బయటికొచ్చిన ఫొటో!

1 Jun, 2018 00:11 IST|Sakshi

రాయల్‌ ప్యాలెస్‌

అరుదైన ఫొటోలు ఎవరికి దగ్గర ఉంటాయి? బహుశా అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర. క్వీన్‌ ఎలిజబెత్‌ఐఐ ‘రాజమాత’ అయితే అవనీయండి. మొదట మాత్రం ఆమె గ్రాండ్‌మదర్‌. ఆవిడ గది నిండా అరుదైన ఫొటోలే. మనవళ్ల చిన్నప్పటివీ, మనవళ్లు పెద్దయ్యాక తీసినవి.. ఇప్పటికింకా తీస్తూనే ఉన్నవీ! గది గోడలపైన, టేబుల్‌ మీద.. నిద్ర లేవగానే.. (‘నానమ్మా’ అంటూ వాళ్లొచ్చి గుడ్మాణింగ్‌ చెప్పేలోపే..) వాళ్లను కళ్లారా చూసుకుని ఉల్లాసంగా కళ్లు నులుముకునేందుకు క్వీన్‌ ఎలిజబెత్‌ ముచ్చటగా ఎంపిక చేసుకుని పెట్టుకున్న ఫొటోలు అవి. అవన్నీ మీడియాకు రావు. బ్రిటన్‌లో అంతపెద్ద మీడియా ఉంటుంది కదా, అయినా కూడా రావు. క్వీన్‌ ఎలిజబెత్‌ పర్సనల్‌ కలెక్షన్‌ అవి. రాజమాతకు చిన్న మనవడు ప్రిన్స్‌ హ్యారీ అంటే ఇష్టం. ప్రతి సందర్భంలోనూ ఆ సంగతి బయటపడుతూనే ఉంటుంది. హ్యారీ నవ్వు ముఖంలో అతడి తల్లి డయానా స్వర్గకాంతిలా ప్రతిఫలిస్తూ అత్తగారిని పలకరిస్తూ ఉంటుందేమో!

అలాగని పెద్ద మనవడంటే ఇష్టం లేకుండా ఉంటుందా? చిన్నవాళ్లకు ప్రతి ఇల్లూ కట్టే ‘పట్టమే’ ఇది. రాజమాత కూడా చిన్న మనవడిపై తమ మురిపాన్ని ఫొటో రూపంలో ఫ్రేమ్‌ కట్టించి, ఆ ఫ్రేమ్‌ని టేబుల్‌ ల్యాంప్‌కు ఆన్చి, ఎదురుగా పెట్టుకున్నారు. అందులో హ్యారీ ఒక్కడే లేడు. పక్కనే అతడి భార్య మేఘన్‌ మార్కెల్‌ ఉన్నారు! లేత నీలం రంగు డ్రెస్‌లో ఉన్న మేఘన్, నీలం రంగు సూట్‌లో ఉన్న హ్యారీని అతడి ఛాతీ మీద చేయి వేసి బాగా దగ్గరగా అనుకుని నిలుచున్నారు. మీడియాలో ఎక్కడా కనిపించని ఫొటో అది! ఆ  ఫొటోను ఎక్కడ తీశారో తలియడం లేదు కానీ, బహుశా అది ఎంగేజ్‌మెంట్‌ టైమ్‌లోనిది కావచ్చని బ్రిటన్‌ నుంచి వెలువడే ‘హెల్లో’ మ్యాగజీన్‌ అంచనా వేస్తోంది. అయినా లోకం చూడని ఈ ఫొటో ఎలా బయటికి వచ్చింది? ఎలాగంటే.. ఆ పత్రిక నిండా డేగకళ్ల రిపోర్టర్‌లే! బుధవారంనాడు రాజమాతతో మాట్లాడేందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్‌ జార్జి బ్రాండిస్‌ ఆమె అధికార నివాసానికి వెళ్లినప్పుడు ఆయనతో పాటు లోపలికి వెళ్లిన ఫొటోగ్రాఫర్‌ వాళ్లిద్దరినీ ఫొటో తీసే సందర్భాన్ని వాళ్లిద్దరి మధ్యలోంచి గదిలో టేబుల్‌ మీద కనిపిస్తున్న హ్యారీ, మేఘన్‌ల ఫొటోను ఫొటో తీసే అవకాశంగా మలుచుకున్నాడు. అదిప్పుడు నెవర్‌– బిఫోర్‌–సీన్‌ ఫొటోగా లోకమంతా రౌండ్‌లు కొడుతోంది. 

మరిన్ని వార్తలు