భూమంత లోతైన సమస్య

22 Jan, 2018 01:10 IST|Sakshi
రచయిత సారనాథ్‌ బెనర్జీ 

♦ కొత్త బంగారం
ఒడిశా జిల్లా తాంబాపుర్లో ఉన్న ‘భారత్‌ కాపర్‌ లిమిటెడ్‌’ సంస్థ ప్రైవేటీకరణ అవడంతో, ఉద్యోగం పోయిన ప్లంబర్‌ గిరీశ్‌ పని వెతుక్కుంటూ దిల్లీ వెళ్తాడు. అక్కడ ఒక వ్యాపారవేత్త గిరీశ్‌ను పనిలో పెట్టుకుంటాడు. పని ఏమిటంటే– వేదాల్లో పేర్కొనబడి, కాల్పనిక భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలన్నింటినీ అంతం చేసి, శాంతి నెలకొలిపే– ఉనికిలో లేని సరస్వతి నదిని కనుక్కునేటంత లోతుగా నేలను తవ్వడం! నదిని వెతికే ప్రక్రియలో– నీళ్ళని దురుపయోగించిన నేరానికి భూమినుండి బహిష్కరించబడిన కల్నల్‌ గంభీర్‌ అవస్థీ, ఫిలిప్పా కారీ జోన్స్‌ కనిపిస్తారతనికి.

సారనాథ్‌ బెనర్జీ రాసిన గ్రాఫిక్‌ నవల ఇది. మన దేశంలో ఇంకా ఎక్కువ గుర్తింపు రాని సాహిత్య ప్రక్రియ. 150 పేజీలున్న ఈ పుస్తకం– మాటల, రేఖా చిత్రాల మిశ్రమం.
నీటి కొరతతో ఎండిపోయిన దిల్లీ పట్టణపు నేపథ్యంతో, మధ్యతరగతి వికాస్‌పురి కాలనీని ఆధారంగా చేసుకుని రాసిన నీటి కష్టాల, హాస్య నవల. డబ్బున్న కుటుంబాలు వసతులున్న గుర్గావ్‌కు తరలిపోగా, మధ్య తరగతివారూ,పేదవారూ నీటికోసం చేసే యుద్ధాలు పరమ భీకరమైనవి. కథనం కథాంశం ఆధారంగా కాక, పాత్రల ఆధారంగా నడుస్తుంది. దిల్లీ స్థానిక సంఘాల పైన రాజకీయ వ్యంగ్యమూ, చమత్కారమైన ఉదాహరణలూ, వ్యాఖ్యానాలూ ఉంటాయి.

పుస్తకం కల్పిత యుద్ధాలు, నదుల గురించినది కనుక, కథనం కల్పిత కథారూపంలో ఉంటుంది. ఉపదేశాలేమీ లేకుండా హాస్యం, వ్యంగ్యంతో జోడించి ఇచ్చిన సమాచారంలా ఉంటుంది. అయితే సమస్యలు మాత్రం నేటి కాలానికి సంబంధించినవి. పక్కనే ఉన్న దిల్లీలో నీటికొరత ఉండగా, గుర్గావ్‌ ధనికుల గేటెడ్‌ ఇళ్ళకి అందే నిరంతర నీటి, విద్యుత్‌ సరఫరా గురించీ, వారికి సామాజిక హోదా కల్పించే గాల్ఫ్‌ ఆట గురించీ చెప్తూ, ‘ఇంత అసమానత్వాన్ని సమాజం ఎంతకాలం సహించగలదు?’ అని ప్రశ్నిస్తారు రచయిత.

మొదటి పేజీలో పాస్‌పోర్ట్‌ ఆఫీసులో క్యూలు కట్టే మధ్య తరగతి కనిపిస్తుంది. ఇందులోని రేడియో ప్రెజెంటర్‌ నవీన్‌ సయానీ పాత్రను ‘బినాకా గీత్‌ మాలా’కు ఒకానొకప్పుడు ప్రస్తుతకర్త అయిన అమీన్‌ సయానీ మీదే మలిచారని స్పష్టంగా తెలుస్తుంది. ఒక హాస్యభరితమైన సన్నివేశంలో–‘‘భారతదేశంలో 80 శాతం పట్టణాలు ‘తమకి నీరూ, విద్యుత్తూ పంపిణీ చేసేది తాము ఉంటున్న బిల్డింగే’’నని నమ్మే గుర్గావ్‌లాగే తయారవుతాయి’ అని రాస్తారు బెనర్జీ.

తిత్తర బిత్తరగా ఉన్న పట్టణ ప్రణాళిక, భూగర్భ జలాన్ని తవ్వి తీయడానికి అవసరం అయిన శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడం, పేదలపైన ప్రైవేటీకరణ ప్రభావం గురించిన రచయిత పరిశీలనలే ఈ నవల. ‘షార్ట్‌ టెర్మిజం’ అన్న మొదటి అధ్యాయం సమాంతర కథాంశం. తాలిబన్‌ నుంచి లైంగిక వేధింపుల వరకూ ఏ సమస్యనీ విడిచిపెట్టరు రచయిత. పాత వాటిని బాగు చేయకుండా కొత్త బిల్డింగులు కట్టడం, చిన్నపాటి అనారోగ్యాలకి కూడా బలమైన యాంటీబయాటిక్స్‌ వాడటం వంటి అంశాలన్నిటినీ ఈ చిన్న పుస్తకంలో కూరడం వల్ల కొంచెం కిక్కిరిసి ఉన్నట్టుగా కనబడినప్పటికీ కథాంశం ఆసక్తికరమైనది.
సారనాథ్‌ బెనర్జీ ఇతర గ్రాఫిక్‌ పుస్తకాలు: ‘కారిడార్‌’ (2004), ‘ద బార్న్‌ అవుల్స్‌ వండ్రస్‌ కేపర్స్‌’ (2007), ‘ద హరప్పా ఫైల్స్‌’ (2011). (తాంబాపుర్లో ఉన్న ‘తాంబా’ కి అర్థం రాగి.) ⇒♦ క్రిష్ణవేణి   

మరిన్ని వార్తలు