రాఖింగ్‌ బ్రో

26 Aug, 2018 01:11 IST|Sakshi

రెహమాన్‌.. రెహమాన్‌ సిస్టర్‌
కేటీఆర్‌..
కేటీఆర్‌ సిస్టర్‌
వరుణ్‌ తేజ్‌.. వరుణ్‌ తేజ్‌ సిస్టర్‌

ఆకాశ్‌.. ఆకాశ్‌ సిస్టర్‌
నలుగురు సిస్టర్స్‌ కట్టిన నాలుగు రాఖీలివి!
నలుగురు బ్రదర్స్‌ ‘అనురాగ బంధన్‌’ లివి!
అల్లరికి అనుపల్లవి.. చెల్లెలు.   చెల్లెలి హరివిల్లు.. అన్నయ్య.
ఎక్కడైనా ఇంతే కదా. కొత్త ఉందా ఇక్కడేమైనా?! ఎస్‌.. ఉంది.
రెహమాన్‌ అంటే మ్యూజిక్కే కదా? ప్రేమను పంచే మ్యాజిక్‌ కూడా ఉందట! కేటీఆర్‌ అంటే... ఐటీ స్టార్‌ కదా? పిల్లల మధ్య ట్వింకిల్‌ ట్వింకిల్‌ స్టార్‌ అట! వరుణ్‌ తేజ్‌ అంటే.. ఆరడుగులు కదా? ఆటపట్టిస్తే ఇప్పటికీ చిన్నపిల్లాడేనట! ఆకాశ్‌ అంటే.. పోరడు కదా? చెల్లి విషయంలో పెద్దోడు అట! చెల్లెళ్లనడిగి.. ‘సాక్షి’ ఈ సీక్రెట్‌లన్నీ బ్రేక్‌ చేసింది. ‘రాఖి’ంగ్‌ ఇంటర్వ్యూలు చేసుకొచ్చింది.


తమ్ముడు కాదు నాన్న
రాఖీ దక్షిణాది సంప్రదాయం కాకపోయినా మెల్లిగా మనం అడాప్ట్‌ చేసుకున్నాం. కుల, మతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అక్కాతమ్ముళ్ల (రైహానా, ఏఆర్‌ రెహమాన్‌) అనుబంధం గురించి తెలుసుకోవాలని ఉంది...

రైహానా: మేం ఎప్పుడూ రాఖీ పండగ చేసుకోలేదు. తమ్ముడికి రాఖీ కట్టింది లేదు. అయితే ‘నీకు ఎప్పుడూ తోడుగా నేను ఉన్నా’ అని చెప్పే పండగ కాబట్టి మాకు తోడుగా ఉన్న మా తమ్ముడి గురించి ఇష్టంగా మాట్లాడాలని ఉంది. తమ్ముడు అనేకంటే రెహమాన్‌ని ‘మా నాన్న’ అంటే బాగుంటుందేమో.

తమ్ముడు ఎంతో బాధ్యతగా ఉంటేనే ‘నాన్న’ అనాలనిపిస్తుంది. మీ తోడబుట్టినవాళ్లు ఎంతమంది?
నేను పెద్దదాన్ని. నాకు, రెహమాన్‌కి ఒక ఏడాది తేడా. ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లెలు నాకన్నా తొమ్మిదేళ్లు, మరో చెల్లెలు ఐదేళ్లు చిన్న. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన పోయాక మాకు ‘బ్రెడ్‌ అండ్‌ బటర్‌’ ఇచ్చింది మా తమ్ముడే. అందుకే ‘నాన్న’ అన్నాను. తోడబుట్టినవాడు ఇలా ఉంటే ఆ అక్కాచెల్లెళ్లు ఎంత ‘ప్రొటెక్టివ్‌’గా ఫీలవుతారో మాటల్లో చెప్పక్కర్లేదు.

చిన్నప్పుడు రెహమాన్‌గారికి మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కొనివ్వడానికి మీ అమ్మగారు నగలు అమ్మేవారట.
అది నిజమే. రెహమాన్‌కి మార్కెట్లో ఏ కొత్త మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ వచ్చినా కొనుక్కోవాలని ఉండేది. అది కావాల్సిందే అని మొండి పట్టు పట్టేవాడు. రెండు మూడు రోజులు అన్నం కూడా మానేసేవాడు. చివరికి అమ్మ నగలు అమ్మి కొనిచ్చేది. రెహమాన్‌ కూడా చాలా బాధ్యతగా ఉండేవాడు. దాని మీద బాగా ప్రాక్టీస్‌ చేసేవాడు.

టీనేజ్‌లోనే మీ తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టారు. అప్పుడు తనకోసం ఏమైనా దాచుకునేవారా?
14, 15 ఏళ్ల వయసుప్పుడే సంపాదన మొదలైపోయింది. దాదాపు ఖాళీగా ఉండేవాడు కాదు. చాలామంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ దగ్గర వర్క్‌ చేసేవాడు. రోజుకి వెయ్యి రూపాయలు దాకా వచ్చేవి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అమ్మకిచ్చేసేవాడు. ఆ తర్వాత లెక్కలు కూడా అడిగేవాడు కాదు. ఓ రెండు మూడేళ్ల క్రితం వరకూ అంతే. ఇప్పుడు మా మరదలు (రెహమాన్‌ భార్య) చూసుకుంటోంది.

ఇప్పుడు రెహమాన్‌గారు గంభీరంగా కనిపిస్తారు. చిన్నప్పుడు తన సిస్టర్స్‌తో ఎలా ఉండేవారు?
నాకు, తనకీ వయసు వ్యత్యాసం ఏడాదే కాబట్టి మేం ఇద్దరం ఎక్కువగా ఆడుకునేవాళ్లం. క్యారమ్స్‌ బాగా ఆడేవాళ్లం. పిల్లలందరిలానే గొడవలు పడేవాళ్లం. అయితే జీవితం తెలిసే కొద్దీ ఆ అల్లరంతా పోయింది.  అయితే చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండేవాడు. మెల్లిగా రెహమాన్‌ బ్యూటిఫుల్‌ పర్సన్‌గా మారడం చూశాను. రాను రాను డివైన్‌ పర్సన్‌ని చూస్తున్నాను. ప్రతిరోజు తన లైఫ్‌ని చూసి ఏదోటి నేర్చుకోవచ్చు. తన ఫోకస్‌ అమేజింగ్‌.

మీ తమ్ముడు సంగీతదర్శకుడిగా ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ఊహించారా? ఒకవేళ ఊహిస్తే దానికి కారణం ఏంటి?
తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్నాను. ఒక్కోసారి ఇండియాలో బాగా పాపులర్‌ అవుతాడనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటాడని మాత్రం ఊహించలేదు. రెహమాన్‌ బాగా పైకొస్తాడని నేను ఎందుకు నమ్మానంటే.. అప్పట్లో తను క్రియేట్‌ చేసిన మ్యూజిక్‌ నేనెక్కడా వినలేదు. ఆ ట్యూన్స్‌ నాకు కొత్తగా అనిపించేవి. వినసొంపుగా ఉండేవి. నేరుగా హృదయాన్ని తాకినట్లుగా అనిపించేది.

హిందూ మతం నుంచి ముస్లిమ్‌ మతానికి మారాలని రెహమాన్‌గారు అనుకున్నాక మీ అందరూ కూడా మారడం మీ యూనిటీని తెలియజేస్తోంది...
యాక్చువల్‌గా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని ‘సూఫిజమ్‌’ చాలా ప్రభావితం చేసింది. రెహమాన్‌ కూడా ప్రభావితుడయ్యాడు. ఆ భగవంతుడి నుంచి వాళ్లకు ఓ పిలుపు అందింది. దాంతో మారారు. అయితే నేను మాత్రం ఆ తర్వాత ఎప్పటికో దేవుడి నుంచి కబురు వచ్చిందనే భావన కలిగినప్పుడు మాత్రమే మారాను. ‘నేను మారాను. నువ్వు మారాలి’ అని రెహమాన్‌ ఎప్పుడూ అనలేదు. నా జర్నీలో నాకెదురైన అనుభవాలే మార్పుకి కారణం అయ్యాయి.

మీరు గాయనిగా, సంగీతదర్శకురాలిగా ఉన్నారు. ఈ జర్నీకి రెహమాన్‌గారి సాయం ఎంతవరకూ ఉంది?
తన హెల్ప్‌ ఉంది. ముందు కోరస్‌ పాడించేవాడు. ఆ తర్వాత గాయనిగా అవకాశం ఇచ్చాడు. అలాగే తను చేసే మ్యూజికల్‌ షోస్‌కి తీసుకెళుతుంటాడు. అయితే యూస్, ఇతర విదేశాల్లో జరిగినప్పుడు వెళ్లను. నా అంతట నేను విదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాను. తమ్ముడు ఉన్నాడు కదా.. చూసుకుంటాడులే అనుకోకుండా నేను కీబోర్డ్‌ , గిటార్, డ్రమ్స్‌.. ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ‘ఏండా తలైల ఎన్న వెక్కలే’ అనే సినిమా కూడా నిర్మించాను.

మీ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు మరచిపోలేనిది?
డబుల్‌ క్యాసెట్‌ టేప్‌ రికార్డర్‌. అది కొనిచ్చినప్పుడు రెహమాన్‌ వయసు 21. చెన్నైలో బర్మా బజార్‌ ఫేమస్‌. అక్కడికివెళ్లి కొనుక్కొచ్చాడు. ఆ టేప్‌ రికార్డర్‌లో బోలెడన్ని పాటలు విన్నాను. నేను పాడుతూ రికార్డ్‌ చేసేదాన్ని.

మిగతా ఇద్దరి చెల్లెళ్లకు ఓ దారి చూపించారా?
వాస్తవానికి క్యాసెట్స్‌ అమ్మకం జోరుగా ఉన్నప్పుడు నాకు క్యాసెట్‌ బిజినెస్‌ అప్పజెప్పాడు. క్యాసెట్స్‌ పోయి సీడీలు వచ్చాక మానేశాం. ఆ తర్వాత నేను నా వర్క్‌తో బిజీ అయ్యాను. నా రెండో చెల్లెలు రెహమాన్‌ మ్యూజిక్‌ కాలేజీ చూసుకుంటోంది. ఇంకో చెల్లెలు ప్లేబ్యాక్‌ సింగర్‌. రెహమాన్‌ ట్యూన్స్‌కి, బయటవాళ్లకు పాడుతుంటుంది.

మీ అబ్బాయి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతదర్శకుడిగా సక్సెస్‌ అవ్వడంతో పాటు హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. మేనమామ హెల్ప్‌ ఉందా?
చిన్నప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని కీ బోర్డ్‌ ప్రాక్టీస్‌ చేయించేవాడు. అలా రెహమాన్‌ తనని గైడ్‌ చేసేవాడు. ఐదారేళ్ల వయసప్పుడే రెహమాన్‌ ట్యూన్‌కి జీవీ పాడాడు. ‘జెంటిల్‌మేన్‌’ సినిమాలో ‘చికు బుకు చికు రైలే’ చిన్నపిల్లాడి గొంతు జీవీదే. అలాగే ‘బొంబాయి’లో ‘కుచ్చి కుచ్చి కూనమ్మా’ పాడాడు. పెద్దయ్యాక కూడా పాడాడు. ఆ తర్వాత వేరే మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి కూడా పాడటం మొదలుపెట్టాడు. ఫైనల్లీ తన మేనమామలా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాడు. అంతవరకూ సక్సెస్‌ అవుతాడనుకున్నాను. హీరోగా మాత్రం నేనూహించలేదు. అయితే జీవీకి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంది. హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్నాడు.

అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లను రెహమాన్‌గారు గ్రాండ్‌గా చేశారా? బావగార్లతో ఎలా ఉంటారు?
మా పెళ్లిళ్లకు హాజరైన ప్రతి ఒక్కరూ ‘చాలా ఘనంగా చేశారు’ అన్నారు. నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటా. బావగార్లతో రెహమాన్‌ రాసుకుని పూసుకుని ఉండడు. మాట్లాడే నాలుగు మాటలు బాగా మాట్లాడతాడు. ఎక్కువగా దైవత్వం గురించి మాట్లాడతాడు.

అసలు మీ అందరికీ టైమ్‌ కేటాయించేంత తీరిక మీ తమ్ముడికి ఉంటుందా? అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకు అనిపిస్తోంది..
ఎప్పుడూ బిజీ. రోజూ ఫోన్‌ చేసుకోవడం లాంటివి ఉండవు. ‘తిన్నారా? ఏం చేస్తున్నారు’ అనేవి అడక్కపోయినా ఓవరాల్‌గా మా అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుసుంటూ ఉంటాడు. అంతకు మించి ఏం కావాలి? ఇక అమ్మ విషయానికొస్తే.. బిజీగా ఉంటాడు కాబట్టి రోజూ కలవలేడు. అమ్మ నాతోనే ఉంటుంది. తమ్ముడు ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకుంటాడు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేదంటే మంచి మంచి డాక్టర్స్‌తో ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే మా అందరి విషయంలో ‘హీ ఈజ్‌ వెరీ కేరింగ్‌’.

అంతా బాగానే ఉంది.. గూగుల్‌లో ఎంత వెతికినా పెద్దయ్యాక మీరంతా దిగిన ఒక్క ఫ్యామిలీ ఫొటో కూడా లేదేంటి?
దానికి కారణం ఉంది. ఒకసారి మేమంతా కలసి ఓ గ్రూప్‌ ఫొటో దిగాం. ఆ తర్వాత ఓ బ్యాడ్‌ ఇన్సిడెంట్‌ జరిగింది. అప్పటినుంచి దిగడం మానేశాం. ఇది మా తమ్ముడి సెంటిమెంట్‌. అందుకే చిన్నప్పుడు మేం దిగిన ఫొటోలు ఉంటాయోమో కానీ పెద్దయ్యాక మా ఫొటోలు ఉండవు.

ఫైనల్లీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ఏదైనా సలహా ఇస్తారా?
‘నాకిది చేయలేదు. నాతో ఇలా ఉండలేదు’ అని కంప్లైంట్‌ చేయకూడని బంధం ఇది. ఒకరి మంచిని మరొకరు కోరుకోవాలి. ఒకరి నుంచి ఒకరు ఏమీ ఆశించకూడదు. నేను మాత్రమే కాదు.. నా తోడబుట్టినవాళ్లు బాగుండాలని కోరుకోవాల్సిన బంధం ఇది. అక్కాచెల్లెళ్లకు అన్నతమ్ముళ్లు భరోసాగా నిలవాల్సిన బంధం ఇది. మా జీవితంలో ఈ బంధం చాలా పటిష్టంగా ఉంది. అక్కాచెల్లెళ్లందరికీ అది దక్కాలని కోరుకుంటున్నాను.

రెహమాన్‌గారి విజయానికి కారణాలేంటి?
ఫ్యూర్లీ తన టాలెంట్‌. వర్క్‌ మీద తనకున్న ఫోకస్‌. మ్యూజిక్‌ మినహా వేరే దేని మీదా దృష్టి ఉండదు. ఎప్పుడూ వినయంగా ఉంటాడు. నా తమ్ముడి సక్సెస్‌కి ప్రతిభ, పని మీద ఏకాగ్రత, వినయం.. వీటికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయి.


ఫాదర్‌ ఫిగర్‌
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపే రాఖిలాంటి పండగ బహుశా మనకే సొంతమేమో! నాకు తెలిసీ ప్రపంచంలో ఇలాంటి కల్చర్‌ ఇంకా ఎక్కడా లేదనుకుంటా. మన దేశంలో ఈ రాఖి అంటే తెలియని వాళ్లుండరేమో. మేమూ ఈ కాన్సెప్ట్‌లోనే పెరిగాం. బ్రదర్‌ అంటే మన దగ్గర అమ్మాయిలకు ఫాదర్‌ ఫిగరే. ఎస్పెషల్లీ ఎల్డర్‌ బ్రదర్‌. నాక్కూడా అంతే.  రామన్న (కేటీఆర్‌) ఫాదర్‌ ఫిగరే. ఐ ఆల్వేస్‌ రెస్పెక్ట్‌ హిమ్‌ లైక్‌ మై ఫాదర్‌. పైగా మా నాన్న ఎప్పుడూ బిజీయే కాబట్టి, రామన్ననే ఆయన ప్లేస్‌ తీసుకున్నాడు. ప్రతీదీ ఇద్దరం డిస్కస్‌ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇష్టాఇష్టాల నుంచి చదువు, కెరీర్‌ వరకు.. అన్నీ! ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకోవాలి.. ఎమ్మెస్‌ కోసం అమెరికా వెళ్లడం వరకు అన్నీ రామన్నతో డిస్కస్‌ చేశాను. అయితే డెసిషన్‌ విషయంలో నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఉండేది. ఉంటుంది కూడా. ఏది మంచి ఏది చెడు జడ్జ్‌ చేస్తాడు కాని నిర్ణయం నన్నే తీసుకోమంటాడు.

బోరింగ్‌ బ్రదర్‌ అండ్‌ బోరింగ్‌ సిస్టర్‌
రామన్న నాకన్నా మూడేళ్లు పెద్ద. మోర్‌ లైక్‌ ఫ్రెండ్స్‌లాగే ఉంటాం. నిజం చెప్పాలంటే మేమిద్దరం బోరింగ్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ గొడవపడలేదు. ఒక వస్తువునే ఇద్దరం కావాలని పట్టుపడలేదు. దేని కోసం డిమాండ్‌ కూడా లేదు. అలాగే క్వశ్చనింగ్‌ కూడా లేదు. రామన్న ఏది చెబితే అది చేయడమే. అయితే పెళ్లయి వెళ్లిపోతుంటే ‘‘హమ్మయ్య ఈ గయ్యాళి వెళ్లిపోతుంది’’ అని మాత్రం అనుకుని ఉంటాడు (నవ్వుతూ).  ‘‘మీ ఆయన్ని సతాయించకు’’అని చెప్పాడు. తన కూతురు అలేఖ్య అచ్చం నా పోలికే అని చెప్తుంటాడు. ‘‘నీలాగే గయ్యాళి’’ అంటుంటాడు (నవ్వుతూ).

రామన్న ఉన్నాడు అనే ధీమానే
రాఖీ కడితే గిఫ్ట్స్‌ లాంటి సీనేం ఉండదు పెద్దగా. చిన్నప్పుడు అమ్మో, నాన్నో.. రామన్న జేబులో డబ్బులు పెడితే.. నేను రాఖీ కట్టగానే అవి నాకు ఇచ్చేవాడు. ఇప్పుడు  అయితే రాఖీ కన్నా నా  ప్రతి బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్‌ ఇస్తుంటాడు. పిల్లల బర్త్‌డేలకు కూడా. రామన్న నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్‌ అంటే.. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా.. రామన్న ఉన్నాడు అన్న ధీమానే. నా లైఫ్‌లో నేను మరిచిపోలేనిది అంటే.. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు.. రామన్న నా దగ్గర ఉండడం. అప్పుడు మేం యూఎస్‌లో ఉన్నాం. వాడు పుట్టగానే వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు.  రామన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో చాలా సరదాగా ఉంటాడు. వాళ్లతో బాగా ఆడ్తాడు.

మా బర్త్‌డేలకు, పిల్లల బర్త్‌డేలకు తప్పకుండా కలుసుకుంటాం. నేను రామన్నకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ లాస్ట్‌ ఇయర్‌ ఆయన బర్త్‌డే రోజు మొదలుపెట్టిన గిఫ్ట్‌ ఎ హెల్మెట్‌ చాలెంజ్‌. ఎవ్రీ ఇయర్‌ రామన్న బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్‌ ఇస్తుంటా. బట్‌ లాస్ట్‌ ఇయర్‌ ఆయనకే తెలియకుండా సర్‌ప్రైజింగ్‌ ఆయన బర్త్‌ డే రోజు వెళ్లి హెల్మెట్‌ ప్రెజెంట్‌ చేశాను. ఆ చాలెంజ్‌ స్టార్ట్‌ చేయబోతున్నట్టు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ రోజు కూడా హెల్మెట్‌ ఇస్తాను. నేను స్టార్ట్‌ చేసిన ఈ చాలెంజ్‌ రెస్పాన్స్‌ చాలా బాగుంది. హెల్మెట్‌ పెట్టుకోవడం మీద అవేర్‌నెస్‌ వచ్చేంత వరకు ప్రతియేడు రామన్న బర్త్‌డే నుంచి రాఖీ వరకు ఈ క్యాంపెయిన్‌ చేస్తూనే ఉంటాను.

చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు..
ఇద్దరం అన్ని విషయాలు చాలా ఓపెన్‌గానే మాట్లాడుకుంటాం. విల్‌ డిస్కస్‌ ఎవ్రీ థింగ్‌.  కాని ఏ విషయం మాట్లాడినా ఎండ్‌ అయ్యేది మాత్రం పాలిటిక్స్‌ దగ్గరే. ఏది చెప్పినా వింటాడు. నిరుత్సాహ పర్చడు. చేసేద్దాం అంటాడు. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు. ఏదైనా పని మొదలుపెడితే పట్టుదలగా పూర్తి చేస్తాడు. నాకూ పట్టుదల ఎక్కువే. ఇద్దరం ఒకరి నుంచి ఒకరం అడ్వయిజెస్‌ తీసుకుంటాం. నేను చేసే వంటలంటే రామన్నకు చాలా ఇష్టం.

ఇది చేయకు.. అది చేయకు
ఒక్క రామన్ననే కాదు.. మా ఇంట్లో ఏ విషయంలోనూ ఎవరూ వెనక్కి లాగలేదు. లాగరు కూడా. ఇంజనీరింగ్‌ చేస్తానన్నా.. అమెరికా వెళ్తానన్నా.. చివరకు పాలిటిక్స్‌లోకి రావడాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేదు. అడ్డు చెప్పలేదు. ఎంకరేజింగ్‌గానే ఉంటారు. అందరూ ఇండువిడ్యువాలిటీకి ఇంపార్టెన్స్‌ ఇస్తారు.. రెస్పెక్ట్‌ చేస్తారు. రిస్ట్రిక్షన్స్‌ ఎప్పుడూ లేవు.

రాఖీ..
బ్రదర్స్‌ అందరికీ నా రిక్వెస్ట్‌... అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లది రక్తసంబంధం.  ఎవరి లైఫ్‌లో వాళ్లు ఎంత బిజీగా ఉన్నా అక్క, చెల్లెళ్ల కోసం టైమ్‌ కేటాయించండి. ఎందుకంటే ఆడపిల్ల తను లైఫ్‌లో ఎంతబాగా సెటిల్‌ అయినా ప్రతి అన్నా, తమ్ముడు తన పట్ల కేర్‌ తీసుకోవాలని, కన్‌సర్న్‌ చూపించాలని కోరుకుంటారు. సో.. దయచేసి వాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేయండి.

నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్‌ చేసే స్పిరిట్‌నే పెంపొందించారు తప్ప పిరిగా అన్న వెనకాలో.. నాన్న వెనకాలో దాక్కునే తత్వాన్ని నూరిపొయ్యలేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే చెప్పారు. ఆ ధైర్యాన్నే ఇచ్చారు. నిజానికి మా ఇంట్లో నాకు గాని, రామన్నకు గాని మా అమ్మే ఇన్సిపిరేషన్‌. అమ్మ ఓపిగ్గా లేకపోతే నాన్న జర్నీ ఇంత సాఫీగా సాగేది కాదు. సో.. షి ఈజ్‌ అవర్‌ స్ట్రెన్త్‌. అన్నాచెల్లెళ్లం ఎలా ఉండాలో కూడా అమ్మను చూసే నేర్చుకున్నాం.

నా పిల్లలకూ అదే చెప్తా..
మా అమ్మ నన్నెప్పుడూ అణగిమణిగి ఉండాలని ఆర్డర్‌ చేయలేదు. అలాగే రామన్నకు మగపిల్లాడు అని ప్రివిలేజెస్‌ ఇవ్వలేదు. అంటే నన్ను తక్కువా చేయలేదు.. రామన్నను ఎక్కువా చేయలేదు. ఇద్దరినీ ఈక్వల్‌గానే చూసింది. సర్దుకుపోవడం, ఒకరంటే ఒకరు గౌరవంగా ఉండడం ఇద్దరికీ నేర్పింది. నేనూ నా పిల్లలకు అదే చెప్తా. నాకు ఇద్దరు అబ్బాయిలే.  అందరూ సమానమనే చెప్తా. ‘‘నువ్వు చెప్పింది అందరూ వినాలి అని అనుకోవద్దు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు వాళ్లకు ఉంటాయి. గౌరవించాలి. పర్సనల్‌స్పేస్‌ ఇవ్వాలి.  ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా సున్నితంగా ఆలోచించాలి. బాలెన్సింగ్‌గా ఉండాలి’’ అనే చెప్తుంటా.

కళ్యాణలక్ష్మిని సరిగ్గా అర్థం చేసుకోవాలి...
మా నాన్న చేసిన దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం.. ప్రతి గర్భిణీ  స్త్రీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం. నెలలు నిండే వరకు కూడా పనిచెయ్యక తప్పని పరిస్థితులన్న మహిళలకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భవతి అని నిర్థారణ అయి, బిడ్డ పుట్టిన మూడు నెలల వరకు ప్రతి నెలా వాళ్లకు వెయ్యి రూపాయలు వచ్చేలా చేసే స్కీమ్‌ ఇది. అలాగే అంగన్‌ వాడీలో ప్రతి రోజూ ఒక పూట పోషక విలువలతో కూడి భోజనం ఇవ్వడం. ఈ పథకానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఫండ్స్‌ తగ్గించినా కూడా నాన్న ఈ స్కీమ్‌ రన్‌ అయ్యేలా చేస్తున్నారు. ఇవి చాలా మంచి స్కీమ్స్‌.

కళ్యాణ లక్ష్మిని చాలా మంచి తప్పుగా అర్థం చేసుకున్నారు కాని.. సీఎమ్‌గారు చాలా విజన్‌తో దాన్ని స్టార్ట్‌ చేశారు. పేదరికం వల్ల తెలంగాణలో అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అందుకే పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లికి సహాయపడే ఈ కళ్యాణ లక్ష్మి పథకం వల్ల అమ్మాయిలు కనీసం పద్దెనిమిదేళ్లు వచ్చే వరకన్నా చదువుకునే వీలు కలుగుతోంది. బాల్య వివాహాలూ కాస్త అయినా ఆగుతాయని ఆశ. అమ్మాయి భవిష్యత్‌ను బాగు చేసే పథకమే ఇది. ఆయన ఏ పని చేసినా నెక్స్‌›్ట ఎలక్షన్స్‌ వరకే కాదు.. నెక్స్‌›్ట జనరేషన్‌ వరకు ఉంటుంది. లిక్కర్‌విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు. దాన్ని తగ్గించేందుకు ఆయన స్టెప్‌ బై స్టెప్‌ చర్యలు తీసుకుంటున్నారనుకుంటున్నాను.


మేమిద్దరం టామ్‌ అండ్‌ జెర్రీ


రాఖీ పండగని ఎలా చేసుకుంటారు?
నిహారిక:  దసరా, దీపావళిలా ఫుల్‌గా చేయకపోయినా బాగానే చేసుకుంటాం. బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్‌ తినిపించి, కాళ్లు మొక్కి డబ్బులు గుంజడం (నవ్వుతూ ). చిన్నప్పటి నుంచి రాఖీ ఎప్పుడూ మిస్‌ అవ్వలేదు. లాస్ట్‌ ఇయర్‌ అయితే వరుణ్‌ అన్న ‘ఫిదా’ షూటింగ్‌ కోసం నిజామాబాద్‌లో ఉన్నాడు. నేను వరుణ్‌ అన్నకు రాఖీ కట్టాకే మిగతా అన్నలకు కడతాను. నైట్‌ అంతా జర్నీ చేసి నిజామాబాద్‌ వెళ్లి అన్నకు రాఖీ కట్టి మళ్లీ రిటర్న్‌ వచ్చి చరణ్‌ (రామ్‌చరణ్‌) అన్నకు కట్టాను. ఒకవేళ వేరే కంట్రీలో ఉంటే ఏం చేయలేం. నెక్ట్స్‌ స్క్రిప్ట్స్‌ వినేప్పుడు కూడా రాఖీ అప్పుడు షెడ్యూల్స్‌ లేకుండా చూడాలి. ఎందుకంటే నాకు లాస్‌ కదా. పైసల్‌ ఇవ్వకుండా తప్పించుకుంటాడు (నవ్వుతూ).
వరుణ్‌: మా జనరేషన్స్‌లో కజిన్స్‌ ఎక్కువ. చరణ్‌ అన్న వాళ్ల ఇంటికి నిహా  వెళ్లడం, సుష్మితా వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మెమరబుల్‌గానే సెలబ్రేట్‌ చేసుకుంటాం. అందరం కలిసి బయటకు వెళ్తాం. సినిమాల్లోకి వచ్చాక బయటకి వెళ్లడం తగ్గిపోయింది. ఆ రోజు షూటింగ్స్‌ లేకపోతే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. ఎక్కువ సేపు జరుపుకునే ఫెస్టివల్‌ కాదు కూడా. రాఖీ కట్టించుకున్న తర్వాత  టైమ్‌ స్పెండ్‌ చేస్తుంటాం. మిస్‌ అవ్వకుండా పాటిస్తాం.  

రాఖీ కట్టేప్పుడు అన్నయ్య ఇలా ఉండాలి అని ఏదైనా కోరుకుంటారా?
నిహారిక: రాఖీ రోజే ప్రొటెక్ట్‌ చేయాలని కోరుకోం. అన్న నన్నెప్పుడూ ప్రొటెక్ట్‌ చేస్తుంటాడు. చెల్లి పుట్టగానే బ్రదర్స్‌కి ఒక బాధ్యత వచ్చేస్తుంది. సెకండ్‌ ఫాదర్‌ లాగా మారిపోతారు. నాన్నకు అన్నీ చెప్పలేం కదా. అన్నయ్యకు చెబుతాం. అలా అని అన్నయ్యకు కూడా మొత్తం చెప్పం అనుకోండి (నవ్వుతూ).
వరుణ్‌: నేను ఒక్కరోజు పండగల్ని పెద్దగా నమ్మను. తను నీకు ఆ ఒక్క రోజు చెల్లెలు కాదు కదా. జీవితాంతం చెల్లెలే. లైఫ్‌లాంగ్‌ తనను ప్రొటెక్ట్‌ చేస్తుండాలి. రాఖీ అనేది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ సెలబ్రెట్‌ చేసుకోవడానికి ఓ రోజు అన్నట్టు నేను ఫీల్‌ అవుతాను.

చిన్నప్పటి నుంచి అల్లరిగా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చేప్పటికి కొంచెం ప్రొటెక్టెడ్‌గా అయిపోతారు. మీ అన్న అలా మారారని ఎప్పుడు అర్థం అవ్వసాగింది?
నిహారిక: అది మెల్లిగా అర్థం అవుతుంది. చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. అమ్మా నాన్న దగ్గర ఊరికే కంప్లైంట్‌ చేసుకోవడం నుంచి  మెల్లిగా మెచ్యూర్డ్‌ అవ్వడం గమనించాను. నేను కాలేజ్‌లో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో ఉండేదాన్ని. అన్నయ్య అప్పుడు వైజాగ్‌లో యాక్టింగ్‌ కోర్స్‌లో ఉన్నాడు. 5–6 నెలలు చూడలేదు. అప్పుడు మిస్‌ అయ్యాను. ఆ తర్వాత నుంచి అన్నయ్యలో కొంచెం ప్రొటెక్టీవ్‌నెస్‌ కనిపించేది. అది కూదా గుడ్‌ వేలోనే. మరీ ఓవర్‌గా, రెస్ట్రిక్షన్‌లా కూడా కాదు. ఇంకో ప్లస్‌ ఏంటంటే.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నాను అంటే త్వరగా ఇంటికి వచ్చేయ్‌ అంటారు. అదే అన్నతో అయితే ఈజీగా బయటకు వెళ్లోచ్చు. అన్నయ్యతో ఉన్నావా? అని ఇంకే అడగరు.
వరుణ్‌: ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అందరికీ జరుగుతుంది అనుకుంటున్నాను. నేను, మా చెల్లెలు ఊరికే కొట్టుకోవడం, గొడవపడటం తప్ప కూర్చొని స్వీట్‌గా మాట్లాడటం ఎప్పుడూ లేదు. నా విషయంలో తను ఎంత ప్రొటెక్టివ్‌గా ఉందో నా కెరీర్‌ స్టార్ట్‌ అయిన తర్వాతే తెలుసుకున్నా. చరణ్‌ అన్న, నేను కూడా ఎక్కువ గొడవలు పడేవాళ్లం. ఎక్కువ తిట్టేవాడు.. కొట్టేవాడు. సడెన్‌గా చరణ్‌ అన్న యాక్టర్‌ అయ్యాక నన్ను ఫాదర్‌లా చూసుకోవడం స్టార్ట్‌ చేశాడు. నేను యాక్టర్‌ని అయ్యాక అది అర్థం అయింది.
నిహారిక: నాకు తెలిసిన ఫ్రెండ్స్‌లో కొందరు ‘మా అన్నయ్య అన్నింటికీ అడ్డంకులు పెడతాడు. వాడికి వాళ్ల ఫ్రెండ్స్‌ ఎక్కువ’ అనేవాళ్లు. నా అన్న మాత్రం అలా కాదు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని అన్నయ్య అడిగేవాడు. అప్పుడు చిరాకుగా అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది.. ఒకవేళ అది కూడా అడగకపోతే ఇంకా అల్లరి పిల్లలా తయారయ్యేదాన్ని అని.

మీ ఇంట్లో ఎవరికి వాళ్లు మీ కెరీర్‌తో బిజీ. ఈ బిజీ వల్ల వచ్చే గ్యాప్‌ని ఎలా ఫిల్‌ చేస్తారు?
నిహారిక: ఇప్పుడు అన్న కొంచెం ఖాళీ దొరికినా నా ఆఫీస్‌కి రా. సెట్స్‌కి రా అంటాడు. వాళ్ల ఫ్రెండ్స్‌తో నన్ను కలుపుకుంటాడు. అందుకే అంత గ్యాప్‌ రాదు. ఒక వారం వరకూ ఓకే. వారం దాటి కలవకపోతే మాత్రం ఇద్దరికీ ‘మిస్సింగ్‌’ అనే అలారం మోగిపోతుంది. వెంటనే కలుస్తాం.

బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ అంటే ఎక్కువ శాతం టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటారు. మరి  మీ ఇంట్లో టామ్‌ ఎవరు జెర్రీ ఎవరు?
నిహారిక:  నేను జెర్రీ.. అన్నయ్య టామ్‌.  ఆ ప్రోగ్రామ్‌కి ఇన్‌స్పైర్‌ అయ్యి, అన్న చేతులు గీరేసేదాన్ని. అప్పుడు వాడు హీరో అవు తాడు అని తెలియదు కదా. ఇప్ప టికీ ఆ గీతలు వాడి చేతుల మీద ఉంటాయి.

అన్న కోసం నాకు చాక్లెట్స్‌ లంచం ఇచ్చేవాళ్లు - నిహారిక
రాఖీ అనగానే బ్రదర్‌ సిస్టర్‌ని ప్రొటెక్ట్‌ చేయాలి. భరోసా ఇవ్వాలి అంటాం. మరి సిస్టర్స్‌ బ్రదర్స్‌కి ఏం చేయాలి.
నిహారిక : మేం కూడా ఏమైనా చేయాలా? (పెద్దగా నవ్వుతూ). చిన్నప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంటాం కదా. సోఫాలో కూర్చొని చిటికేస్తే మేమే కదా వాటర్‌ బాటిల్‌ అయినా ఏదైనా అందించేది. పరిగెత్తిస్తారు కదా. ఇలా సంవత్సరం అంతా చేస్తూ రాఖీ రోజు గుర్తు చేస్తుంటాం హాలో.. నువ్వు కూడా బాధ్యతగా ఉండూ అని.

రాఖీ రోజు వరుణ్‌ మీకు గిఫ్ట్స్‌ ఇస్తుంటారా?
నిహారిక: ఏది పడితే అది తీసుకుంటాను. అప్పటి మైండ్‌సెట్‌కి తగ్గట్టుగా అడుగుతా.  ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇలాంటి పండగలప్పుడు అడగాలనిపించదు. కానీ మాములు టైమ్‌లో  చంపుతుటాను.

మీ అన్నయ్యకు మీరిచ్చిన వాటిలో బెస్ట్‌ గిఫ్ట్స్‌ ఏదైనా?
వస్తువు కొని ఇస్తే ప్రేముంటుందని నేను అనుకోను. నేను నా టైమ్‌ తీసుకొని నా సొంతంగా చేసినవి ఇవ్వడానికి ఇష్టపడతాను.  అలాంటి గిఫ్ట్స్‌ ఇవ్వడంవల్ల మనం ఎంత స్పెషలో తెలియజేస్తాం. అలా ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. గిఫ్ట్స్‌ కంటే అన్నయ్యతో స్పెండ్‌ చేసే స్పెషల్‌ మూమెంట్స్‌ని చాలా ఇష్టపడతాను. బయట మీ అందరికీ కనిపించే వరుణ్‌ వేరు.. మా ఇంట్లో ఉండే వరుణ్‌ వేరు.  చాలా ఏడిపిస్తాడు. చాలా ఫన్నీ. ఈ విషయం మీ అందరికీ తెలుసో.. లేదో. అన్న బెస్ట్‌ కంపెనీ. అలాంటి ఇంకెన్నో బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌ అన్నతో స్పెండ్‌ చేయాలనుకుంటున్నాను. గిఫ్ట్స్‌ అన్నీ ఏదో పాయింట్‌లో ఇరిగిపోతాయి.. అరిగిపోతాయి. స్పెండ్‌ చేసిన టైమే బెస్ట్‌ అని నా ఫీలింగ్‌.

నిహారిక మీకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌?
వరుణ్‌: తను గిఫ్ట్స్‌ ఎక్కువ ఇవ్వదు కానీ బాగా చూసుకుంటుంది నన్ను. ఒకసారి తను సొంతంగా నా బర్త్‌డేకి నా ఫోట్స్‌ అన్నీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్‌ తయారు చేసి ఇచ్చింది. అది ఇప్పటికీ నా రూమ్‌లోనే ఉంది.

మీరు షేర్‌ చేసుకున్న బెస్ట్‌ మూమెంట్స్‌
వరుణ్‌: మా ఫ్యామిలీలో ఒక  స్పెషల్‌ మూమెంట్‌ అని ఉండదు. అన్నీ కలిపి ఉంటాయి. నాకు నిహారిక ఒక్కతే కాదు.. చరణ్‌ అన్న వాళ్ల సిస్టర్స్‌ కూడా క్లోజ్‌. మా కజిన్స్‌ అందరం ఒకే ఏజ్‌ గ్రూప్‌ కాబట్టి అందరం రెగ్యులర్‌గా కలుస్తాం. మీట్‌ అవుతుంటాం. సంక్రాంతికి బయటకు వెళ్తుంటాం. బెంగళూర్‌లో ఫామ్‌ హౌస్‌ ఉంది. నిహారిక తన షూటింగ్స్‌కి రమ్మంటుంది కానీ నా బిజీ వల్ల కుదరడం లేదు.

సాధారణంగా ఏ అమ్మాయి అన్నయ్యని అయినా అబ్బాయిలు విలన్‌గా ఫీలవుతారు. మీ అన్నయ్య ఎంతమందికి విలన్‌ అయ్యారు?
నిహారిక: మా అన్న ఒక లైన్‌ చెప్పాడు. అది తనెక్కడో చదివాడట. అదేంటంటే.. ఏ చెల్లైనా అన్నయ్యకు గర్ల్‌ ఫ్రెండ్‌ ఉందంటే అర్థం చేసుకుంటుందట. అదే అన్నయ్యకు ఆ చెల్లి వచ్చి నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడంటే అస్సలు అర్థం చేసుకోడట. దానికి కారణం చెప్పాడు. చెల్లెలికి ప్రేమంటే ఏంటో తెలుసు. కానీ అన్నయ్యలకు అబ్బాయిలంటే ఏంటో తెలుసు అన్నాడు. నిజమే  కదా అనిపించింది. హిస్టరీ చూస్తే ఇదే నిజం అని అర్థమవుతుంది. సినిమాల్లో కూడా చెల్లెలు వదినా అని వెంటనే ఒప్పుకుంటుంది. అన్నయ్య మాత్రం సింపుల్‌ రిజెక్షన్‌. అది కూడా ప్రొటెక్షనేలే. నాకు తెలిసి మా అన్న ఎవరికీ విలన్‌ అవ్వలేదనే అనుకుంటున్నాను. ఎప్పుడూ హీరోనే.

ఇద్దరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. ఒకరి వర్క్‌ని ఇంకొకరు ఎలా కాంప్లిమెంట్‌ లేదా క్రిటిసైజ్‌ చేసుకుంటారు?
నిహారిక: 5 ఏళ్ల క్రితం అయితే చెత్తగా చేశావు.. బాగా చేశావులే అని అనుకునేవాళ్లం అనుకుంటున్నాను. బావున్నా బాలేకున్నా డీటైల్డ్‌గా చెప్తాను నేను. ప్రతి సినిమాకు యాక్టర్‌గా గ్రో అవుతుంటారనే అనుకుంటాను. డ్రెస్సింగ్, మేకప్‌ విషయంలో కామెంట్‌ చేస్తుంటాను.
వరుణ్‌: చెల్లి సినిమాలను బాగానే క్రిటిసైజ్‌ చేస్తుంటాను. నిహా మాత్రం అంతగా చెప్పదు. చరణ్‌ అన్న దగ్గరకు వచ్చినప్పుడు అన్న చెప్పేది వింటాను. ఎందుకంటే మా అందరిలో సీనియర్‌ అండ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌. చరణ్‌ అన్న, నేను సినిమాల గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం. ఐడియాస్‌ పంచుకుంటాం. నిహా, నేను సేమ్‌ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి హ్యాపీ. తను డాక్టరో లేక ఇంజనీరో అయ్యింటే తన వర్క్‌ నాకు అర్థం అవ్వదు. ఆ టాపిక్‌ కూడా నేను మాట్లాడలేను.

సినిమాల్లోకి వెళ్తున్నాను అనగానే అన్నయ్య రియాక్షన్‌ ఏంటి?
నిహారిక: వాట్‌!! నిజంగానా అన్నాడు.

మీరు ముందు హింట్స్‌ ఇవ్వలేదా?
నిహారిక: నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాక ఇంట్లో గంతులేస్తున్న టైమ్‌లో అన్నయ్య ఇంట్లో లేడు. యాక్టింగ్‌ ట్రైనింగ్‌లో ఉన్నాడు. సో 6–7 నెలలు లేకపోయే సరికి వాడికి కొత్తగా అనిపించింది. మా ఫ్యామిలీలో ఎవరూ వద్దని చెప్పలేదు. నేను సీరియస్‌గా ఉన్నానా? లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చే నెగటివ్, పాజిటివ్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లేదా అని చూశారు. అందరికంటే చిన్నదాన్ని, చిన్నపిల్ల అని భయపడ్డారు. హ్యాండిల్‌ చేయగలుగుతుందా? అని కొంచెం ఆలోచించారు. నా కాన్ఫిడెన్స్‌ చూసి అన్నయ్యకు కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఇది మైండ్‌లో ఫిక్స్‌ అయిందన్న మాట అనుకున్నాడు.

ఇలానే ఉండాలని నిబంధనలేమైనా?
నిహారిక: లేదు. కానీ నీకేదైనా పని చేయాలనిపించినప్పుడు నీ వెనక 8–9 మంది ఉన్నారు. సో ఏది చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. చిరంజీవిగారు. నాగబాబు, పవన్‌కళ్యాణ్, చరణ్‌.. ఇలా అన్ని పేర్లు వస్తాయి అన్నారు. నాకూ ఆ విషయంలో క్లారిటీ ఉంది.
వరుణ్‌: కొన్నిసార్లు ఓవర్‌ ప్రొటెక్షన్‌ పొసెసివ్‌నెస్‌ అయిపోతుంది. అది చాలా సన్నటి గీత. బ్యాలెన్స్‌ చేస్తూ ఉండాలి. మా నాన్న కూడా చాలా ఫ్రీడమ్‌ ఇస్తూనే కొన్ని నిబంధనలు పెట్టారు. నేను కూడా ఆ లైన్‌లోనే ఉన్నాను అనుకుంటున్నాను. మా చెల్లి సైడ్‌ నుంచైతే ఏం కంప్లైంట్స్‌ లేవు. తను హ్యాండిల్‌ చేయగలదు అని నమ్మకం వచ్చిన తర్వాత  ఫ్రీ హ్యాండెడ్‌గా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు వద్దన్నా నేనే మాట్లాడి పర్మిషన్‌ ఇప్పిస్తాను. (నవ్వుతూ)

మీ అన్నయ్య రిలేషన్‌షిప్స్‌ నాన్నగారికి తెలియ కుండా దాచిపెట్టడం.   
నిహారిక: నేను, అన్నయ్య ఒకే కాలేజ్‌లో చదువుకోలేదు. కానీ 5 వరకూ ఒకే స్కూల్‌. అన్నయ్యను లైక్‌ చేసే అమ్మాయిలు తెలుసు కానీ అన్నయ్య లైక్‌ చేసిన అమ్మాయిలు తెలియదు. చాలా మంది చాక్లెట్స్‌ తెచ్చి ఇచ్చేవారు. బ్రేక్‌ టైమ్‌లో అన్న క్లాస్‌కి వెళ్తే ‘హే వరుణ్‌ చెల్లి’ అని చాక్లెట్స్‌ ఇచ్చేవాళ్లు. చాక్లెట్స్‌ వస్తున్నాయి కదా అనుకున్నే దాన్ని. అది లంచం అని తర్వాత తెలిసింది.
వరుణ్‌: నేను అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడ్ని కాదు. అమ్మాయిలంటే శత్రువులు అని అనుకునేవాడ్ని. అలా ఎందుకు అనుకున్నానో కూడా సరిగ్గా తెలియదు. మా క్లాస్‌లో అమ్మాయిలందరూ కూడా చెల్లితో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్లు ఇచ్చిన చాక్లెట్స్‌ తీసుకునేది కానీ నాతో చెప్పమన్నది మాత్రం చెప్పలేదు.

మీ చరణ్‌ అన్న ఇచ్చిన గిఫ్ట్స్‌ ఏమైనా?
నిహారిక: ఒకసారి అనుకోకుండా నాక్కావల్సింది ఇచ్చాడు. నేను ట్రిప్‌కి వెళ్తున్నాను. కొత్త కళ్లజోడు కొనుక్కుందాం అనుకున్నాను. దార్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వెళ్తుంటే చరణ్‌ అన్న కార్‌ కనిపించింది. హాయ్‌ చెప్పేదాం అని వెళ్లాను. అన్న క్యారవ్యాన్‌ బాగా ఫేమస్‌. నువ్వేంటి సడెన్‌గా ఇలా? అన్నాడు. ఏం లేదు.. కళ్లజోడు కొనుక్కుందాం అని అన్నాను. నేనుండగా నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవడమా అని చెప్పి పర్స్‌లో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. మా ఫ్రెండ్స్‌ ‘నీ హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి డబ్బులు బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడవనుకుంటా’ అని ఆటపట్టించారు. ఊహించకుండా వచ్చిన గిఫ్ట్‌ కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఎప్పుడైనా స్కూల్‌ అవుటింగ్స్‌లో హెల్ప్‌ చేశారా?
వరుణ్‌: మా నాన్నగారి మితిమీరిన ప్రేమ వల్ల చిన్నప్పుడు స్కూల్‌ అవుటింగ్స్‌ ఒకటి కూడా వెళ్లలేదు నేను. మహా అంటే ఒక్కసారి అనుకుంటాను. అందరికీ ఉంటుంది కదా బయటకు వెళ్లాలని. నిహారిక టైమ్‌ వచ్చేసరికి ఆయన కొంచెం ఫ్రీగా ఉండేవారు. తనే చాలా సార్లు వెళ్లింది. నేను గొడవపడేవాణ్ని నన్ను ఆపేశారు... తనను పంపుతున్నారని (నవ్వుతూ).

ఇద్దరికీ సీరియస్‌ గొడవలేమైనా అయ్యాయా?
వరుణ్‌: నాకు గొడవలను ఎక్కువగా లాగడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి కోప్పడుంటాను కానీ పెద్దగా మాట్లాడుకోలేనంత గొడవలు ఎప్పుడూ జరగలేదనుకుంటాను.

మీరిచ్చిన బెస్ట్‌ గిఫ్ట్స్‌ ఏంటి?
వరుణ్‌: అవతలి వాళ్లకు ఏది నచ్చుతుంది అని ఆలోచించి గిఫ్ట్‌ తీసుకోవడంలో చాలా వీక్‌. కానీ నాకు గుర్తున్నదైతే యాక్టర్‌ అయ్యాక నా సంపాదనతో తనకో వాచ్‌ కొనిచ్చాను.  డబ్బులిస్తాను కావాల్సింది కొనుక్కో అంటాను.               

నాన్నకి తెలియకుండా మీ ఇద్దరూ చేసిన పనులు...
వరుణ్‌: కొన్ని సార్లు లేట్‌ నైట్స్‌ బయట ఉండాల్సి వస్తుంటుంది. ఆ విషయం నాన్నకు చెప్పాలంటే భయం. అప్పుడు చెల్లి కవర్‌ చేస్తుంటుంది. అలా నాన్నకు అబద్ధాలు చెప్పి బయట తిరిగేవాళ్లం.

మీ పాకెట్‌ మనీని మీ అన్న కొట్టేసేవారా?
నిహారిక: అబ్బే. కిడ్డీ బ్యాంక్‌ ఉండేది కానీ పొరపాటున రూపాయి వేసేదాన్ని కాదు. వరుణ్‌ అన్నకు కాయిన్స్‌ కలెక్షన్‌ ఉండేది. అన్నీ మంచిగా సెట్‌ చేసుకునేవాడు నేను చిందరవందర చేసేదాన్ని. తర్వాత నాకు తెలిసిన విషయమేంటంటే నాకు కాయిన్స్‌ అంటే ఎలర్జీ అని. దాంతో వాటి జోలికి వెళ్లడం మానేశాను.


రాఖీ విలువ తెలిసింది

రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి?
పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు.
ఆకాశ్‌: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను.

పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్‌ అంటే ఇష్టం?
ఆకాశ్‌: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్‌ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ).
పవిత్ర: లాస్ట్‌ ఇయర్‌ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్‌ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్‌ నుండి ఒక బ్యాగ్‌ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం.
ఆకాశ్‌: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్‌ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి  ప్లాన్‌ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్‌ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్‌ ఇయర్‌ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్‌ బ్యాగ్‌ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్‌ ఉంది. కానీ సర్‌ప్రైజ్‌.
పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ).

ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్‌’ ఎవరైనా ఉన్నారా?
పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్‌ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్‌ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్‌ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్‌ తీసుకుంటాను.

మీ ఇద్దరూ పర్సల్‌ విషయాలు షేర్‌ చేసుకుంటారా?
పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్‌ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్‌ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు   విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్‌ ఏముంటాయి?

మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్‌ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్‌?
పవిత్ర: సినిమా షూటింVŠ  టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్‌ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని  మేం  కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్‌ చేసి షూటింగ్‌ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్‌ న్యాయం చేశాడు. రివ్యూస్‌ ఎలా వచ్చినా తను డల్‌ అవ్వటం ఉండదు.
ఆకాశ్‌: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్‌ గురించి మాట్లాడరు. ఫస్ట్‌ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్‌ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్‌ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను.

అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు – పవిత్ర
మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్‌ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా?
ఆకాశ్‌: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్‌ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్‌ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే.

పవిత్ర ఎలాంటి కెరీర్‌లో సెటిల్‌ అవ్వాలనుకుంటోంది?
ఆకాశ్‌: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్‌ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్‌ అయిపోగానే ప్రొడక్షన్‌లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్‌ తెచ్చిస్తుంటారు.

ప్రొడక్షన్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్‌పుట్స్‌ తీసుకుంటారు?
పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్‌ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు.

కాలేజీలో మీరు డైరెక్టర్‌ పూరీ డాటర్‌ అని అందరికీ తెలుసా?
పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్‌షిప్‌ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి  తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్‌ అవుతాను.

డ్రగ్స్‌ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్‌ అయినట్లు అనిపించింది..
పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్‌ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్‌ హౌస్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్‌ ఉంది అని మా అమ్మను ఇన్‌వాల్వ్‌ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్‌ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు.  ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్‌ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్‌ చేశాను.
ఆకాశ్‌: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్‌ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్‌ చేస్తూ, నాకు చాలా కాల్స్‌ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్‌ ఎ ఫెంటాస్టిక్‌ జాబ్‌.

పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా?
ఆకాశ్‌: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్‌ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు.
పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ).

అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్‌ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు?
ఆకాశ్‌: ఏమో స్క్రిప్ట్‌ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం.
పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు.

పవిత్ర ఇచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌?
ఆకాశ్‌: కాంప్లిమెంట్‌ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్‌ అందరితో ఫుల్‌ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్‌.

యాక్టర్‌గా ప్రూవ్‌ చేసుకోవాలంటే నీ డ్రీమ్‌ రోల్‌?
ఆకాశ్‌: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్‌ ఇలా చాలెంజింగ్‌ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్‌ టచ్‌ చేయాలనేది నా డ్రీమ్‌.

నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్‌. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్‌ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా?
పవిత్ర: ఫస్ట్‌ నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్‌ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్‌లో సక్సెస్‌ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్‌ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్‌ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్‌ వాళ్లు.

అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా?
పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్‌ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్‌ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్‌ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్‌ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్‌ అండ్‌ హాఫ్‌ ఇయర్‌ ముందే తను బ్యాంకాక్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్‌ దగ్గర వీటి గురించి డిస్కస్‌ చే సేవాడు. అందుకే ఫస్ట్‌ డే షూటింగ్‌లో తన ఎగై్జట్‌మెంట్‌ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్‌ అయ్యాను.

ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి..
ఆకాశ్‌: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు.
పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్‌లో ఆకాశ్‌ సరదాగా ఆశీర్వదించాడు.   

మరిన్ని వార్తలు