అనుగ్రహం

2 Jun, 2019 00:39 IST|Sakshi

చెట్టు నీడ / రంజాన్‌ కాంతులు

అది.. సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన ఇస్లామీయ చక్రవర్తి హజ్రత్‌ ఉమర్‌ షారుఖ్‌ (ర) పరిపాలనా కాలం. రెండు మూడు సంవత్సరాలుగా వర్షాలు కురియక రాజ్యంలో ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. చక్రవర్తి వెంటనే రాజ్యంలోని వ్యాపారస్తులందరిని సమావేశపరిచి, మీరు కోరినంత ధర ఇస్తాను. మీ దగ్గర ఉన్న ధాన్యం మొత్తం తీసుకుని రమ్మని చెప్పాడు.‘‘ఓ చక్రవర్తి! ఇది నిజంగా మాకు మంచి తరుణం. ఒకటికి పది రెట్లు అధికంగా లాభం పొందే అవకాశం. కాని మా దౌర్భాగ్యం మేము మా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం హజ్రత్‌ ఉస్మాన్‌ (ర)కి ముందే అమ్మేసాం’’ అన్నారు.

చక్రవర్తి హజ్రత్‌ ఉమర్‌ షారుఖ్‌ (ర), హజ్రత్‌ ఉస్మాన్‌ (ర) దగ్గరకు వెళ్లి.. ‘‘ఓ ఉస్మాన్‌ (ర), రాజ్యంలో కరువు తాండవిస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా. మీ దగ్గర ఉన్న ధాన్యం మాకు ఇస్తే దానికి బదులుగా మీరు కోరినంత విలువ ఇస్తాను’’ అన్నారు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు నేను నా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం ఈ ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేని ధరకు అమ్మి వేసాను’’ అని అన్నాడు.‘అయ్యో! నా ప్రజలకు సహాయం చేయలేకపోతున్నానే’ అన్న నిరాశ, నిస్పృహలతో అక్కడి నుండి వెళ్తూ, వెళ్తూ చెట్టు నీడన కూలబడ్డాడు హజ్రత్‌ ఉమర్‌.కాసేపటికి తరువాత జనాలు బస్తాల కొద్దీ ధాన్యం మొసుకొని వెళ్లడం గమనించి, ఎంత ధరకైనా కొందామన్నా లభించని ధాన్యం వీళ్లకు ఎలా లభించిందబ్బా, అని వాకబు చేయగా, ఉస్మాన్‌ (ర) ఉచితంగా పంచుతున్నాడని తెలిసింది.

హజ్రత్‌ ఉస్మాన్‌ (ర) దగ్గరకు వెళ్లి, ‘‘ఓ ఉస్మాన్‌! నేను నువ్వు కోరినంత ధర ఇస్తాను అన్నా అమ్మను అన్నావు. మరి ఇదేమిటి ఇలా ఉచితంగా పంచుతున్నావు?’’ అని అడిగాడు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు! మీరు మహ అంటే వంద రెట్లు అధికంగా ఇస్తారేమో. కాని  పరలోకంలో నా ప్రభువు ఇచ్చినంత ఇవ్వలేరుగా. అందుకే నేను నాకు ఈ అనుగ్రహం ప్రసాదించిందిన అల్లాహ్‌ కే తిరిగి అమ్మేసాను’’ అన్నాడు.యదార్థం ఏమిటంటే, విశ్వాసుల నుండి అల్లాహ్‌ వారి ప్రాణాలనూ, వారి సిరి సంపదలనూ స్వర్గానికి బదులుగా కొన్నాడు. మరీ ముఖ్యంగా రంజాన్‌ మాసంలో అల్లాహ్‌ మార్గంలో చేసే ప్రతి కర్మకు మిగతా మాసాల్లో చేసే కర్మలకన్నా 70 రెట్లు అధికంగా దైవం ప్రసాదిస్తాడని ప్రవక్త (స) తెలిపారు.
 – షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌

మరిన్ని వార్తలు