రాకుమారి వేసిన ప్రశ్నలు

19 May, 2018 00:24 IST|Sakshi

చెట్టు నీడ

ఇరాన్‌ చక్రవర్తి తన ఏకైక కుమార్తె సనాకు తగ్గ వరుణ్ని ఎంపిక  చేసేందుకు స్వయంవరం ఏర్పాటు చేశారు. స్వయంవరంలో రాజకుమారి అడిగే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. అదే ప్రాంతానికి చెందిన గొప్ప పండితుడి కుమారుడు ఆజిమ్‌కు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనే తలంపు కలిగి, స్వయంవరానికి హాజరయ్యాడు. రాజకుమారి మొదటి ప్రశ్న.. రాజ దర్బారు నుంచి లేచి కుడిచేయి పైకెత్తి చూపుడువేలును ఆకాశానికెత్తి సైగలద్వారా ప్రశ్నించింది. దానికి ఆజిమ్‌ తన చేతిని పైకెత్తి చూపుడు వేలితోపాటు మరోవేలిని జతచేసి గాలిలో ఊపాడు. రాజకుమారి ‘సరైన సమాధానం’ అంటూ అభినందించింది. ఇక రెండో ప్రశ్న.. తన చేతిలో ఉన్న ఖడ్గంతో విన్యాసాలు చేసి దీనికి సమాధానమేమిటని సైగచేసింది. దానికి ఆజిమ్‌ తన జేబులో ఉన్న కలాన్ని తీసి ఊపాడు. ‘శభాష్‌’ అని మెచ్చుకుంది సనా. చివరి ప్రశ్నగా రాజదర్బారు మెట్లనుంచి కిందకు దిగి పరుగు పరుగున వెళ్లి తన ఆసనంలో కూర్చుండిపోయింది.

సమాధానంగా ఆజిమ్‌ లేచి నిల్చొని తన గుండెపై చేయి వేసి రాజకుమారి వైపు చూడసాగాడు. అంతే! రాజకుమారి సిగ్గుబిడియాలతో రాజమహలులోకి వెళ్లిపోయింది. చక్రవర్తి ఆజిమ్‌ను పిలిచి ‘‘నువ్వు నా కుమార్తె సనాను నీ సమాధానాలతో ఎలా మెప్పించావు రహస్యమేమిటి’’ అని ఎంతో కుతూహలంగా అడిగాడు. దానికి ఆజిమ్‌ ‘మొదటి ప్రశ్నగా రాజకుమారి తన చూపుడువేలిని పైకెత్తి నువ్వు దేవుడు ఒక్కడేనని నమ్ముతావా? అని అడిగింది. దానికి నేను నా రెండు వేళ్లను పైకెత్తి చూపుతూ అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్‌ (సఅసం) పై నా విశ్వాసముందని చెప్పాను. రెండో ప్రశ్నగా రాకుమారి తన చేతిలో ఖడ్గాన్ని తిప్పుతూ దీనికంటే గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఉందా అని ప్రశ్నించింది. దానికి నేను నా చేతిలో ఉన్న కలాన్ని తీసి దీనికి మించిన గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో లేదు అని సమాధాన పర్చాను. మూడో ప్రశ్నగా రాకుమారి దర్బారు మెట్లు దిగి మళ్లీ తిరిగి వెళ్లి తన కుర్చీలో ఆసీనురాలైంది. అంటే, నేను ఎంతో అలసిపోయాను, కానీ నా దేహంలోని ఏ భాగం అలసిపోలేదు అని అడిగింది. దానికి జవాబుగా నా చేతిని నా గుండెపై వేసి ‘హృదయం’ అని జవాబు చెప్పాను’’ అని సమాధానమిచ్చాడు. ధన సంపద కంటే జ్ఞానసంపద ఎంతో మేలైనది. జ్ఞానం ఎంత వినియోగిస్తే అంతగా పెరుగుతుంది అని చెప్పడమే ఇందులోని అంతరార్థం.
–  ఉమైమా 

మరిన్ని వార్తలు