రకుల్ ఫిట్ సింగ్

26 Jun, 2015 23:19 IST|Sakshi
రకుల్ ఫిట్ సింగ్

మై ఫిట్‌నెస్ మంత్ర
డోంట్ టార్చర్ యువర్ బాడీ బై స్టార్వింగ్...
టార్చర్ యువర్ బాడీ బై వర్కింగ్ అవుట్ రైట్.

ఇంత మేకప్ పూసుకొని ఓ జత టైట్ దుస్తులేసుకొని హీరోతో
రెండు స్టెప్పులు... హీరో వాళ్లమ్మతో రెండు డైలాగులు... విలన్‌తో
మూడు కసుర్లు... ఇదీ సగటు హీరోయిన్ పాత్ర.
కొంచెం బొద్దుగా ఉన్నా లైటింగ్‌తో మేనేజ్ చేసేయొచ్చు.

అదీ కుదరకపోతే కెమెరా యాంగిల్‌తో మేనేజ్ చేసేయొచ్చు.
కాని - రకుల్‌ప్రీత్‌సింగ్‌కి మాత్రం ఏ సబ్ జాన్తానై...
ఐయామ్ ఫిట్ ఫర్ ద స్క్రీన్... ఫిటర్ ఫర్ లైఫ్ అంటుంది రకుల్ ఫిట్‌సింగ్!
ఏం తినాలి, ఏం తినకూడదు... ఏం చేయాలి, ఏం చేయకూడదు ఫిట్‌సింగ్ మాటల్లో...

 
ఫిట్‌నెస్ గురించి మీకెప్పుడు అవగాహన ఏర్పడింది?
మా నాన్నగారు ఆర్మీలో ఉంటారు. అందుకని ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇస్తారు. నా చిన్నప్పుడు ఆయనతో కలిసి కొన్ని వ్యాయామాలు చేసేదాన్ని. నాన్న జాగింగ్‌కి వెళ్లినప్పుడు నేనూ వెళ్లేదాన్ని. ఆ విధంగా చిన్నప్పుడే నాకు ఫిట్‌నెస్ మీద అవగాహన ఏర్పడింది. మోడల్‌గా చేయడం మొదలుపెట్టాక, కథానాయిక అయిన తర్వాత ఫిట్‌నెస్ మీద చాలా ఆసక్తి పెరిగింది. మోడల్‌గా మారిన తర్వాతే జిమ్ చేయడం మొదలుపెట్టాను. నన్ను ‘ఫిట్‌నెస్ సైకో’ అనొచ్చు.
 
జిమ్ వల్ల ఉపయోగం ఏంటి?
జిమ్ సెంటర్లో చెమటలు కారిపోయేలా వర్కవుట్లు చేసినప్పుడు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ చెమట రూపంలో బయటికొచ్చేస్తాయి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. జిమ్ వల్ల బరువు తగ్గుతాం. అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. అందుకే నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. దానికి బానిస అయిపోయాను. ఒక్కరోజు జిమ్ చేయకపోయినా చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్‌లో భాగంగా చేసే కొన్ని వర్కవుట్స్ తర్వాత కొంచెం నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి నాకు చాలా ఇష్టం.
 
జీరో సైజ్ మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారా?
నా ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. ఇంత ఎత్తున్నవాళ్లు జీరో సైజ్‌కి బాగుండరని నా ఫీలింగ్. నేను జీరో సైజ్ చేస్తే, తెర మీద కడ్డీలా కనిపిస్తాను. అందుకే దాని జోలికి వెళ్లను.
 
రోజుకి ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటారు?
చాలా తక్కువ మోతాదులో రోజుకి ఐదారు సార్లు తింటాను. అలా కొంచెం కొంచెం తినడమే మంచిది. ఒకేసారి కంచాలు కంచాలు తింటే... సునాయాసంగా బరువు పెరిగిపోతాం.
 
రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు?
ఆరు గంటలు నిద్రపోతాను. అది కూడా చాలా గాఢమైన నిద్ర అన్నమాట. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా నిద్రపోతే బద్ధకంగా అనిపిస్తుంది. నైట్ షూట్‌లో పాల్గొని తెల్లవారుజాము మూడు గంటలకు నిద్రపోయినా ఉదయం తొమ్మిది గంటలకల్లా నిద్ర లేచేస్తాను.
 
మామూలుగా మీరు అల్పాహారం తీసుకునే సమయం?
షూటింగ్ ఉన్నా లేకపోయినా ఉదయం నిద్రలేచిన అరగంటకు ఏదో ఒకటి తింటాను. అప్పటికి ఆకలికి నకనకలాడిపోతుంటా (నవ్వుతూ).
 
వెజిటెబుల్ సలాడ్స్ తింటారా?
ఆ పొరపాటు అస్సలు చేయను. ఒకప్పుడు తినేదాన్ని. ఆ తర్వాత మానేశాను.
 
అదేంటి.. సలాడ్స్ మంచిది అంటారు కదా?
అందరూ అవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. కానీ, పచ్చి కూరగాయలు తినడంవల్ల శరీరం బలహీనం అవుతుంది. ఎందుకంటే, అవి అరగడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఆకలి తెలియదు. ఆ కారణంగా ఒక పూట సరిగ్గా తినం. అసలు తినకుండా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. దాంతో గ్యాస్ ఫార్మ్ అవుతుంది. బరువు పెరుగుతాం.
 
బియ్యంలో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ అనీ, అవి తినకూడదని అంటుంటారు..?
కార్బో హైడ్రేట్స్ తీసుకోవడం వృథా అని కొంతమంది అంటారు. కానీ, మనం తీసుకునే ప్రోటీన్ ఫుడ్ అరగాలంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. అందుకే నేను ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్ రెండూ ఉండేలా చూసుకుంటాను.
 
రోజుకి ఎంతసేపు వర్కవుట్స్ చేస్తారు?
దాదాపు గంటన్నర. రకరకాల వర్కవుట్స్ చేస్తాను. కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంటాను. వర్కవుట్ చేసిన తర్వాత ఆకలి అనిపిస్తే ఎగ్ వైట్స్ తింటాను.
 
వర్కవుట్స్ వల్ల మాత్రమే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తగ్గుతుందా?
మనం తీసుకునే ఆహారంలో ఉన్న కొవ్వుని కరిగించేందుకు శరీరానికి శక్తి కావాలి. ఆ శక్తి కోసం మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. అప్పుడు వర్కవుట్ చేస్తే ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప బరువు తగ్గాలని ఆహారం తీసుకోకుండా వర్కవుట్స్ చేస్తే, బలహీనంగా తయారవుతాం.
 
వారం పొడవునా ఆహార నియమాలు పాటిస్తారా?
ఆదివారం మాత్రం నియమాలు లేవు. ఆ ఒక్కరోజు మాత్రమే స్పైసీ ఫుడ్ తింటాను. బిర్యానీ, ఐస్‌క్రీమ్ అన్నీ లాగించేస్తాను. స్పైసీ ఫుడ్ రోజూ తినకూడదు. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అసిడిటీ ఏర్పడుతుంది. మళ్లీ దాన్ని చల్లార్చడానికి ఐస్‌క్రీములూ, గట్రా తింటాం. అది హాని చేస్తుంది.
 
షూటింగ్స్ కోసం ఊళ్లు తిరుగుతుంటారు కాబట్టి, ఓ ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడానికి ఎలా కుదురుతుంది?

నేనెక్కడికెళ్లినా ఓ పెద్ద లగేజ్ ఉంటుంది. ఓ స్టవ్, కుక్కర్ తప్పనిసరిగా ఉంటాయి. నాక్కావల్సినవన్నీ నా కుక్‌తో చేయించుకుని తింటాను. స్టీమ్డ్ ఫిష్ ఒక్కటే బయట తెప్పించుకుంటాను. మరీ కుదరకపోతే బయటి ఫుడ్ తింటాను. అది కూడా ఆయిల్ ఫుడ్, స్పైసీవి ఆర్డర్ చేయను.
- డి.జి. భవాని
 
బ్రేక్‌ఫాస్ట్

స్కిమ్‌డ్ మిల్క్‌తో ఓట్స్ లేదంటే ముస్లి తీసుకుంటాను. అలాగే, త్రీ ఎగ్ వైట్స్‌తో చేసిన ఆమ్లెట్ తింటాను.
బ్రేక్‌ఫాస్ట్ ఏడు గంటలకు చేశాననుకోండి మూడు గంటల తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటాను. కానీ, అరటిపండు మాత్రం వారానికి రెండు సార్లే తింటాను.
పదింటికి పండ్లు తిన్న తర్వాత మళ్లీ ఆకలి అనిపిస్తే పన్నెండు గంటలకు డ్రై ఫ్రూట్స్ తింటాను.

లంచ్
సరిగ్గా ఒంటి గంటకు లంచ్ తీసుకుంటా. ‘కిన్వా’ అనే బియ్యం ఉంటుంది. దాంతో వండిన అన్నం, పప్పు, స్టీమ్డ్ చికెన్ లేక ఫిష్ తింటాను. దాదాపు రోజూ ఇదే మెనూ.
 ఈవినింగ్ స్నాక్స్
లంచ్ తర్వాత రెండు గంటలకు కొన్ని ఫ్రూట్స్ తింటాను. ఒక్కోసారి స్ట్రాబెర్రీస్‌ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి, పెరుగులో వేసి, ఫ్రిజ్‌లో పెడతాను.. దాదాపు నాలుగు గంటల సమయంలో  స్నాక్స్‌లా ఇవి తింటాను. ఆరు గంటల ప్రాంతంలో వేరే పండ్లు ఏమైనా తింటా.

డిన్నర్
నిద్రపోయే మూడు, నాలుగు గంటలకు ముందే డిన్నర్ తీసుకుంటాను.
గ్రిల్డ్ ఫిష్, ఒకటీ లేదీ రెండు రోటీలు, పాలక్, పప్పు.. ఇవన్నీ తీసుకుంటాను. ఒకవేళ ఇవేవీ దొరకని పరిస్థితిలో ఒక ఆమ్లెట్ తయారు చేయించి, రోటీలో రోల్ చేసి అది తింటాను. ఆమ్లెట్‌ను ఆకు కూర, పుట్టగొడుగులు కలిపి తయారు చేయిస్తాను. ఇది చాలా హెల్దీగా ఉంటుంది.  నాకు ప్రత్యేకంగా కుక్స్ ఉన్నారు. షూటింగ్ లొకేషన్లో నాతో పాటే ఉంటారు. వాళ్లు తయారు చేసి, ఇస్తారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు