పక్షులకు రక్షకులు ఎడారిలో ఫారెస్ట్‌ గార్డు ఉద్యోగం

6 Oct, 2019 02:58 IST|Sakshi

స్త్రీ శక్తి / టఫ్‌ జాబ్‌

ఇద్దరమ్మాయిలు.. ఇద్దరూ పాతికేళ్ల వయసు వాళ్లే. వాళ్లు ఏదైనా ఘనత సాధించారేమో, ఆ గొప్ప పని గురించి ఇక్కడ రాశారేమో అనుకుంటే పొరపాటే. అయితే వాళ్లు ఏమీ సాధించలేదా అంటే... ఆ మాట అస్సలే అనలేరు. ఆ అమ్మాయిలిద్దరూ రాజస్థాన్‌ సుదాసారీ అడవుల్లో ఫారెస్ట్‌ గార్డు ఉద్యోగం చేస్తున్నారు! అడవంటే మనకు తెలిసినట్లు చీమలు దూరని చిట్టడవులు, కాకులు దూరని కారడవులు కావవి. ఎడారి అడవి. ఎక్కడో ఒకచోట తుప్పలు తప్ప పచ్చటి ఆకులు కూడా కనిపించవు. ఆ అడవుల్లో ఎండాకాలంలో యాభై డిగ్రీల ఉష్ణోగ్రతను ఎదుర్కొంటూ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ల వయసు, కష్టాలు, ఉద్యోగాలే కాదు, వారి పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఒకమ్మాయి పేరు పుష్పా శెకావతి, మరో అమ్మాయి పుస్తా పవార్‌.

ఇద్దరూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌లు. పుష్ప స్వస్థలం రాజస్థాన్‌లోని నగార్‌ జిల్లా కసుంబీ. ఆమె భర్త వీరేందర్‌ ప్రతాప్‌ శెకావత్‌ ఐదేళ్ల కిందట యాక్సిడెంట్‌లో మరణించాడు. కొంతకాలానికి ఫారెస్ట్‌ గార్డు ఉద్యోగం వచ్చింది. పిల్లాడిని దగ్గర ఉంచుకుని కోడలిని ఉద్యోగానికి పంపించారు అత్తగారు. రోజూ సొంతూరికి వెళ్లి వచ్చే పరిస్థితి లేదామెకు. అడవిలో ఉద్యోగం చేసుకుంటూ రెండు రోజులకోసారి ఇంటికి వెళ్లి కొడుకును చూసుకుంటోంది. పుస్తా పవార్‌ది పోఖ్రాన్‌. ఆమె పరిస్థితి కొద్దిగా వేరు. ఆమెకు భవిష్యత్తు మీద ఉన్నతమైన ఆలోచనలున్నాయి. వాటిని నిజం చేసుకోవాలంటే ఈ మాత్రం త్యాగం తప్పదనుకుంది. కుటుంబానికి దూరంగా అడవిలో ఉద్యోగం చేసుకుంటూ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతోంది. పుస్తా ప్రోత్సాహంతో పుష్ప కూడా పరీక్షలకు సిద్ధమైంది.

వాళ్లిద్దరికీ అడవిలో పాలులేని టీతో రోజు మొదలవుతుంది. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన చిన్న మట్టి ఇంటిలో నివాసం. వాటర్‌ ట్యాంకర్‌ తెచ్చిన నీటిని అడవిలో అక్కడక్కడా కట్టిన సిమెంట్‌ తొట్టెల్లో నింపడం, ఆ నీటిని బకెట్‌లతో మోసుకెళ్లి పక్షులకు అందుబాటులో ఉంచడం వారి రోజు వారీ పని. ‘నీటిని మోసుకుంటూ ఇంతింత దూరం నడవడం కష్టంగా అనిపించలేదా’ అని ఎవరైనా అడిగితే బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన వాళ్లం. చేతిలో ఉన్న నీటిని పక్షులకు అందించడం కష్టమెలా అవుతుంది’ అంటారు. ‘ఈ ఉద్యోగాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం’ అని కూడా అంటారు వాళ్లిద్దరూ.
 మంజీర

కాపలా సరిహద్దు
సుదాసారి డెజర్ట్‌ నేషనల్‌ పార్క్‌... రాజస్థాన్‌ పశ్చిమ ప్రాంతం. జై సల్మీర్‌కు అరవై కిలోమీటర్ల దూరాన దేశ సరిహద్దుకు దగ్గరగా ఉంది. సరిహద్దు దాటితే పాకిస్థాన్‌. ఈ అడవిలో అంతరించిపోతున్న పక్షి జాతులను సంరక్షిస్తున్నారు. గోదావాన్‌ పక్షిని సంరక్షించే బాధ్యత ఈ అమ్మాయిలకు అప్పగించారు. ఆ పక్షితోపాటు అడవిలోని పక్షి జాతులకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి అపాయం కలగకుండా చూడడంతోపాటు సమీప గ్రామాల ప్రజల దాడుల నుంచి రక్షించడం కూడా వాళ్ల ఉద్యోగమే. పశువులకు మేత నెపంతో అడవిలోకి వచ్చిన వాళ్లు పక్షుల వేటకు పాల్పడుతుండడంతో ఈ అమ్మాయిలిద్దరూ గ్రామస్థుల మీద ఓ కన్నేసి ఉంచారు. దాంతో సమీప గ్రామస్థులు కూడా వీళ్లతో మానవసంబంధాలు పెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. కనీసం వాళ్ల దగ్గర పాలు కొనుక్కోవాలన్నా కూడా సహకరించకుండా వీళ్లను బహిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిలు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. పక్షులను కాపాడుతున్నారు.

 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా