నాణ్యమైన నిద్రతోనే మెదడు హెల్దీ

11 Nov, 2019 13:00 IST|Sakshi

మనకు కేవలం నాలుగు గంటల నిద్ర సరిపోతుందని కొందరు చెబుతుంటారు. ‘మత్తు వదలరా... నిద్దుర మత్తు వదలరా’ అని సినిమా పాట వినిపిస్తూ... చాలాసేపు  నిద్రపోవడం బద్దకస్తుల లక్షణమనీ, అది తమోగుణం అని హితవు చెబుతుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అంటున్నారు సింగపూర్‌ పరిశోధకలు,. అక్కడి డ్యూక్‌–ఎన్‌యూఎస్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు... కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల మీద కొన్ని న్యూరోసైకలాజికల్‌ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై బ్రెయిన్‌ స్కాన్‌లు తీశారు.  ఆ ఎంపిక చేసిన వ్యక్తుల నిద్రపోయే సమయాన్నీ, నిద్ర నాణ్యతను రెండేళ్ల పాటు పరీక్షించాక కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

అదేమిటంటే... సాధారణంగా అందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ కొద్దీ మెదడు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఏడు గంటల పాటు నాణ్యమైన నిద్రను అనుభవించేవారిలో ఇలా క్షీణించే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంటుందనీ, దాంతో వారి మెదడు యవ్వనంలో ఉన్నప్పటిలాగే చాలాకాలం పాటు ఉంటుందని తేల్చారు. ఒకవేళ తగినంత నిద్రలేకపోతే వయసు పైబడకముందే మెదడుకు ఏజింగ్‌ ప్రక్రియ త్వరత్వరగా జరిగి మెదడుకు వృద్ధాప్యం కాస్త త్వరత్వరగా వస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన ఫలితాలు ‘స్లీప్‌’ అనే మెడికల్‌ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.  

మరిన్ని వార్తలు