భర్తమాంద్యం

11 Apr, 2019 02:34 IST|Sakshi

పారిపోయేవాడు పలాయనవాది అవుతాడు.తప్పించుకు తిరుగువాడు ధన్యుడు ఏమాత్రం కాడు.బరువెత్తని భుజం భుజం కాదు.ఎదుటివాళ్ల మీద తోసేసే చెయ్యి చెయ్యి కాదు.చెరిసగం అనుకోనివాడు భర్త కాడు.బిడ్డకు కష్టం వస్తే కడుపులో పెట్టుకోని వాడు తండ్రి కాడు.ఈ కాని వాణ్ణి అయినవాడని ఎందుకనుకోవాలి?

‘అమ్మా... నేను డిగ్రీ పాసయ్యాను’ సినిమాల్లో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లితో చెప్తే తల్లి చెమర్చిన కళ్లతో కొడుకును చూస్తుంది. ఆ తర్వాత భర్త ఫొటో దగ్గరకు వెళ్లి ‘చూశారా... మీ సుపుత్రుడు  ఎంతటి ప్రయోజకుడయ్యాడో’ అని కళ్లు తడుచుకుంటుంది.ఈ కథలో కూడా ఒక అబ్బాయి ‘అమ్మా... నేను డిగ్రీ పాసయ్యాను’ అని వచ్చాడు.ఆ తల్లి కళ్లు కూడా చెమర్చాయి.ఆ తల్లి గుండె కూడా ఉప్పొంగింది.కాని ఆ తల్లి తన భర్త దగ్గరకు వెళ్లి ‘చూశారా... మీ కన్నకొడుకు ఎంతటి ప్రయోజకుడయ్యాడో’ అని అనలేదు.‘నా జీవితాన్ని ధారబోశాను. కాని మీరు మాత్రం మీ జీవితాన్ని ఏమీ మిస్‌ కాలేదు. మీరంటే అసహ్యంగా ఉంది’ అనంది.కొడుకు పాసయ్యాక ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉండాలి.

కాని ఆ ఇంట్లో నరకప్రాయమైన పరిస్థితి అలుముకుంది.ఒక ఉత్పాతం సంభవించినప్పుడు దానికి ఇరువురు వ్యక్తులు బాధ్యులు అయినప్పుడు దానిని చెరి సగం పంచుకోవాలి. కాని మగ పెత్తనం ఉండే ఈ సమాజంలో అలా జరగదు. మగాళ్లు తప్పించుకు తిరిగే వీలున్న ఈ వ్యవస్థలో అలా జరగదు.రెండేళ్ల వయసు వచ్చేటప్పటికి రాజాలో ఏదో తేడా ఉన్నట్టు మాలతికి అర్థమైంది. అందరు పిల్లల్లా కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం లేదు. అందరు పిల్లల్లా ఏడవడం లేదు. అందరు పిల్లల్లా చురుగ్గా ఉండటం లేదు. భర్త వినోద్‌కు చెప్పింది. ఇద్దరూ డాక్టర్‌ దగ్గరకు వెళ్లారు.‘మీ అబ్బాయిలో ఆటిజమ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి’ అన్నాడు డాక్టర్‌.‘అంటే ఎన్నిరోజుల్లో తగ్గుతాయి డాక్టర్‌’ మాలతి ఆశగా అడిగింది.డాక్టర్‌ కొంచెం ఇబ్బందిగా, మెల్లగా చెప్పాడు–‘తగ్గవు. జీవితాంతం మీ అబ్బాయి ఇలాగే ఉంటాడు. మీరు ఆ సత్యాన్ని గ్రహించాలి. అంటే మీ అబ్బాయి అందరు అబ్బాయిల వంటి వాడు కాదు. ప్రత్యేకంగా చూడాల్సిన అబ్బాయి. ఎవరో ఒకరు అనుక్షణం వెంట ఉండాల్సిన అబ్బాయి’ అన్నాడు డాక్టర్‌.ఒక దురదృష్టకరమైన వార్త. వచ్చిపడిన కఠినమైన బండరాయి.

దానిని మోయాల్సిన భార్యాభర్తలు ఎదురుగా ఉన్నారు.కాని బయటకు వచ్చాక భర్త అన్నాడు– ‘మన రాత అలా ఉంది. ఇక వాణ్ణి నువ్వే చూసుకోవాలి. వాణ్ణి అలాంటి స్థితిలో నేను చూడలేదు. వాడితో ఇంటరాక్ట్‌ కాలేను. కాని మీ ఇద్దరికీ ఏం కావాలన్నా తెచ్చి పెడతాను. నన్ను మాత్రం ఈ వ్యవహారం నుంచి దూరం పెట్టు’ ఎటో చూస్తూ అన్నాడు.అతడు తండ్రి. అతడికి గర్భాశయం లేదు. అతడికి వేవిళ్లు లేవు. అతడికి నెలలు నిండటం తెలియదు. లోపల తిరుగాడే బిడ్డ కాలితో తన్నడం తెలియదు. కడుపు నుంచి బయట పడ్డాక తొలి ఏడుపు వింటే గుండెలో ఎటువంటి ఆనందం ఉప్పొంగుతుందో ఎటువంటి పాశం జన్మకు సరిపడా పెనవేసుకుంటుందో తెలియదు. అందుకే ఆ మాట అనగలిగాడు. కాని మాలతికి ఇవన్నీ ఉన్నాయి. తన బిడ్డ తనకు పుట్టిన బిడ్డ. కాని ఆ బిడ్డను అందరు తల్లుల్లా పెంచకుండా భరిస్తూ పెంచాలి. పెంచుతూ భరించాలి. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. మూడు రోజులు కాదు... కొసాకు. చివరికంటా.రాజాకు ఏడెనిమిదేళ్లు వచ్చేసరికి అతని అనారోగ్యం కంటే కూడా ఆ తల్లికి ఎక్కువ భారంగా అనిపించింది అవమానం.

‘నీ కొడుకు దేనికీ పనికి రాడు’... ‘వాడిక అలా మూలన పడుండాల్సిందే’... ‘వాడు పిచ్చోడైపోతాడు చూస్తూ ఉండు’.... మాలతికి మొదట ఈ మాటలు చాలా కష్టంగా అనిపించాయి. ‘నా కొడుకు దేనికీ పనికి రాడా?’ ఆమెకు పట్టుదల వచ్చింది. వాడు ఎలాగోలా ఏదో ఒక చదువు చదివి ఒక డిగ్రీని సంపాదించలేడా?‘సంపాదించవచ్చు. కాని మనం చాలా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టాలి’ అన్నాడు డాక్టర్‌.మాలతి బాగా చదువుకుంది. అప్పటి వరకూ ఆమె అందరు స్త్రీల వలే ఎవేవో కలలు ఉన్న స్త్రీ. ఆమెకు ఉద్యోగం ఉంది. అప్పటి వరకూ ఆమె అందరిలానే ఒక ఉద్యోగి. ఆమె ఒకరికి భార్య. అప్పటివరకూ ఆమెకు కూడా అందరు భార్యలకు లాగే ఏవో కొన్ని ఊసులు కలిగేవి. అన్నీ వదిలేసింది. కొడుకే సర్వస్వం.‘నా కొడుకును తీర్చిదిద్దుతాను చూడండి’ అని భర్తతో అంది.‘ప్రాణాన్ని కష్టపెట్టుకోకు మాలతి. వాడి అన్నం వాడు తిని వాడి బాత్రూమ్‌ అవసరాలకు వాడు వెళ్లగలిగితే చాలు. మనకు డబ్బుకు ఇబ్బంది లేనందుకు దేవుడికి దండం పెట్టుకుందాం’ అన్నాడు భర్త.కాని మాలతి వాణ్ణి స్కూలుకు పంపింది. స్కూలు నుంచి వచ్చాక చదివించింది. మర్చిపోతే మళ్లీ చదివించింది.

వాడికన్నా ఎక్కువ తనే చదివింది. కాని వాడికి నేర్పించగలిగింది.కాని అసలు సమస్య వాడికి పదిహేను పదహారేళ్ల వయసప్పుడు వచ్చింది.‘డాక్టర్‌... ఒక తల్లిగా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వీడి ప్రవర్తన మారింది. ఆడవాళ్లు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటివి మావారు వచ్చి చెప్తే బాగుంటుంది. కాని ఆయన ఇలాంటి వాటికి కూడా రావడం లేదు’ అని బాధగా అంది సైకియాట్రిస్ట్‌తో.రాజాకు ఉన్నది ఆటిజమ్‌ ఆస్పర్జస్‌ అనే డిజార్డర్‌. ఇలాంటి డిజార్డర్‌ ఉన్న పిల్లలు టీనేజ్‌లో లైంగిక పరంగా అదుపులేని చర్యలు చేస్తారు.‘ఈ టైమ్‌లోనే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాడి ధ్యాస అనుక్షణం మళ్లించాలి’ అని సైకియాట్రిస్ట్‌ మందులు ఇచ్చాడు. అంతే కాదు రాజాను బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్‌ వంటి ఆటల్లో పెట్టమన్నాడు. మాలతి ప్రతి రోజూ రాజాను ఆటల్లో పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఏం వండుతోందో, ఏం తింటోందో, ఎలా ఉంటుందో ఏమీ తెలియదు.రాజా ఇంటర్‌ పాసయ్యాడు.రాజా కోసం తాను హైదరాబాద్‌ వదిలి వైజాగ్‌లో రూమ్‌ తీసుకొని అక్కడే వాడిని బిబిఏ డిగ్రీ కోర్సులో చేర్చింది.

రాజాలో కూడా క్రమంగా మానసిక ఎదుగుదల మెరుగుపడింది. అతడు చదువు మీద శ్రద్ధ పెట్టి డిగ్రీ పూర్తి చేయగలిగాడు. కాలేజీ వారు కూడా స్పెషల్‌ స్టూడెంట్‌గా ట్రీట్‌ చేసి పూర్తి సహకారం అందించడం వల్ల ఇది సాధ్యమైంది.ఏ లోకమైతే తన కడుపున పుట్టిన పిల్లవాడు పనికిరాడని అందో ఆ లోకం ముందు మాలతి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేసి నిలబెట్టింది. ఇక వాడు ఇంట్లో మూలన పడి ఉండడు. ఏదో ఒక పని చేసుకుంటాడు. డబ్బు కోసం కాదు. గౌరవం కోసం.కాని ఈ విజయం లోకం కోసమేనా? భర్త కోసం కూడా?ఇప్పుడు తాను భర్తకు సమాధానం చెప్పాలి.‘చూడండి. నాకెప్పుడైతే రాజా పుట్టాడో వాడికి ఎప్పుడైతే ఆటిజమ్‌ అని తేలిందో ఆ రోజు నుంచి నేను వినోద్‌ భార్య అనే గుర్తింపు నుంచి రాజా తల్లి అనే గుర్తింపుకు మారిపోయాను. మీరు కూడా మీ కొడుక్కు తల్లిగా ఇంట్లో ఉంచారు తప్ప మీ భార్యగా కాదు. అసలు నన్ను భార్యగానే మర్చిపోయారు.

ఇన్నాళ్లు ఒక లక్ష్యం కోసం ఉన్నాను. ఇక నా కొడుక్కు, నాకు మీరు అక్కర్లేదు. మేం ఇల్లు విడిచి వెళ్లిపోతున్నాం’వాళ్లను ఆపడానికి ఆగమనడానికి వినోద్‌ దగ్గర వాదన లేదు.రాజా, మాలతి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.కాని తాను ఎదిగి డిగ్రీ తెచ్చుకొని సంతోషంగా ఉన్న సమయంలో తల్లిదండ్రులు తన కారణాన విడిపోవడం రాజాకు మింగుడు పడలేదు. సడన్‌గా అతను డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఆటిజమ్‌ డిజార్డర్‌లో ఉన్న పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్లడం అంత మంచిది కాదు.సైకియాట్రిస్ట్‌ ఇప్పుడు చేయాల్సిన వైద్యం రాజాకు కాక తల్లిదండ్రులకు అని గ్రహించాడు.‘చూడండి. మీరిరువురూ కొన్ని సంవత్సరాలుగా ఒకరిని మరొకరు నెగెటివ్‌ దృష్టితో చూస్తూ దూరం అయి ఉన్నారు.

ఇలాంటి కొడుకును ఇచ్చిందని మీరూ, ఇలాంటి కొడుక్కు అండగా నిలవలేదని ఈమె బ్లేమ్‌ చేసుకుంటే చేదు మాత్రమే మిగులుతుంది. మీరు ఒకరిలో ఒకరు పాజిటివ్‌ అంశాలు చూడటం మొదలెట్టండి. ఆమె పట్టుదలగా కొడుకును పెంచుకోవడం మీరు చూడండి. మీ పట్ల ప్రేమగా లేకపోయినా బాధ్యతగా ఉన్నాడన్న సంగతిని మీ భర్తలో చూడండి.పెళ్లి సమయంలో మీరిరువురూ ఎంతగా ఇష్టపడ్డారో గుర్తు చేసుకోండి. మీ అబ్బాయి అడ్డంకులు దాటి ఒక స్థితికి చేరుకున్నాక ముగ్గురూ కలిసి కొత్త జీవితాన్ని మొదలెట్టాలని గ్రహించండి’ అని చెప్పాల్సి వచ్చింది.అన్నీ సరిగా ఉన్నపుడు కాపురం ఎవరైనా చేస్తారు. కాని కష్టాన్ని దాటి ముందుకు నడిచినప్పుడే ఆ ఇల్లు ఆ ఇంటి బంధాలు మరింత అర్థవంతం స్ఫూర్తిమంతం అవుతాయి.మాలతి, వినోద్‌ ఇప్పుడు తన కొడుకు విషయంలో మరింత స్ఫూర్తివంతంగా జీవితం గడుపుతున్నారు.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు