సర్వరక్షా బంధనం

6 Aug, 2017 00:04 IST|Sakshi
సర్వరక్షా బంధనం

సోమవారం రక్షాపూర్ణిమ పర్వదినం

శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.

అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి కట్టదలిచామో వారి ముంజేతికి కడుతూ– ఆ రక్షిక మీద అక్షతలని వేసి, రక్షాబంధనాన్ని కట్టాలి. రక్షాబంధనం కట్టించుకున్న వారు వీరికి అన్ని విధాలా అండగా నిలబడాలి. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి అండగా నిలవాలి. తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడాలని, భగవంతుడు ఈ సంవత్సరమంతా  రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వస్తారు ఆడపడచులు. తమ సోదరుల చేతికి రక్షాబంధనం కట్టి, వారికి తీపి తినిపిస్తారు. అప్పుడు ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయ . అయితే రక్షాబంధనాలను వెండివి, బంగారువి లేదా విలువైనవి కట్టాలని లేదు. సంప్రదాయ రక్షాబంధనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో సరిపెట్టకూడదు. దాని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది.

మరిన్ని వార్తలు