అప్పుడలా వచ్చావే... ఇప్పుడు రావేం తండ్రీ !

3 Mar, 2019 01:56 IST|Sakshi

‘నీ నగుమోము కనలేని...’ అని త్యాగయ్య కీర్తన చేస్తూ రాముడిని ‘రఘువరా!’ అని సంబోధించారు. అలానే ఎందుకు సంబోధించాల్సి వచ్చింది. ఇక్ష్వాకు వంశ సంభూతా.. అని కూడా పిలవవచ్చు. అలా పిలవలేదు. ఇక్ష్వాకు వంశం రఘు మహారాజు  పుట్టిన తరువాత అది రఘువంశమయి పోయింది. కాళిదాసు రఘువంశ కావ్యంలో...‘‘త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం..’’ అంటారు.రఘుమహారాజు అపారమైన ఐశ్వర్యాన్ని సంపాదించారట. దాచుకోవడానికి కాదు.. త్యాగాయ సంభృతార్థానాం... మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడానికి. నీరు నిలవ ఉంటే దుర్వాసన, సన్యాసి ఒకచోట ఉండిపోతే ప్రమాదం, సంచరిస్తూ ఉండాలి. ధనం ఒకచోట ఉండిపోతే దుర్గుణాలకు ఆలవాలం అవుతుంది. అందుకే అది కదులుతూ ఉండాలి. అందుకని అది దానం చేయడానికి సంపాదించాడు.

‘సత్యాయ మిత భాషిణాం’.. ఎక్కువ మాట్లాడితే అందులో అసత్యం ఉన్న వాక్కేదైనా దొర్లుతుందేమోనని తక్కువ మాట్లాడేవారట. యశసే విజగీషూణాం–అపారమైన దండయాత్రలు చేసి సామ్రాజ్య విస్తరణ చేసింది రక్తపాతం కోసం కాదు,  క్షాత్రధర్మం కనుక రాజ్య విస్తరణ చేసి కీర్తిని సంపాదించడానికట. ప్రజాయై గృహమేధినాం–గృహస్థాశ్రమం వంశాన్ని నిలబెట్టడానికి కావలసిన సంతానం కోసమేనట. ఇటువంటి సుగుణాలు కలిగిన రఘు మహారాజు వంశంలో పుట్టిన నీవు రాఘవుడివై ఆ కీర్తిని మరింత వెలిగేటట్లు చేసావు.సత్యేన లోకాన్‌ జయతి దీనేన్‌ దానేన రాఘవ: గురూన్‌ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాత్రవాన్‌–నీ గుణాలేమిటో తెలుసా రామా! సత్యేన్‌ లోకాన్‌ జయతి.. సత్యంతో లోకాలన్నింటినీ గెలిచావు, సత్యమే రామచంద్రమూర్తి పౌరుషమంటారు వాల్మీకి. దానాలతో దీనులను గెలిచావు. గురువుకు కానుకలు ఇవ్వగలిగినవాడు లేడు కనుక నీవు నీ సేవలతో వారిని గెలిచావు.

కోదండం పట్టుకున్నావా శత్రువనేవాడు లేకుండా చేయగలిగిన వీరత్వం నీది. అటువంటివాడివై రఘువంశంలో కీర్తి పెంచిన రామా! లోకాలను రక్షించడం కోసం కూర్మావతారమెత్తి అంతటి క్లేశాన్ని భరించావే, (మంధర పర్వతాన్ని వీపుమీద మోస్తూ), వరాలను పొందిన రావణుని దుష్ట ప్రవర్తన అణచడం కోసం దశరథమహారాజువారి యాగస్థలిలో ప్రత్యక్షమై ఆయనను తండ్రిగా ఎంచుకుని రాముడిగా జన్మనెత్తి ఎన్నెన్ని కష్టాలకోర్చావు, ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శ్రీ కృష్ణుడిగా గోవర్థన పర్వతాన్ని ఏడురోజులు ఎత్తి పట్టుకుని గోవిందుడివై లోకాల్ని రక్షించావే....ఇన్ని చేసావు కదా... నేనవేవీ అడగలేదు కదా స్వామీ, నేనడిగినదేమిటి... నగుమోము కనలేని నాదుజాలీ తెలిసీ... ఒక్కసారి కనపడమని అడిగాను.

కనపడితే నేనేమయినా అడుగుతాననుకుంటున్నావా... అలా అడిగేవాడిని కానే... అప్పుడు అన్నిసార్లు వచ్చిన వాడివి... ఇప్పుడు రాలేదంటే ఏమనుకోవాలి... నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరయినా నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నారా... నీవారోజున గజేంద్రుడిని రక్షించడానికి ఆగమేఘాలమీద పరుగెడుతుంటే.. వారెవరూ నిన్ను ఆపలేదు కదా... అందువల్ల వారలా ఆపేవారు కూడా కాదు.. పైగా సంతోషంగా నీవెంట వచ్చేవాళ్ళే కదా... అయినా నా కోరికేమిటి? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లితో కలిసి కోదండం చేతపట్టుకుని, లక్ష్మణుడు పక్కన నిలబడితే, హనుమ నీ పాదాల వద్ద కూర్చుని సేవిస్తుంటే... చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా నావంక చూస్తే.. నీ దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులతో తనివితీరా తాగేసి ఆ ఆనందం పట్టలేక నేను నువ్వయిపోయి నేను నీలో కలిసిపోవాలి. అందుకని నా ఆర్తిని గమనించి రావేం తండ్రీ... అని వేడుకుంటున్నాడు. గీతం, సంగీతం, ఆర్తి, భక్తి...అన్నీ కలిసిపోయిన దృశ్య ఆవిష్కరణ అది.

మరిన్ని వార్తలు