రేడియేషన్ చికిత్సలో ఇతర కణాలు దెబ్బతినవు

9 Feb, 2016 22:30 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
 

 నా వయసు 40 ఏళ్లు. కడుపులో మంట, ఆకలి లేకపోవడం, మలబద్ధకం కనిపించాయి. డాక్టర్ గారు , కాలేయం పనితీరులో లోపం ఉందన్నారు. హోమియోలో చికిత్స ఉందా?
 - సునీల్‌కుమార్, విశాఖపట్నం

ప్రస్తుతం తీసుకునే ఆహారపు అలవాట్లు మారడంతో ఆహారంలో కొవ్వులు పేరుకుపోయి కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాలేయం జీర్ణవ్యవస్థకు సంబంధించిన గ్రంథి. ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది. కాలేయం స్రవించే ఈ పదార్థాలు ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరుబిన్, బైలివర్దిన్ అనే రంగు పదార్థాలు ఉండి, కొవ్వులు జీర్ణం కావడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయం చాలా కీలకమైన విధులను నిర్వహిస్తుంది. ఇందులోని 20-25 శాతం పనిచేసినా శరీరంలోని విధులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవుల వల్ల హెపటైటిస్ అనే కాలేయవాపు వ్యాధి రావచ్చు. కాలేయ సమస్యలు ప్రధానంగా హెపటైటిస్‌లోని ఏ, బీ, సీ, డీ, ఈ అనే వైరస్ వల్లనే వస్తుంటాయి. అయితే హెపటైటిస్‌లోని కొన్ని రకాలు మన శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపడమే గాక... ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాలేయానికి హెపటైటిస్, సిర్రోసిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హీమోక్రొమటోసిస్, విల్సన్స్ డిసీజ్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్, గిల్‌బర్ట్ సిండ్రోమ్, పసిరికలు వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

కారణాలు:  కలుషిత ఆహారం తీసుకోవడంవ్యాయామం లేకపోవడం  మత్తుపదార్థాలు, పొగతాగడం వంటి అలవాట్లు  ఇన్ఫెక్షన్  రక్తమార్పిడి వంటివి కాలేయ సమస్యలు రావడానికి కారణాలు

లక్షణాలు:  బరువు తగ్గడం, గాయాలు తొందరగా తగ్గకపోవడం  జీర్ణసమస్యలు  మలబద్ధకం  నీరసం, ఆకలి మందగించడం  సమస్య ముదిరిన కొద్దీ ముక్కు నుంచి రక్తస్రావం, కాళ్లలో వాపు, మందులకు సరిగా స్పందించకపోవడం, జీర్ణాశయంలోని సిరలు వ్యాకోచించడం వంటివి జరుగుతాయి.
 
జాగ్రత్తలు
: కాలేయ సంబంధ వ్యాధులను ప్రాథమికదశలోనే గుర్తిస్తే చాలా తేలికగా నయం చేసుకోవచ్చు  కొవ్వు, ప్రోటీన్లు వంటివి తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి  మద్యం, పొగతాగడం పూర్తిగా మానేయాలి  సమతుల ఆహారం తీసుకోవాలి  రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకునేలా జీవనశైలి మార్చుకోవాలి.
 
హోమియో చికిత్స: ఈ విధానంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచే అద్భుతమైన మందులు ఉన్నాయి. ఆరమ్‌మెట్, కాల్కేరియా అర్స్, బెలడోనా, లైకోపోడియమ్, నేట్రమ్ సల్ఫ్, మెర్క్‌సాల్ వంటి మందులు మంచి ఫలితాలను చూపుతాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. దాంతో కాలేయ సమస్యలను సమూలంగా నయం చేయవచ్చు.
 
డాక్టర్ మురళి అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
డయాబెటిక్‌కౌన్సెలింగ్
 
నా వయసు 65 ఏళ్లు. చాలాకాలంగా డయాబెటిస్ ఉంది. ఇటీవల మా డాక్టర్ షుగర్ ఉన్నవాళ్లు ప్రత్యేకంగా పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పాదాలను సంరక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
 - నవనీతరావు, కొండాపూర్

డయాబెటిస్ రోగులు పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాలకు సంబంధించి ఏ సమస్యలూ రాకుండా పాటించాల్సినవి...  పొగతాగకండి  చెప్పులు లేకుండా అసలు నడవవద్దు. మీ ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి  ప్రతిరోజూ పాదాలను పరిశీలించుకుంటూ ఉండాలి. ఎర్రబారడం, వేడిగా అనిపించడం, పుండ్లు, పగుళ్లు, గాయాలు, షూ వేసుకోవడం వల్ల గానీ లేదా ఇతర అంశాల వల్లగానీ గోళ్ల సమస్యలు లేకుండా చూసుకోండి. పాదం అడుగుభాగాన్ని అద్దంలోనూ పరిశీలించుకోండి. పైన పేర్కొన్న అంశాలు కనిపిస్తాయా అని చూసుకోండి.  మీ షూస్‌లోగానీ లేదా చెప్పుల్లో గానీ రాయిలాంటివి చేరితే తక్షణం తీసేయండి. మీ గోర్లు కాలి కండలోకి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. పాదాల్లో మృదువుగా లేకపోతే... స్పర్శతో దాన్ని తెలుసుకోండి  మీరు షూస్ కొనుక్కోవాలంటే సాయంత్రం పూట తీసుకోండి. దీనివల్ల ఆ సమయానికి పాదాలు పూర్తిగా సాగి ఉంటాయి. అప్పుడు మీకు దొరికే సైజ్ చాలా కరెక్ట్. పాదాలకు చాలా అనువుగా ఉండే షూ లేదా చెప్పులు మాత్రమే తీసుకోండి. పాదరక్షల కింది భాగం కూడా చాలా మృదువైన మెటీరియల్‌తో చేసి ఉండాలి. చెప్పుల పైన ఉన్న కప్పు భాగం కూడా అంతే మృదువుగా ఉండాలి  ఒకసారి వేసుకున్న తర్వాత అదేపనిగా రెండుగంటల పాటు వేసుకొని ఉండకండి  మీరు చెప్పులు వేసుకునే ముందర కాలికి మాయిశ్చరైజర్ పూసుకోండి. పాదం పొడిగా ఉన్నప్పుడే పాదరక్షలు ధరించాలి  మీ పాదాలను హీటింగ్ ప్యాడ్స్, వేడినీటి బుడగలు, రూమ్‌హీటర్ల నుంచి, మంట నుంచి జాగ్రత్తగా చూసుకోండి  కాలికి ఆనెకాయల వంటివి రాకుండా జాగ్రత తీసుకోండి. ఒకవేళ ఉంటే దానికి జిగురుగా ఉండే ప్లాస్టర్స్ వేయకండి  కాలికి ఏవైనా రసాయనాలు అంటకుండా జాగ్రత్త తీసుకోండి. బలమైన యాంటీసెప్టిక్ పదార్థాలు పాదాలకు తగలకుండా జాగ్రత్త తీసుకోండి  మీ బొటనవేలి గోరును కట్ చేసుకునే సమయంలో కాస్త బయటికే ఉండేలా ట్రిమ్ చేసుకోండి      చాలా బిగుతుగా ఉండే స్టాకింగ్స్ వంటివి ధరించవచ్చు. లైట్‌కలర్స్ ఉండే సాక్స్ వేసుకోవాలి. సాక్స్‌లో ఏవైనా చిరుగులు ఉంటే వాటిని ధరించవద్దు.
 పాదాల విషయంలో ఏ సందేహం వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
 
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్
రీహ్యాబిలిటేషన్
కిమ్స్ హాస్పిటల్స్
సికింద్రాబాద్
 
లంగ్ క్యాన్సర్ కౌన్సెలింగ్
 
నా వయసు 40 ఏళ్లు. మార్కెటింగ్ జాబ్‌లో ఉన్నాను. స్మోకింగ్ అలవాటు వల్లే నా ఊపిరితిత్తి (లంగ్)కి క్యాన్సర్ సోకినట్లు ఈమధ్య నిర్వహించిన టెస్ట్‌లలో బయటపడింది. రేడియేషన్ థెరపీ చేయించుకుంటే నయమైపోతుందని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. పైగా ఊపిరి తీసుకున్నప్పుడల్లా లంగ్ కదులుతూ ఉంటుంది కాబట్టి రేడియేషన్ చికిత్స చేస్తున్నప్పుడు లంగ్‌తో పాటు ఇతర కణాలూ దెబ్బతింటాయేమోనని ఆందోళనగా ఉంది. నా అనుమానాలు నన్ను కలవరపెడుతున్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
 - చంద్రశేఖర్, హైదరాబాద్

 లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగతాగే అలవాటు. దీనికి తోడు మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారని అంటున్నారు కాబట్టి ఎక్కువగా తిరగడం వల్ల వాతావరణంలోని వాయు కాలుష్యం కూడా క్యాన్సర్‌కు కారణమై ఉండవచ్చు. మొదటి స్టేజ్ అంటున్నారు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ లంగ్ క్యాన్సర్ సమస్యను రేడియేషన్ థెరపీతో సక్సెస్‌ఫుల్‌గా, సమూలంగా నిర్మూలించవచ్చు. రేడియేషన్ థెరపీలో వచ్చిన అత్యాధునిక చికిత్సలు మంచి ఫలితాలను అందజేస్తున్నాయి. ఆధునిక వైద్య విధానాలవల్ల ఏర్పడే ఇమేజింగ్‌తో లంగ్ కదులుతున్నప్పటికీ క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి, నాశనం చేస్తారు. కేవలం క్యాన్సర్ కణాలపై మాత్రమే ఈ రేడియేషన్ పడుతుంది. అది కూడా లంగ్‌లో ఉన్న క్యాన్సర్ కణాలపైనే పనిచేసేలా లక్ష్యాలను సంధిస్తారు. దాంతో లంగ్ కదులుతూన్నప్పటికీ, కేవలం టార్గెట్‌కు మాత్రమే చికిత్స కిరణాలు తగులుతాయి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మీ లంగ్‌కు గానీ, మీరు భయపడుతున్నట్లు దానికి పరిసరాల్లో ఉండే ఏ ఇతర అవయవాలకు గానీ ఎలాంటి హానీ జరగదు. ఇతర ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ ఉండదు. రేడియేషన్ థెరపీతో కేవలం క్యాన్సర్ ఉన్న భాగమే నశిస్తుంది. మీ ఇతర అవయవాలు రేడియేషన్ ప్రభావానికి లోనుకావు. ఇప్పటివరకూ మీలాంటి కేసుల్లో అంతా పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా నిరభ్యంతరంగా రేడియేషన్ థెరపీ తీసుకోవచ్చు.
 
డాక్టర్ కె. కిరణ్ కుమార్
సీనియర్ రేడియేషన్
ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు