తలైవా కోసం

11 Jan, 2020 02:35 IST|Sakshi

చిత్రం చెప్పిన సంగతి

తమిళనాడులో సినిమా హీరోల అభిమానులు ఎప్పుడూ సందడి సృష్టిస్తూనే ఉంటారు. వారు ఖుష్బూకు గుడులు కట్టారు. నమిత పేరుతో రక్తదానాలు చేశారు. ఇక శింబు అభిమానులైతే అతని సినిమా విడుదల సందర్భంగా పాల వ్యాన్లలో నుంచి పాల ప్యాకెట్లు దొంగిలిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెద్ద పెద్ద కటౌట్లకు పాలాభిషేకం చేయాలంటే అవసరమైన పాల కోసం అభిమానులు ఇలా తెగబడుతున్నారని పోలీసులకు కంప్లయింట్‌లు వెళ్లాయి. అభిమానం కోసం పాలు వేస్ట్‌ చేయవద్దని పెద్ద హీరోలు కొంతమంది అభిమానులకు హితవు చెప్పారు. అందుకే ఈసారి ‘దర్బార్‌’ విడుదల సందర్భంగా రజనీకాంత్‌ అభిమానులు కొంత ట్రెండ్‌కు వెళ్లారు. చెన్నైలో ‘దర్బార్‌’ విడుదలైన థియేటర్లలో చెరకు గడలు పంచారు.

నోరు తీపి చేసుకోండి... సినిమా హిట్‌ అయ్యిందన్న తీపి కబురు చెప్పండి అంటూ చాలామంది ప్రేక్షకులకు చెరకు గడలు పంచారు. ఇలా ఉంటే మధురైలోని అభిమానులు మరో అడుగు ముందుకేసి ‘దర్బార్‌’ రిలీజ్‌ సంద్భంగా స్థానిక అమ్మన్‌ కోవెలలో ప్రత్యేక పూజలు చేశారు.పదిహేను రోజులు ఉపవాసాలు ఉండి ‘మన్‌సోరు’ మొక్కు చెల్లించుకున్నారు. మన్‌సోరు అంటే విస్తరి లేకుండా నేల మీద భోజనం చేయడం. 69 సంవత్సరాల రజనీకాంత్‌ 167వ సినిమాగా ‘దర్బార్‌’లో నటించాడు. దర్శకుడు మురగదాస్‌తో కలిసి తొలిసారిగా పని చేయడం వల్ల ఫ్యాన్స్‌లో చాలా ఆసక్తి ఉంది. అంతేకాదు ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావాల్సిన అవసరం కూడా వారికి చాలా ఉంది. దీనికి కారణం ‘రోబో’ తర్వాత రజనీకాంత్‌ సరైన సూపర్‌హిట్‌ పడలేదు. యానిమేటెడ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కొచ్చడయాన్‌’ తీవ్రంగా నిరాశపరిచింది.

‘లింగ’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ‘కబాలి’ ప్రశంసలు పొందినా నిజమైన మాస్‌ ఫిల్మ్‌గా నిలవలేక పోయింది. ‘కాలా’ కూడా అంతే. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న శంకర్‌ ‘2.0’ రజనీకాంత్‌ చేసేందుకు పెద్దగా అవకాశం ఇవ్వలేక పోయింది. పెట్టా ఫస్ట్‌ హాఫ్‌ చాలా బాగున్నా సెకండ్‌ హాఫ్‌ నిలబడలేకపోయింది. వీటన్నింటి నేపధ్యంలో ‘దర్బార్‌’ హిట్‌ కావడం గురించి అభిమానులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ముంబై పోలీస్‌ కమిషనర్‌గా రజనీకాంత్‌ ఈ సినిమాలో నటించాడు. విలన్‌ సునీల్‌ శెట్టి. నయనతార హీరోయిన్‌. సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళంలో ఈనెల 9న ఈ సినిమా విడుదలైంది. తమిళనాడులో ప్రభుత్వం నాలుగు రోజుల పాటు అదనంగా ఒక షో వేసుకునే అనుమతి ఇచ్చింది. వినవస్తున్న వార్తలను బట్టి ఈ సినిమా ఫ్యాన్స్‌ను సంతోషపెట్టిందనే అంటున్నారు.

మరిన్ని వార్తలు