే,  భార్య పని జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉండడం. భర్త వీపుపై తల్లకిందులుగా వేలాడుతూ కాళ్లతో అతని మెడను చుట్టి కిందపడిపోకుండా పట్టుకోవాలి. ‘ఈ పరుగుపందాల్లో గెలవాలంటే మంచి ఫిట్‌నెస్ ఉండాలి. అలాగే భార్యపై ప్రేమ కూడా ఉండాలి(నవ్వుతూ...) గెలిచాక బోలెడంత బీరు, డబ్బు వస్తాయి కదా’’ అని అంటాడు టైస్టో మైటినెన్.
 
 ‘‘అవును మరి.  భార్యని జాగ్రత్తగా మోస్తూ అదే సమయంలో వేగంగా పరుగెత్తి.. అందరికంటే ముందే గమ్యాన్ని చేరుకోవడం నిజంగా గొప్ప విషయమే కదా! ఇలాగే జీవితంలో కూడా భార్య బాధ్యతలు మోస్తూ గెలుపు కోసం పరుగెడితే ఏ భార్య అయినా ఇంతకంటే గొప్ప బహుమతులే ఇస్తుంది’’ అంటూ కొంచెం వ్యంగ్యం జోడించి చెప్పింది క్రిస్టియానా. ఇలాంటి భార్యాభర్తలతో ప్రతి ఏటా సండే రివర్ దగ్గర జరిగే పరుగుపందాలను మీరు కూడా వీక్షించాలనుకుంటే ఉత్తర అమెరికా వెళ్లాల్సిందే.
 

మరిన్ని వార్తలు