శ్రీదేవిని ఎత్తుకునేవాణ్ణి

26 Feb, 2018 01:05 IST|Sakshi

 రాఘవేంద్రరావు

నివాళి


మీ డైరెక్షన్‌లో 24 సినిమాలు చేసిన హీరోయిన్‌ శ్రీదేవి. ఎన్నో అద్భుత పాత్రల్లో ఆమెను చూపించిన మీకు శ్రీదేవి ‘ఇక లేరు’ అంటే ఎలా అనిపిస్తోంది?
రాఘవేంద్రరావు: నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. శ్రీదేవి సిల్వర్‌ స్క్రీన్‌కి ఎలా వచ్చింది? ఎంత ఎదిగింది? అని స్వయంగా చూశాను. మా నాన్నగారు (కె.ఎస్‌. ప్రకాశ్‌రావు) డైరెక్ట్‌ చేసిన ‘నా తమ్ముడు’ సినిమాలో శ్రీదేవి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసింది. నేను శ్రీదేవిని ఎత్తుకుని షూటింగ్‌ లొకేషన్‌కి తీసుకువెళ్లేవాణ్ణి.

ఆ సినిమాలో తను నెహ్రూ క్యారెక్టర్‌ చేసింది. అంత చిన్న పిల్ల నుంచి ప్రేక్షకుల మనసుల్లో అతిలోక సుందరిగా ఎదిగిన వరకూ శ్రీదేవిని నేను చూశాను. ఒక హీరోయిన్‌తో 24 సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు. 54 ఏళ్ల వయసులోనే శ్రీదేవిని ఆ దేవుడు తీసుకెళ్లినందుకు బాధపడుతున్నా.

శ్రీదేవి ‘నాన్‌ కాంట్రవర్షియల్‌’ హీరోయిన్‌ అనిపించుకున్నారు.. ఆ విషయం గురించి?
శ్రీదేవి కొంచెం రిజర్వ్‌›్డగా ఉండేది. అయితే అది అహంభావం కాదు. తన తత్వం అంతే. కానీ ఎవరినీ నిందించడం, నొప్పించడం తనకు తెలియదు. కలుపుగోలుతనంగా ఉండేది. తన పనేంటో తను చూసుకునేది. అందుకే ఎలాంటి వివాదాలు లేవు. జనరల్‌గా మీకు ఏ హీరోయిన్‌ అంటే ఇష్టం? అని అడిగితే, ఎవరి పేరు చెబితే ఏమొస్తుందోనని భయపడుతుంటాం.

ఒక హీరోయిన్‌ పేరు చెబితే ఇంకో హీరోయిన్‌ బాధపడుతుందేమోననుకుంటాం. కానీ ఎవర్నడిగినా ‘శ్రీదేవి’ పేరును చెబుతారు. తన పేరు చెబితే ఎవరూ ఫీలవ్వరు. అంత మంచి పేరు సంపాదించుకుంది.

ఆలిండియా సూపర్‌ స్టార్‌ అనిపించుకోవడానికి కారణం చెబుతారా?
గ్లామర్‌ ఒక్కటే సరిపోదు. ఆ ఒక్కటితోనే శ్రీదేవి ఈ స్థాయికి రాలేదు. తను మల్టీ టాలెంటెడ్‌. ఎన్ని రకాల పాత్రలు ఇస్తే అన్నీ చేయగల సత్తా తనకుంది. ప్రతి పాత్రకీ వ్యత్యాసం చూపించగలదు. తెలుగులో ‘పదహారేళ్ల వయసులో’తో మొదలుపెట్టి తనతో ఎన్నో సినిమాలు చేశా.

తెలుగు, తమిళ నుంచి జాతీయ.. అంతర్జాతీయ స్థాయి వరకు శ్రీదేవి అధిరోహించని మైలురాయి లేదంటే అతిశయోక్తి కాదు. బాలనటి నుంచి కథానాయిక వరకూ నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి మరణం చాలా బాధాకరం.

మరిన్ని వార్తలు