మరోసారి ఎన్టీఆర్‌గారికి వెన్నుపోటు పొడిచారు

30 Mar, 2019 00:35 IST|Sakshi

‘‘ఎన్టీ రామారావుగారికి మరొక్కసారి వెన్నుపోటు జరిగింది. ఎందుకంటే.. అప్పట్లో ‘సింహగర్జన’ సభ పెట్టుకోకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసి చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్‌ కానివ్వకుండా కుట్ర చేసి మళ్లీ వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు రామారావుగారికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఆయన కుటుంబం, పార్టీ కార్యకర్తలు అందరూ వెన్నుపోటు పొడిచారు. కానీ ఇవాళ మేమందరం రాజ్యాంగ హక్కుల ద్వారా ఆయన సినిమా రిలీజ్‌ చేయిస్తాం. మాకు కచ్చితంగా విజయం దక్కుతుంది అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విజయ్‌ కుమార్, యజ్ఞా శెట్టి ముఖ్యపాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీర్‌’. ఏ జీవి, ఆర్జీవీ ఫిల్మ్స్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ చిత్రం నిన్న ఆంధ్రప్రదేశ్‌ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు.

ఏపీలో రిలీజ్‌ ఆపమని హై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కప్రాంతం మినహా సినిమా రిలీజ్‌ని ఆపడమనేది కరెక్ట్‌ కాదు. ఏ దర్శకుడైనా సినిమా తీసేది ప్రేక్షకుడికి చూపించడానికే. కొందరు చూడటానికి వీలు లేదు అని చెప్పడం అన్యాయమే కదా? అందరికీ సినిమా చూడాలనే కోరిక ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చూడకూడదంటే ఎలా? ఒక్కచోట రిలీజ్‌ అయితే అన్నిచోట్లా సినిమా రిలీజ్‌ అయినట్టే. సోషల్‌ మీడియా వల్ల మొత్తం తెలిసిపోతుంది. సినిమాను ఆపాలనుకుని ప్రయత్నిస్తే వాళ్లకే ఎక్కువ నష్టం జరుగుతుంది. 

►ఓ డెమోక్రటిక్‌ కంట్రీలో రియలిస్టిక్‌ మూవీ తీసినప్పుడు మీరు చూడకూడదని ఆపేయడం కరెక్ట్‌ కాదు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాను నిర్మించిన రాకేష్‌ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని నాకు తెలియదు. ఒకవేళ తెలిసుంటే సినిమా తీయనని చెప్పడం లేదు. ఈ సినిమా వైసీపీకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ల మనిషిని ఎందుకు నిర్మాతగా పెడతారు. ఆ డబ్బేదో నాకే ఇస్తారు కదా? లేకపోతే ఊరూ పేరూ లేని వాళ్లతో తీయిస్తారు. సినిమాలో ఉన్న నిజానిజాలు బయటకు రాకూడదన్నది వాళ్ల భయం తప్పితే ఎవరు తీశారన్నది సమస్యే కాదు. 

►ఎన్టీఆర్‌గారి జీవితంలో జరిగిన కథ అందరికీ తెలుసు. ఆ సంఘటనలను ఏ విధంగా  చూపించాలా అనే ఎగై్జట్‌మెంట్‌తో ఈ మూవీ స్టార్ట్‌ చేశాను. ఎన్టీఆర్‌గారు చక్రవర్తిలా బతికారు. వైస్రాయ్‌ ఘటన జరిగినప్పటి నుంచి చనిపోయేవరకు ఆయన పడ్డ మానసిక వేదనకు నేను బాగా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. 

►డెమోక్రసీలో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను చెప్పే హక్కు మనందరికీ ఉంది. ఈ మధ్య ‘పద్మావత్‌’, ఉడ్తా పంజాబ్‌’ సినిమా సమయాల్లో సుప్రీమ్‌ కోర్టు ఓ జడ్జిమెంట్‌ ఇచ్చింది. సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చాక ఆ సినిమాను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు అన్నది దాని సారాంశం. కానీ ఊహించని విధంగా మా సినిమా రిలీజ్‌పై స్టే రావడం సర్‌ప్రైజ్‌. సాధారణంగా కోర్టులు నిష్పక్షపాతంగా ఉంటాయి. కోర్టుపై ఒత్తిడి ఎవరు తెచ్చి ఉంటారో మనందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పకపోవడం ధైర్యం లేకపోవడం కాదు. నేను చెప్పినా చెప్పకపోయినా దీని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి. 

►కోర్టువాళ్లు ఆదేశించిన విషయాన్ని గౌరవిస్తూ సినిమాను ఆపేశాం. వేరే కోర్టును ఆశ్రయించడానికి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. నిర్మాత రాకేశ్‌ రెడ్డిగారు ఆ పనిలో ఉన్నారు. వీలున్నంత త్వరగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విడుదలయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరికీ సినిమాను ఒకేసారి చూపించాలనుకుంటాం. కుదరకపోతే వాళ్లు అప్పుడూ గెలిచిట్టే, ఇప్పుడూ గెలిచినట్టే. ప్రేక్షకుడు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పడానికి, రిలీజ్‌ అయిన థియేటర్స్‌లో వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్‌ బోర్డ్సే నిదర్శనం. ఎన్టీఆర్‌గారి జీవితం తుది దశలో ఏం జరిగిందో తెలుసు కోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నిజం ఇవాళ బయటకు వచ్చింది. కొందరికి ఇవాళ తెలుస్తుంది. కొందరికి రేపు. కానీ అందరికీ కచ్చితంగా తెలుస్తుంది.
దర్శకుడిగా మనం ఎలాంటి కథ చెబుతున్నాం అన్న విషయాన్ని బట్టి సీరియస్‌నెస్‌ వస్తుంది.

నేను చెబుతున్నది ఎంతో చరిత్ర కలిగి ఉన్న రామారావుగారి కథ. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో లక్ష్మీ పార్వతిగారికి, ఎన్టీఆర్‌గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఆ బంధాన్ని ఉపయోగించుకొని కొందరు రాజకీయ కుట్ర ఎలా నడిపించారు? ఆయన్ను ఎలాంటి మానసిక క్షోభకు గురి చేశారు? అనే అంశాలను చూపించాం. శేఖర్‌కపూర్‌ తీసిన ‘బాండిట్‌ క్వీన్‌’ సెన్సార్‌ సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్‌ వాళ్లు చాలా కట్స్‌ చెప్పారు. ఆ తర్వాత రివైజింగ్‌ కమిటీకు వెళ్తే వాళ్లు సినిమా బ్యాన్‌ చేయాలన్నారు. దాన్ని దాటి పైదానికి వెళ్తే ఒక్క కట్‌ కూడా లేకుండా రిలీజ్‌ చేసుకోండి అని చెప్పారు. మూడు కమిటీలు. మూడు భిన్న అభిప్రాయాలు. సినిమా రిలీజ్‌ అయింది. మళ్లీ ఎవరో కేస్‌ వేశారు.  కేసు సుప్రీమ్‌ కోర్టుకు వెళ్లింది. కోర్టు సినిమా రిలీజ్‌ చేసుకోవచ్చు అని చెప్పింది. 

►నిజం అనే దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. సరైన వీడియో ప్రూఫ్‌ లేనప్పుడు నిజాన్ని నిర్ధారించలేం. ఆ సమయంలో నేనూ లేను, మీరూ లేరు. 25 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. అప్పుడు ఉన్నవాళ్లను అడిగినా కూడా వాళ్లకు అనుకూలంగానే చెబుతారు. నిజం అనేది నమ్మేట్టుగా ఉండాలి. ఒకవేళ కాదు అంటే ఆల్టర్నేటివ్‌ ఏంటి అనేది చెప్పగలగాలి. అలా చెబితే మీ సినిమా మీరు తీసుకోండి. నేను రీసెర్చ్‌ చేసి, అందులో తెలుసుకున్న నిజాలను మనస్ఫూర్తిగా నమ్మి తీసిన సినిమా ఇది. 

►హై కోర్టు కౌన్‌ కిస్కా వాళ్ల మాటలు వినదు కదా. స్టే ఎత్తేయడానికి సుప్రీమ్‌ కోర్టుకు వెళ్లాం. ప్రాసెస్‌లో ఉంది. ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది అని జోస్యం చెప్పలేను. ఎందుకంటే నేను కోర్టు నడపను, ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రినీ కాదు. ప్రధాన మంత్రిని కూడా కాదు. ఫైట్‌ చేస్తాం. 

►ప్రతీ సినిమాకో సీజన్‌ ఉంటుంది. సంక్రాంతి, సమ్మర్, దసరా ఇలా. మా సినిమాలో పొలిటికల్‌ క్యారెక్టర్స్‌ ఉండటం వల్ల సినిమాకు హైప్‌ తీసుకురావడానికి ఎలెక్షన్‌ టైమ్‌ ఎంచుకున్నాం తప్పితే ప్రేక్షకులను ప్రేరేపించాలనే ఉద్దేశమే లేదు. 

►సినిమా ఓ ఎమోషన్‌ తీసుకొస్తుంది. అది చూసి ఇలా జరిగిందా? అని నమ్మితే మీకు అంతకుముందు ఆ నాయకుల మీద ఉన్న ఇంప్రెషన్‌ పోవచ్చు. ఎన్నికల ముఖ్య ఉద్దేశం నమ్మకమే. సినిమా వల్ల ఆ ప్రభావం కొంత పడొచ్చు. ఎంత పడుతుంది, ఏ రేంజ్‌లో పడుతుందో చెప్పలేను. సినిమాకు వస్తున్న స్పందన పట్ల 100 శాతం సంతృప్తి చెందాను. ‘ఎన్టీఆర్‌గారికి నిజమైన వారసుడు మీరే’ అని నాకు ఎవరో ఓ మెసేజ్‌ పంపారు. అదే నేను అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌. ఈ సినిమాను కథకుడిగా తీశా. సినిమా డబ్బుతో కూడుకున్నది కాబట్టి వ్యాపారంగానే తీశాను. రాజకీయంగా మాత్రం తీయలేదు.

నిర్మాత రాకేశ్‌ రెడ్డి మాట్లాడుతూ...
‘‘ఇవాళ తెలుగువారందరికీ శుభదినం. కానీ ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకు బ్లాక్‌ డే. ఈ సినిమా ఏపీలో రిలీజ్‌ కాదని మేం ఎవ్వరూ ఊహించలేదు. వర్మగారి దమ్ము, ధైర్యాలు అందరికీ తెలిసిందే. సినిమాలో నిజం ఉంది కాబట్టే వాళ్లు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. న్యాయం గెలుస్తుంది. కొందరు స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. బడ్జెట్‌ ఎంత? వచ్చే డబ్బెంత? అని కాదు. వెయ్యి కోట్లకు సరి పడా పేరు వచ్చింది.

 

మరిన్ని వార్తలు