సుహృద్భావం :  40 ఏళ్లుగా రంజాన్‌ ఉపవాసాలు ఉంటున్నా

4 Jun, 2019 07:01 IST|Sakshi
దోహా నగరం

దోహ ప్రవాసి కనమర్లపూడి కోటేశ్వరరావు

‘మాది నెల్లూరు ప్రాంతం. నలభై ఏళ్ల క్రితం ఖతార్‌ రాజధాని దోహాకు వెళ్లాను. అక్కడ వ్యాపారవేత్త అయ్యాను. ఇక్కడ కూడా వ్యాపారవేత్తగా, సినిమా ఫైనాన్షియర్‌గా ఉంటున్నాను. రెండేళ్ల క్రితం వరకు సంవత్సరంలో తొమ్మిది నెలలు అక్కడా మూడు నెలలు ఇక్కడా ఉండేవాణ్ణి. ఇప్పుడు వయసు రీత్యా ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను’ అన్నారాయన.

పదింతల జీతం
‘నేను సి.ఏ చేసి 1980లో బెంగళూరులో ఉద్యోగం చేసేవాణ్ణి. అప్పుడు నా జీతం 1500. ఎవరో చమురు దేశాలకు వెళితే ఎక్కువ జీతం వస్తుందని చెప్పారు. ఎంత వస్తుందని ఆరా తీస్తే 20 వేలు అని తేలింది. అంటే అక్కడ రెండేళ్లు చేస్తే ఇక్కడ పదేళ్లు చేసినదానికి సమానం. అయితే సి.ఏ ఉద్యోగాలకు ముంబై నుంచి ఎక్కువ పోటీ ఉండేది. నేను ధైర్యం చేసి అప్లై చేశాను. ఒకే ఒక్క కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. 1980లోనే దోహాకు వెళ్లాను. నా తొలి జీతం 20 వేలు’ 

మూసేసిన హోటళ్లు
‘నేను వెళ్లిన సంవత్సరం యథావిధిగా రంజాన్‌ వచ్చింది. అప్పటికి నా భార్యకు వీసా రాకపోవడం వల్ల బేచిలర్‌గా ఉన్నాను. రంజాన్‌ మాసం రావడంతోటే అక్కడి హోటళ్లన్నీ మూతపడ్డాయి. సూర్యాస్తమయం అంటే ఇఫ్తార్‌ సమయం తర్వాతనే అవి తెరుచుకునేవి. హోటల్‌ భోజనం చేస్తున్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరినో అడిగితే ‘రంజాన్‌ నెలలో ఇంతే’ అన్నారు. ఆ ఉపవాసం పద్ధతి తెలుసుకుని అలా ఉండటం చాలా కష్టమనీ ముస్లింలు ఎలా ఉంటున్నారో అని అనుకున్నాను. ఒకరోజు సాయం త్రం ఆకలితో హోటల్‌కు వెళ్లాను. ఆ హోటల్‌లో అన్ని ఆహార పదార్థాలు ముందు పెట్టుకుని చాలామంది ముస్లింలు కూచుని ఉన్నారు. వాళ్లెందుకు తినకుండా వెయిట్‌ చేస్తున్నారని అడిగాను. ఇఫ్తార్‌ సమయాన్ని సూచిస్తూ సైరన్‌ మోగుతుందని అప్పుడు తింటారని చెప్పారు. నేను ఆ సమయం తర్వాత హోటల్‌లో అమ్మే పదార్థాల కోసం కూచుని ఉన్నాను. ఇంతలో ఒక ఎనభై ఏళ్ల ముసలాయన అక్కడకు కుంటుకుంటూ వచ్చాడు. నిండు వృద్ధుడు. కాని ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. ఇఫ్తార్‌ కోసం వచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది... అరే ఇంత వృద్ధుడు ఉపవాసం ఉంటుంటే నేను ఎందుకు ఉండకూడదు అనుకున్నాను’

భూమిని గౌరవించడానికి
‘దోహ నా సొంతభూమి కాదు. భుక్తినిచ్చిన భూమి. నాకు అన్నం పెట్టి ఆదరిస్తోంది. ఈ భూమి ఆచారాలను గౌరవించడం బాగుంటుందనిపించింది. పైగా సంవత్సరంలో ఒక ముప్పై రోజులపాటు ఉపవాసాలు ఉండటం ఆరోగ్యానికి మంచిదని విన్నాను. అక్కడి మిత్రులను అడిగితే ‘రంజాన్‌ పవిత్రమాసం. ఉపవాసాలు ఉండి మీ మతదైవం లేదా మీ ఇష్టదైవం ఆరాధనలో మీరుండొచ్చు’ అన్నారు. అలా నేను కూడా ఉపవాసాలు ఉండటం మొదలుపెట్టాను. మొదటి రెండు రోజులు కొంచెం కష్టంగా అనిపించింది. కాని ఆ తర్వాత ఉపవాసం ఉంటున్నందుకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. మనసు దుర్వ్యసనాల, దురాలోచనల జోలికెళ్లదు. శాంతంగా, ప్రేమగా ఉండబుద్ధేస్తుంది’

ఉపవాస దీక్ష ముగిస్తున్న కోటేశ్వరరావు

మంచినీరు, టీ, ఖర్జూరం...
‘ముస్లిం మిత్రులు ఉదయాన్నే సహర్‌ చేసి ఉపవాసం ఉంటారు. నేను ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని టీ, మంచినీరు మాత్రమే తీసుకొని ఉపవాస దీక్ష ప్రారంభిస్తాను. సాయంత్రం 
ఇఫ్తార్‌ను ఖర్జూర పండ్లతో ముగిస్తాను. అలా ముప్పై రోజులు ఉండటం అలవాటైపోయింది. నేను దోహాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఆ ముప్పై రోజులు మాత్రం ఉపవాసం తప్పక చేస్తాను. ఆ సమయంలో నా ఇష్టదైవాన్ని ధ్యానిస్తాను. ఇది నా ప్రవాస భూమికి నేను చూపించే కృతజ్ఞత. ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కోసారి నా మిత్రులకు ఇది అర్థం కాదు. నేను ఉపవాస దీక్షలో ఉన్నట్టు వాళ్లకు తెలియదు కదా. చెప్పినా ఆశ్చర్యపోవచ్చు. అందుకే రంజాన్‌ మాసంలో ఎవరైనా భోజనానికి పిలిచినా ఏదైనా తాగమని ఆఫర్‌ చేసినా సున్నితంగా తిరస్కరిస్తాను. దీక్ష తప్పకుండా చూసుకుంటాను’ అన్నాడాయన.

మనుషులందరూ మంచివాళ్లే
‘దోహలో నా మతాన్ని నేను ఆచరించడంలో ఏ ఇబ్బందీ పడలేదు. ఎవరి మతరీతులకూ ఎవరూ భంగం వాటిల్లజేయరు. అది ముస్లిం దేశమే అయినా ఈ మధ్యే అక్కడ ఒక చర్చ్‌కు అనుమతి ఇచ్చారని విన్నాను. ఆ దేశాలలో దేవాలయాలు, గురు ద్వారాలు ఉన్నాయి. ఖతార్‌ సిరి సంపదల దేశం. మన దేశస్తులు ఎందరో ఉన్నారు. తెలుగువాళ్లు కూడా. సర్వ మతస్తులు సామరస్యంగా ఉన్నప్పుడు సిరి దానికదే వృద్ధి చెందుతుంది. ఎండలు భయంకరంగా కాచే ఎడారి నేలలోనే తియ్యటి ఖర్జూరాలు గుత్తులు గుత్తులుగా పండటం దైవలీల. ఆ దైవాన్ని మనసులో పెట్టుకుని సాటి మనిషి బాగు కోసం పాటు పడటమే మనం చేయాల్సిన పని. అందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు’ అని ముగించాడాయన.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు